వైసీపీకి షాక్.. విజయమ్మ కీలక ప్రకటన!
ఆంధ్రప్రదేశ్ లో మరోసారి అధికారంలోకి రావాలని ఆశిస్తున్న వైసీపీ అధినేత వైఎస్ జగన్ కు గట్టి షాక్ తగిలింది.
By: Tupaki Desk | 11 May 2024 11:09 AM GMTఆంధ్రప్రదేశ్ లో మరోసారి అధికారంలోకి రావాలని ఆశిస్తున్న వైసీపీ అధినేత వైఎస్ జగన్ కు గట్టి షాక్ తగిలింది. ఆయన తల్లి విజయమ్మ సంచలన వీడియో విడుదల చేశారు. కడప ఎంపీ స్థానంలో తన కుమార్తె, పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలకు అనుకూలంగా విజయమ్మ వీడియో విడుదల చేశారు. కడప ఎంపీగా తన కుమార్తెను గెలిపించాలని ప్రజలకు పిలుపునిచ్చారు.
కడప ఎంపీ అభ్యర్థిగా వైసీపీ తరఫున వైఎస్ అవినాష్ రెడ్డి పోటీ చేస్తున్న సంగతి లె లిసిందే. 2014, 2019 ఎన్నికల్లో కడప ఎంపీగా వైఎస్ అవినాష్ రెడ్డి వైసీపీ తరఫున గెలుపొందారు. ఈసారి ఆయనపై ప్రత్యర్థిగా పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల బరిలోకి దిగారు. టీడీపీ తరఫున భూపేశ్ రెడ్డి పోటీ చేస్తున్నారు.
ఈ నేపథ్యంలో మే 11న ప్రచారం ముగియడానికి రెండు గంటల ముందు విజయమ్మ కీలక వీడియో ప్రకటన విడుదల చేశారు. కడప కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి వైఎస్సార్ కుమార్తె షర్మిలకు ఓటు వేసి గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.
‘‘వైఎస్సార్‌ను అభిమానించే, ప్రేమించే వారికి, కడప లోక్ సభా నియోజకవర్గ ప్రజలకు నా విన్నపం. వైఎస్సార్ ను మీరెంత ఎలా అభిమానించారో, ఏ విధంగా అక్కున చేర్చుకున్నారో, ఏ విధంగా నిలబెట్టుకున్నారో.. ఆయన కూడా ఆయన ఊపిరి ఉన్నంతవరకు ప్రజా సేవకే అంకితమయ్యారు. ప్రజా సేవ చేస్తూనే ఆయన చనిపోయారు. ఈ రోజు ఆయన ముద్దుబిడ్డ షర్మిలమ్మ ఎంపీగా పోటీ చేస్తోంది. ఆమెను ఆశీర్వదించండి. వైఎస్సార్ లాగా సేవ చేసే అవకాశాన్ని ఆమెకు కల్పించండి. కడప జిల్లా ప్రజలకు సేవ చేసే అవకాశం కల్పించండి. ఆమెను గెలిపించి పార్లమెంటుకు పంపాలని మిమ్మల్ని ప్రార్థిస్తున్నా’’ అని విజయమ్మ ఆ వీడియోలో విజ్ఞప్తి చేశారు.
ఎన్నికల షెడ్యూల్ వెలువడటానికి ముందే విజయమ్మ అమెరికా వెళ్లిపోయిన సంగతి తెలిసిందే. ఓవైపు తన కుమారుడు వైఎస్ జగన్ వైసీపీ అధినేతగా, ఏపీ ముఖ్యమంత్రిగా ఉన్నారు. మరోవైపు విజయమ్మ కుమార్తె షర్మిల పీసీసీ అధ్యక్షురాలిగా ఉన్నారు. దీంతో ఎవరో ఒకరి పక్షం తీసుకోవడం ఇష్టం లేకే ఆమె అమెరికా వెళ్లిపోయారని అప్పట్లో వార్తలు వచ్చాయి.
ఈ క్రమంలో ఎన్నికల ప్రచారానికి మరికొద్ది గంటల్లో తెరపడనున్న వేళ
విజయమ్మ వీడియో ప్రకటన హాట్ టాపిక్ గా మారింది. ఇప్పటికే వైఎస్ అవినాశ్ రెడ్డికి వ్యతిరేకంగా దివంగత మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి కుమార్తె సునీత, పీసీసీ అధ్యక్షురాలు షర్మిల తీవ్ర విమర్శలు చేస్తున్నారు.
తన బాబాయి వివేకాను అవినాశ్ రెడ్డి చంపించారని ఆమె ఆరోపిస్తున్నారు.
కడపలో ధర్మం, న్యాయం గెలవాలంటే తనను గెలిపించి ఓట్లేయాలని షర్మిల అభ్యర్థిస్తున్నారు. అప్పుడే తన బాబాయికి న్యాయం జరుగుతుందని ఆమె చెబుతున్నారు. మరోవైపు అవినాశ్ రెడ్డికి మద్దతుగా సీఎం వైఎస్ జగన్, ఆయన భార్య వైఎస్ భారతి, అవినాష్ రెడ్డి భార్య, సోదరీమణులు, తదితరులు భారీ ఎత్తున ప్రచారం చేశారు.
ఈ నేపథ్యంలో విజయమ్మ వీడియో ప్రకటన ద్వారా తన కుమార్తెను గెలిపించాలని పిలుపునివ్వడం హాట్ టాపిక్ గా మారింది. మరి కడప ప్రజలు అవినాశ్ కు పట్టం కడతారో లేక షర్మిలను గెలిపిస్తారో వేచిచూడాల్సిందే.