Begin typing your search above and press return to search.

విజయమ్మకు త్రుటిలో తప్పిన ప్రమాదం.. వాడపల్లి వద్ద వాహనాలు ఢీ!

ఈ సమయంలో... విజయమ్మ కూర్చున్న వాహనం నడుపుతున్న డ్రైవర్ సడెన్‌ బ్రేక్ వేయడంతో దాని వెనుక వేగంగా వస్తున్న కాన్వాయ్‌ లోని కార్లు ఒకదానికొకటి ఢీకొన్నాయి.

By:  Tupaki Desk   |   14 Oct 2023 3:43 AM GMT
విజయమ్మకు త్రుటిలో తప్పిన ప్రమాదం.. వాడపల్లి వద్ద వాహనాలు ఢీ!
X

వైఎస్ కుటుంబానికి సంబంధించి ఏ ప్రమాద వార్త వచ్చినా వారి అభిమానులకు ఒక్కసారిగా ముచ్చెమటలు పట్టేస్తాయని అంటారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి హెలీకాప్టర్ ప్రమాదంలో మరణించినప్పటినుంచీ... ఈ ఆందోళన నెలకొందని చెబుతారు. ఈ సమయంలో తాజాగా వైఎస్ విజయమ్మకు త్రుటిలో తప్పిన పెను ప్రమాదం అనే వార్త ఒక్కసారిగా ఆందోళనకు గురిచేసిందనే కామెంట్లు వినిపిస్తున్నాయి. అయితే విజయమ్మకు తాజాగా జరిగిన ఈ ఘటనలో ఎలాంటి ప్రమాదం కలగలేదని తెలుస్తుంది

అవును... ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తల్లి వైఎస్ విజయమ్మ త్రుటిలో ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. శుక్రవారం హైదరాబాద్ నుంచి ఒంగోలుకు రోడ్డు మార్గం ద్వారా కారులో విజయమ్మ బయల్దేరారు. ఈ సమయంలో తెలంగాణ రాష్ట్రం నల్గొండ జిల్లా వాడపల్లి వద్దకు చేరుకునేసరికి ప్రమాదం జరిగింది. ఇందులో భాగంగా కాన్వాయ్ లోని వాహనాలు ఒకదానికొనటి గుద్దుకున్నాయి.

ఈ సమయంలో... విజయమ్మ కూర్చున్న వాహనం నడుపుతున్న డ్రైవర్ సడెన్‌ బ్రేక్ వేయడంతో దాని వెనుక వేగంగా వస్తున్న కాన్వాయ్‌ లోని కార్లు ఒకదానికొకటి ఢీకొన్నాయి. దీంతో ఆమె ప్రయాణిస్తున్న కారు వెనుక భాగం దెబ్బతింది. అయితే ఈ ఘటనలో విజయమ్మకు గానీ, కారులో ప్రయాణిస్తున్న ఇతరులకుగానీ ఎలాంటి గాయాలు కాలేదని చెబుతున్నారు. ఇలా త్రుటిలో పెను ప్రమాదం తప్పడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.

కొద్ది సేపటి తర్వాత అదే కారులో ఆమె ఒంగోలుకు చేరుకున్నారు. అయితే ప్రమాదం విషయం తెలుసుకున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్, కుమార్తె షర్మిల.. తమ తల్లికి ఫోన్ చేసి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారని సమాచారం. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న తన సోదరి అత్త, వై.వి.సుబ్బారెడ్డి తల్లి పిచ్చమ్మను ఒంగోలులో విజయమ్మ పరామర్శించడానికి వెళ్తున్న సందర్భంగా ఈ ప్రమాదం జరిగింది.

కాగా... కాగా, టీటీడీ మాజీ ఛైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి మాతృమూర్తి పిచ్చమ్మ గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. వయసు పైబడటంతో తరుచూ ఆమె అనారోగ్యానికి గురవుతున్నారని తెలుస్తుంది. ఈ క్రమంలో మరోసారి ఆమె అనారోగ్యానికి గురికావడంతో విజయమ్మ శుక్రవారం హైదరాబాద్ నుంచి బయలుదేరి వెళ్లారు. ఈ క్రమంలోనే వాహనం ప్రమాదానికి గురయ్యింది.