వైఎస్ విజయమ్మ లేఖపై 6 కీలక పాయింట్లు లేవనెత్తిన వైసీపీ!
ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్, షర్మిల మధ్య జరుగుతున్న ఆస్తులకు సంబంధించిన వివాదాల విషయం తీవ్ర సంచలనంగా మారిన సంగతి తెలిసిందే.
By: Tupaki Desk | 30 Oct 2024 3:52 AM GMTఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్, షర్మిల మధ్య జరుగుతున్న ఆస్తులకు సంబంధించిన వివాదాల విషయం తీవ్ర సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారంపై వైసీపీ నుంచి వరుసగా ఎదురు ప్రశ్నలు, కౌంటర్లు పడుతుండగా.. వాటికి షర్మిల స్పందిస్తూ, సమాధానాలు చెబుతూ, విమర్శలు గుప్పిస్తూ ముందుకు సాగుతున్నారు.
ఈ సమయంలో పలువురు వైసీపీ నేతలూ స్పందించారు. ఈ నేపథ్యంలో వైఎస్ విజయమ్మ ఓ బహిరంగ లేఖ రాశారు. అందులో పలు విషయాలు ప్రస్థావించారు. దీంతో... ఆస్తుల విషయంలో షర్మిల మాటే విజయమ్మ మాట అనే చర్చా మొదలైంది! షర్మిల పేరు మీద కొన్ని, జగన్ పేరు మీద కొన్ని ఆస్తులు రాశారే తప్ప పంచలేదని ఆమె తెలిపారు.
ఇకపై ఈ విషయంపై ఎవరూ మాట్లాడొద్దని విజ్ఞప్తి చేశారు. వాళ్లిద్దరూ అన్నాచెల్లెల్లు.. వారి సమస్యను వారే పరిష్కరించుకుంటారు.. తాను నమ్మిన సమాధాన కర్త అయిన దేవుడు ఈ సమస్యకు పరిష్కారం చూపిస్తారని ఆమె క్లారిటీ ఇచ్చారు! ఈ నేపథ్యంలో... కొన్ని అంశాలు ఆమె ముందుకు, ప్రజల ముందుకు తీసుకు వస్తున్నాం అంటూ బహిరంగా లేఖ రాసింది వైసీపీ!
అవును... జరుగుతున్న వ్యవహారంపై ఇప్పటికే వైఎస్ షర్మిల మూడు పేజీల బహిరంగ లేఖ రాయగా.. తాజాగా వైఎస్ విజయమ్మ ఓ లేఖను విడుదల చేశారు. ఈ నేపథ్యంలో.. ఆమె ప్రస్థావించని అత్యంత కీలక విషయాలు ఉన్నాయన్నట్లుగా వాటిని గుర్తుచేస్తూ వైసీపీ ఓ బహిరంగా లేఖ రాసింది. ఇప్పుడు ఇది ట్రెండింగ్ అంశంగా మారింది.
"దివంగత మహానేత వైఎస్సార్ గారి భార్యగా, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, మజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తల్లిగా శ్రీమతి విజయమ్మగారిని అమితంగా గౌరవిస్తాం" అంటూ.. వైఎస్సార్ గారి కుటుంబం వ్యవహారంపై ఆమె బహిరంగ లేఖ విడుదల చేసిన నేపథ్యంలో కొన్ని అంశాలను ఆమె ముందుకు, ప్రజల ముందుకు తీసుకొస్తున్నామని వైసీపీ తెలిపింది.
ఈ సందర్భంగా... ఆరు కీలక అంశాలను లేవనెత్తింది. అవేమిటో ఇప్పుడు చూద్దామ్!!
1) విజయమ్మ రాసిన లేఖలో జగన్ ని లీగల్ గా ఇబ్బంది పెట్టేందుకు, తద్వారా బెయిల్ రద్దుకు జరిగిన కుట్ర వ్యవహారాన్ని కనీసం ప్రస్థావించకపోవడం ప్రజలను పక్కదోవ పట్టించడమే.
సరస్వతి కంపెనీ విషయంలో ఈడీ అటాచ్ మెంట్స్ ఉన్నప్పటికీ.. తెలంగాణ హైకోర్టు స్టేటస్ కో ఆదేశాలు ఉన్నప్పటికీ.. యాజమాన్య బదిలీ జరిగేలా క్రయ విక్రయాలు చేయకూడదని, అందుకే అటాచ్ మెంట్ లో ఉందనే విషయం అందరికీ తెలిసినప్పటికీ.. సరస్వతి విషయంలో ఎలాంటి మార్పులు, చేర్పులు చేయవద్దని సుప్రీంకోర్టు రిటైర్డ్ జడ్జిలు సహా న్యాయ సలహాలు ఉన్నప్పటికీ.. తప్పు అని తెలిసినప్పటికీ.. మోసపూరితంగా, కుట్రపూరితంగా షేర్లు బదిలీ చేసిన మాట వాస్తవమే కదా?
షర్మిల భావోద్వేగాలకు, ఒత్తిళ్లకు గురై జగన్ కి న్యాయపరంగా, చట్టపరంగా చిక్కులు తెచ్చే ఈ పనికి తెలిసి కూడా విజయమ్మ ఆమోద సంతకం పెట్టడం నిజమే కదా? విజయమ్మ లేఖలో ఈ అంశాన్ని పూర్తిగా విస్మరించడం ప్రజలను, వైఎస్సార్ అభిమానులను పక్కదోవపట్టించడమే కదా?
2) 2024 ఎన్నికలో జగన్ ఒక్కరే ఒకవైపున ఉంటే.. అటు వైపు చంద్రబాబు నేతృత్వంలో రాజకీయ ప్రత్యర్థులు జట్టు కడితే.. మరికొన్ని గంటల్లో ఎన్నికల ప్రచారం ముగుస్తుందనగా, దివంగత వైఎస్సార్ ని ఎఫ్.ఐ.ఆర్. లో పెట్టిన, తన కుమారుడిని అన్యాయంగా 16 నెలలు జైల్లో పెట్టిన కాంగ్రెస్ కు ఓటు వేయండంటూ, వైసీపీని ఇబ్బంది పెడుతూ వీడియో విడుదల చేసిన విజయమ్మ.. షర్మిల వైపు ఉన్నాననే విషయాన్ని స్పష్టంగా చెప్పారు.
వైఎస్సార్ రాజకీయ ప్రత్యర్థులకు, వైఎస్సా కుటుంబంపై నిరంతరం కుట్రలు పన్నే చంద్రబాబుకు రాజకీయంగా మేలు చేసే ఇలా వ్యవహరించడం ధర్మమేనా? రాజకీయాలు పక్కన పెడితే.. ఓ తల్లిగా ఆ రోజు విజయమ్మ మద్దతు సంగతి దేవుడెరుగు, కనీసం తటస్థ వైఖరి మరిచిపోయి, పక్షపాతం వహించిన వైనం చూసి వైఎస్సార్ అభిమానులు తీవ్రంగా కలత చెందారు, బాధపడ్డారు.
3) ఇప్పుడు షర్మిల భావోద్వేగాలు, ఒత్తిళ్ల ప్రభావంతో.. సరస్వతి కంపెనీ వ్యవహారంలో న్యాయపరంగా ఇబ్బందులు వచ్చి, స్వయంగా ఆమె కుమారుడి బెయిల్ రద్దు కుట్రకు దారి తీస్తుందని తెలిసి కూడా మోసపూరితంగా.. షేర్ల సర్టిఫికెట్లు పోయాయని చెప్పి, ఒరిజినల్ షేర్ సర్టిఫికెట్ లేకుండా, జగన్ సంతకం లేకుండా, ఎవ్వరికీ తెలియకుండా, షేర్లను బదిలీ చేసి.. షర్మిలతోనే విజయమ్మ ఉన్నారని మరోసారి స్పష్టంగా చెప్పారు.
4) జగన్ కి షర్మిల రాసిన వ్యక్తిగత ఉత్తరం టీడీపీ సోషల్ మీడియాలో ప్రత్యక్షం కావడం, విజయమ్మ కూడా సంతకం చేసిన ఆ ఉత్తరాన్ని టీడీపీ వారు విడుదల చేయడం, పలు సందర్భాల్లో జగన్ పై షర్మిల అనుచిత వ్యాఖ్యలు చేసినా.. జగన్ ఏనాడూ తన చెల్లెలను ఉద్దేశించి ఒక్కమాట కూడా మాట్లాడకపోయినా.. విజయమ్మ ఏ రోజూ సరిదిద్దే కార్యక్రమం చేయకపోవడం, ఆమె వైఖరిని ప్రశ్నిస్తున్నాయి.
5) కోర్టులో ఉన్న కేసులను ప్రతికూల రీతిలో ప్రభావితం చేసేలా షర్మిల ప్రవర్తన, చర్యలు ఉన్నా.. ఒకవైపు ఆస్తులపై హక్కులు కోరుతూ.. మరోవైపు అందుకు విరుద్ధంగా వ్యవహరించినా.. తప్పుడు కేసులపై జగన్ చేస్తున్న పోరాటం, వాటి ఫలితాలు ఎలా ఉంటాయన్నదానిపై ఆమెకు ఎలాంటి ఆందోళన లేనట్ట్లు ప్రవర్తించినా.. జగన్ ను ఆర్ధికంగా, రాజకీయంగా దెబ్బ తీసేందుకు, బలహీనుడిని చేసేందుకు అనుగుణంగా ఆమె నడుచుకున్నా.. షర్మిల వేసిన ప్రతి అడుగు కూడా ప్రత్యర్థులకు లబ్ది చేకుర్చేలా ఉన్నా, మూడు నాలుగేళ్లుగా ఇంత జరుగుతున్నా.. ఓపికతో, సహనంతో, మౌనంగా ఆ బాధను జగన్ అనుభవించారు.
ఇలాంటి పరిస్థితుల్లో అసలు బాధితులు ఎవరు? ఒక తల్లిగా విజయమ్మ బసటగా ఎవరికి ఉండాలి? అన్న బలమైన ప్రశ్న ఇప్పుడు తలెత్తుతోంది.
6) రాజకీయాల పేరిట తెలంగాణలో అడుగుపెట్టినప్పటి దగ్గరనుంచి అవకాశం ఉన్నప్పుడల్లా జగన్ ని షర్మిల ఇబ్బందిపెడుతూనే ఉన్నారు. అక్కడ నుంచి ఒక్కసారిగా మాయమై.. వైఎస్సార్ ని ఎఫ్.ఐ.ఆర్.లో పెట్టిన పార్టీకి, అన్నను 16 నెలలు జైల్లో అక్రమంగా నిర్భందించిన పార్టీకి ఈ రాష్ట్ర అధ్యక్షురాలిగా వచ్చారు.
పోనీ రాజకీయాలు ఇంతే అనుకున్నా.. ప్రజాస్వామ్య విమర్శల పరిధిని దాటి, ఆజన్మాంత శత్రువు మాదిరిగా జగన్ ని షర్మిల అనరాని మాటలు అన్నారు. ఎన్నికల సమయంలో జగన్ పై దాడి జరిగితే ఎగతాళి చేసి, అమానవీయంగా మాట్లాడింది షర్మిల కాదా? వీటన్నింటినీ జగన్ ఓపికతో భరించారు. మరి రచ్చకెక్కింది ఎవరు? పరువు తీసింది ఎవరు? నిజమైన బాధితులు ఎవరు? జగనే బాధితులు కాదంటారా?