జగన్ షర్మిల మధ్యలో విజయమ్మ...!?
2009లో వైఎస్సార్ అకస్మాత్తుగా ఈ లోకం వీడాక మాత్రమే విజయమ్మకు రాజకీయం అనివార్యం అయింది.
By: Tupaki Desk | 5 Jan 2024 4:09 AM GMTదివంగత నేత వైఎస్సార్ బతికి ఉన్న రోజులలో ఆయన ధర్మ పత్నిగా విజయమ్మ ఇంటి గడప దాటి బయటకు రాలేదు. ఆమెకు ఆ అవసరం కూడా లేదు. వైఎస్సార్ మూడున్నర దశాబ్దాల పాటు రాజకీయాల్లో ఉన్నారు. పలు మార్లు ఎమ్మెల్యేగా, ఎంపీగా అలాగే మంత్రిగా రెండు సార్లు ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వహించారు.
అయితే ఏ రోజూ రాజకీయ భారం విజయమ్మ మీద పడలేదు. 2009లో వైఎస్సార్ అకస్మాత్తుగా ఈ లోకం వీడాక మాత్రమే విజయమ్మకు రాజకీయం అనివార్యం అయింది. ఆమె కొడుకు జగన్ కోసమే రాజకీయాల్లోకి వచ్చారు.
అది ఆమెకు సుదీర్ఘ పోరాటం అయింది. 2014లో జగన్ అధికారంలోకి వచ్చి ఉంటే ఆమె రాజకీయాన్ని అక్కడితో ఆపి ఉండేవారు. కానీ ఆయన నాడు ఓటమి పాలు అయ్యారు. 2019లో జగన్ గెలవాలని ఆమె కాలికి బలపం కట్టుకుని ఏపీ వ్యాప్తంగా తిరిగారు. వైఎస్సార్ సతీమణిగా ఆమె స్థానం జనంలో ప్రత్యేకం.
అలా వైఎస్ విజయమ్మ ఏపీలో తిరిగి కుమారుడు జగన్ని సీఎం గా చూడాలని అనుకున్నారు. 2019 మే 30న జగన్ ప్రమాణం చేసిన నాడు ఆమె కళ్లలో ఆనందం కనిపించింది. ఇక రాజకీయాలకు స్వస్తి అని ఆమె అనుకుని ఉండవచ్చు. కానీ ఇంతలో కుమార్తె షర్మిల రాజకీయ ఆకాంక్ష బయటపెట్టుకున్నారు.
ఆమె రాజకీయాల్లో ఉంటాను అని వైఎస్సార్టీపీని స్థాపించారు. తెలంగాణాలో ఆమె కలియతిరిగారు. మూడేళ్ళ పాటు పార్టీని నడిపి మూడు వేల ఏడు వందల కిలోమీటర్ల పాదయాత్ర చేసినా ఆమె ఒక్క ఎన్నికల్లో పోటీ చేయకుండానే చాప చుట్టేశారు. అయితే విజయమ్మ కుమార్తె రాజకీయ ఆకాంక్షకు మద్దతు ఇచ్చి ఆమెతో పాటే వైఎస్సార్టీపీకి అండగా నిలిచారు.
ఆమె 2022 జూలైలో ఏపీలోని గుంటూరులో జరిగిన వైసీపీ ప్లీనరీలో పార్టీ గౌరవ అధ్యక్ష పదవికి రాజీనామా చేశారు. తన కూతురుకి అండగా నిల్వాల్సిన సమయం అన్నారు. సరే తెలంగాణలో షర్మిల వెంట ఆమె ఉన్నా అభ్యంతరంలేదు. అక్కడ జగన్ పార్టీ లేదు. కానీ షర్మిల అనూహ్యంగా ఏపీ వైపు వస్తున్నారు. ఆమె కాంగ్రెస్ లో చేరి ఏపీ బాధ్యతలను స్వీకరించబోతున్నారు.
ఆమె ఇపుడు పక్కా కాంగ్రెస్ మనిషి కాంగ్రెస్ చెప్పినట్లుగా నడవాలి. జగన్ కి వ్యతిరేకంగా షర్మిల రాజకీయ పోరాటం ఇక మీదట ఉండబోతోంది. మరి జగన్ విషయంలో షర్మిల ఏమైనా పంధా ఎంచుకోవచ్చు కానీ విజయమ్మ తీరు అలా కాదు కదా అన్నదే ఇపుడు చర్చ. ఆమెకు జగన్ అయినా షర్మిల అయినా ఒక్కటే అని అంటున్నారు.
ఇదిలా ఉంటే విజయమ్మ దగ్గరకు హైదరాబాద్ టూర్ లో భాగంగా జగన్ వెళ్లి దాదాపుగా నలభై నిముషాల పాటు లోటస్ పాండ్ లోని తన ఇంట్లో గడిపారు. తల్లీ కొడుకుల మధ్యన ఏమి జరిగింది అన్నది బయటకు తెలియదు కానీ ఏపీలో ఉన్న పొలిటికల్ హీట్. తన సొంత చెల్లెలే తన మీదకు ప్రత్యర్ధిగా వస్తున్న విషయం తల్లితో జగన్ తప్పకుండా చర్చించి ఉంటారని అంటున్నారు.
అయితే షర్మిల విషయంలో విజయమ్మ ఏమీ చెప్పే పరిస్థితి లేదనే అంటున్నారు. ఆమె సొంత నిర్ణయాలే తీసుకుంటున్నారు. కాంగ్రెస్ లో చేరిపోయారు. మరి జగన్ ఆమెను ఏమి కోరి ఉంటారు అన్నది కూడా ప్రశ్నగా ఉంది. రేపటి రోజున షర్మిల కాంగ్రెస్ తరఫున ఎంత తిరిగినా ఒక ఎత్తు అయితే ఆమె వెంట విజయమ్మ ఉంటే మాత్రం వైఎస్సార్ లో సగభాగం కచ్చితంగా కాంగ్రెస్ తో ఉన్నట్లే. మద్దతు ఇచ్చినట్లే. జనాలు కూడా పాజిటివ్ గానే చూస్తారు.
అందుకే విజయమ్మ షర్మిల వెంట తిరగకుండా ఉండాలని జగన్ కోరారా అన్న చర్చ నడుస్తోంది. విజయమ్మ ఇపుడు తటస్థంగా ఉంటేనే మేలు అన్న మాట కూడా ఉంది. అయితే ఆమెను అలా ఉండనిస్తారా అన్నది కూడా ప్రశ్నగా ఉంది. ఆమెను షర్మిల తన వెంట ప్రచారానికి రమ్మని పిలిచే అవకాశాలు ఉంటాయని అంటున్నారు.
అదే విధంగా రేపటి రోజున షర్మిల కడప ఎంపీగా కాంగ్రెస్ తరఫున పోటీ చేస్తే అది విజయమ్మకు మరింత ఇబ్బందికరమైన పరిస్థితి. ఏపీ రాజకీయాల్లో వీజయమ్మ కొడుకు పక్షమా లేక కూతురు పక్షమా అన్నదే ఇపుడు పెద్ద ఎత్తున చర్చకు వస్తోంది. ఏది ఏమైనా విజయమ్మకు రాజకీయంగా ఎన్నడూ లేని విచిత్ర పరిస్థితి ఏర్పడింది అని అంటున్నారు. చూడాలి మరి వైఎస్సార్ సతీమణి ఈ సంక్లిష్ట పరిస్థితుల్లో ఏ విధంగా అడుగులు వేస్తారో.