విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ షురూ? బాబుపై విజయసాయి విమర్శలు
సంచలన వ్యాఖ్యలు చేశారు వైసీపీ సీనియర్ నేత విజయసాయి రెడ్డి.
By: Tupaki Desk | 13 Sep 2024 4:57 AM GMTసంచలన వ్యాఖ్యలు చేశారు వైసీపీ సీనియర్ నేత విజయసాయి రెడ్డి. సోషల్ మీడియాలో ఆయన చేసిన వరుస పోస్టులు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి. విశాఖ ఉక్కు కర్మాగారాన్నిప్రైవేటీకరణ చేసే దిశగా చంద్రబాబు నేత్రత్వంలోని కూటమి ప్రభుత్వం కుట్ర చేస్తుందని విమర్శ చేశారు. వైజాగ్ స్టీల్ ప్లాంట్ ను కాపాడే విషయంలో చంద్రబాబు ఫెయిల్ అయ్యారన్న విజయసాయి.. అందుకు కారణాన్ని ఎత్తి చూపుతూ ఆసక్తికర అంశాల్ని తెర మీదకు తీసుకొచ్చారు. భయపడినట్లే జరిగిందని.. చంద్రబాబు హయాంలో వైజాగ్ స్టీల్ ప్లాంట్ మూసివేత ప్రక్రియ షురూ అయినట్లుగా కొత్త బాంబు పేల్చారు.
బ్లాస్ట్ ఫర్నేస్ 3ను నిలిపివేయటం అంటే స్టీల్ ఫ్యాక్టరీ ఉద్యోగుల గొంతు కోయటమేనన్న ఆయన.. ‘‘తెలుగు జాతికి ఇది పెద్ద ద్రోహం. గతంలో చంద్రబాబు ఇచ్చిన హామీలన్నీ యథావిధిగా గాలికి కొట్టుకుపోయినట్లే.. ఈ సంక్షోభ సమయంలో ఆయన మౌనం ఎన్డీయే కేంద్ర ప్రభుత్వానికి, ఉక్కు మంత్రిత్వ శాఖకు రాష్ట్ర ప్రభుత్వ పచ్చజెండా ఊపటమేనని భావించొచ్చు’’ అంటూ మండిపడ్డారు. ఈ సందర్భంగా మరిన్ని వ్యాఖ్యలతో పోస్టులు పెట్టారు.
విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అన్న నినాదంతో 32 మంది ప్రాణత్యాగం ఉద్యమాల ఫలితమే వైజాగ్ స్టీల్ అన్న విజయసాయి.. ఇప్పుడు దాన్ని రక్షించే వారు లేక అనాథ అయ్యిందన్నారు. కేంద్రంలో భాగస్వామిగా ఉననా చంద్రబాబు స్టీల్ ఫ్లాంట్ ను కొనసాగించే ప్రయత్నం చేయకపోవటాన్నిక్షమించరాని ద్రోహంగా ఆయన పేర్కొన్నారు. ‘‘వేలాది మంది కార్మికులు జీవితాలు రోడ్డున పడ్డట్లే.. స్టీల్ ఫ్యాక్టరీ ఆలంబనగా వైజాగ్ లో ఎగిసిపడిన ఒక ఆర్థిక వ్యవస్థ ఇక ఛిద్రమైనట్లే. చంద్రబాబు మోసాన్ని.. కాపాడే శక్తి ఉన్నా నిర్లప్తంగా ఉండటాన్ని రాష్ట్ర ప్రజలు క్షమించరు’’ అంటూ మండిపడ్డారు.
జగన్ ముఖ్యమంత్రిగా ఉన్న ఐదేళ్లు.. వైజాగ్ స్టీల్ ను కంటికి రెప్పలా కాపాడారన్న విజయసాయి..మూత వేయటమే పరిష్కారం కాదని జగన్ పలుమార్లు చెప్పారన్నారు. స్టీల్ ఫ్యాక్టరీని స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియాలో కానీ.. ఎన్ఎండీసీలో కానీ విలీనం చేసి ఇనుప ఖనిజపు గనులు కేటాయిస్తే లాభాల్లోకి తీసుకురావొచ్చన్నారు. ఐదేళ్లు మౌనంగా ఉన్న కేంద్రం ఇప్పుడు హటాత్తుగా మూసివేతకు సాహసం చేస్తోందంటే.. చంద్రబాబుస్వప్రయోజనాలు.. ఆయన వైఖరే కారణమనటంలో సందేహం లేదన్నారు.
వైజాగ్ ఎంపీ భరత్.. టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ పదవుల్లో కొనసాగే నైతిక హక్కు లేదన్న విజయసాయి.. తక్షణమే రాజీనామా చేసి స్టీల్ ప్లాంట్ ఫ్యాక్టరీ కార్మికులతో కలిసి పోరాటానికి సిద్ధం కావాలన్నారు. ప్రజాప్రతినిధులుగా ఉండి ఎవరూ పెదవి విప్పటం లేదన్న విజయసాయి.. ‘‘కేంద్రంతో స్వార్థ ప్రయోజనాల కోసం లాలూచీ పడ్డారని తెలిసిపోతోంది. ఉత్తరాంధ్ర తలను తీసేయటంగా భావించే ఈ దుర్మార్గాన్ని ప్రజలంతా ఎండగట్టాలి’’ అని మండిపడ్డారు.
వైసీపీ డెవలప్ చేసిన ఓడరేవులు.. ఫిషింగ్ హార్బర్లు.. విద్యా సంస్థలు.. విద్యుత్ కేంద్రాలను కూడా చంద్రబాబు అమ్మకానికి పెడతారన్నవిజయసాయి.. ‘‘మనం కళ్లు మూసుకొని ఉంటే ఏమైనా చేస్తాడు చంద్రబాబు. టీడీపీ మొదటి నుంచి వైజాగ్ సంపదను వ్యక్తిగతంగా కొల్లగొట్టుకునే బంగారు గనిలా భావిస్తోంది. అక్కడి ప్రజల పట్ల ఎలాంటి నిబద్ధత.. అనుబంధం పార్టీకి లేవు. తన ప్రయోజనాలను కాపాడుకోవటమే చంద్రబాబు లక్ష్యం. ఇది ఒక్క వైజాగ్ నగరానికే కాదు.. మిగిలిన అన్ని నగరాలు.. పట్టణాలకు ఇదే గతి’’ అంటూ తీవ్రంగా విరుచుకుపడ్డారు. విజయసాయి లేవనెత్తిన ఆరోపణలకు చంద్రబాబు అండ్ కో ఏ రీతిలో రియాక్టు అవుతారోచూడాలి.