ఎక్కడ ఏ కేసు పెట్టినా A2 నేనే? విజయసాయిరెడ్డి వ్యంగ్యం
రాజకీయాలు వదిలేసినా తనను A2 నెంబర్ మాత్రం వదలడం లేదని మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి సరదాగా వ్యాఖ్యానించారు.
By: Tupaki Desk | 12 March 2025 6:29 PM ISTరాజకీయాలు వదిలేసినా తనను A2 నెంబర్ మాత్రం వదలడం లేదని మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి సరదాగా వ్యాఖ్యానించారు. సీబీఐ, ఈడీ కేసుల్లో మాజీ జేడీ లక్ష్మినారాయణ ఇచ్చిన నంబర్ ను స్టాండడైజ్ చేసేశారన్నారు. ఎక్కడ ఏ కేసు పెట్టినా తాను A2 అవుతున్నారని వ్యాఖ్యానించారు. కాకినాడ సీపోర్టు వాటాల బదిలీపై సీఐడీ నమోదు చేసిన కేసులో ఈ రోజు విజయసాయిరెడ్డి విచారణకు హాజరయ్యారు. విచారణ అనంతరం మీడియాతో మాట్లాడిన విజయసాయిరెడ్డి పలు అంశాలపై స్పందించారు. తన A2 పాత్రపైనా విజయసాయిరెడ్డి వ్యాఖ్యలు చేయడం ఆసక్తికరంగా మారింది.
కాకినాడ సీపోర్టులో A1 విక్రాంత్ రెడ్డితో తనకు ఎలాంటి సంబంధం లేదని విజయసాయిరెడ్డి తెలిపారు. ఈ కేసులో తనను A2గా పెట్టడానికి వేరే కారణాలు ఏవీ లేవని, సీబీఐ 11 కేసుల్లో, ఈడీ పెట్టిన 10 కేసుల్లో తాను A2గా ఉన్నందునే కాకినాడ పోర్టు కేసులోనూ A2గానే పెట్టారన్నారు. ఎక్కడ ఏ కేసు పెట్టినా తనను A2 చేస్తున్నారని విజయసాయి వ్యాఖ్యానించారు. రాజకీయాలకు దూరంగా ఉన్నా కేసులు ఏంటి? అన్న ప్రశ్నకు ఆయన బదులిచ్చారు. ఈ కేసు దాఖలు చేసినప్పుడు తాను రాజీనామా చేయలేదన్నారు.
ఇక ఈ కేసులో వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డిని తప్పించేందుకు విక్రాంత్ రెడ్డితో కలిసి తాను పనిచేస్తున్నానని సీఐడీ ప్రశ్నించిందని విజయసాయిరెడ్డి తెలిపారు. అరబిందో నుంచి కాకినాడ పోర్టు యాజమాన్యానికి డబ్బు బదిలీ అయిన విషయం వాస్తవమే అయినా, ఆ డబ్బు బదిలీకి, ఆ కంపెనీకి తనకు ఎలాంటి సంబంధం లేదన్నారు. నాకు తెలిసినంత వరకు ఈ కేసులో జగన్మోహనరెడ్డి పాత్ర లేదని, అరబిందో, కేవీ ఆర్ కు మధ్య డీల్ చేసింది విక్రాంత్ రెడ్డేనంటూ ఆయన మరోసారి స్పష్టం చేశారు. తనపై కేసు పెట్టిన కేవీ ఆర్ రాజకీయ దళారీగా వ్యాఖ్యానించిన విజయసాయి అతడంటే తనకు అసహ్యమన్నారు.