Begin typing your search above and press return to search.

స్టాలిన్ ని మాజీ సీఎం చేసే సత్తా విజయ్ కి ఉందా ?

ఆ తరువాత అన్నా డీఎంకే పుట్టాక రెండు పార్టీల మధ్య రాజకీయ పోరు భీకరంగా సాగింది.

By:  Tupaki Desk   |   25 Aug 2024 3:27 AM GMT
స్టాలిన్ ని మాజీ సీఎం చేసే సత్తా విజయ్ కి ఉందా ?
X

తమిళనాడులో రాజకీయ శూన్యత ఉంది. ఇది అందరూ అంగీకరించే విషయమే. తమిళనాడులో 1960 దశకం నుంచి ప్రాంతీయ పార్టీలదే హవా. ముందు డీఎంకే అధికారంలో ఉంది. ఆ తరువాత అన్నా డీఎంకే పుట్టాక రెండు పార్టీల మధ్య రాజకీయ పోరు భీకరంగా సాగింది. అలా నాలుగు దశాబ్దాల పాటు ఈ రెండు పార్టీలే తమిళనాడు రాజకీయాలను పంచుకున్నాయి.

ఈ క్రమంలో 2016లో జయలలిత మరణంతో అన్నా డీఎంకేకు పెద్ద దిక్కు లేకుండా పోయింది. క్యాడర్ ఉండి లీడర్ లేని పార్టీగా మారింది. ఇక డీఎంకేకు కరుణానిధి మరణానంతరం ఆయన కుమారుడు స్టాలిన్ లీడర్ అయ్యారు. 2021లో ఆయన సీఎం అయ్యారు. ఆయన కుమారుడు ఉదయనిధి స్టాలిన్ కూడా తండ్రికి వారసుడిగా ఉన్నారు. మంత్రిగా ప్రభుత్వంలోనూ పార్టీలో యువజన విభాగానికి ఉన్నారు.

దాంతో డీఎంకేకు వారసత్వ సమస్య అయితే లేదు. ఈ నేపధ్యంలో చూస్తే ఇటీవల జరిగిన లోక్ సభ ఎన్నికల్లోనూ అన్నా డీఎంకే సరైన తీరున రాజకీయ ప్రదర్శన చేయలేక చతికిలపడింది. దాంతో మొత్తం 39 లోక్ సభ ఎంపీ సీట్లను డీఎంకే కూటమి గెలుచుకుంది. ఈ విజయం తో వచ్చిన ఊపుతో 2026లో రెండోమారు గెలిచి తీరాలని డీఎంకే పట్టుదలగా ఉంది.

అయితే తమిళనాడులో రజనీకాంత్ తరువాత అంతటి ఫాలోయింగ్ సంపాదించిన విజయ్ ఇపుడు కొత్త పార్టీ పెట్టారు. ఆయన 2026 ఎన్నికలను టార్గెట్ చేసుకునే పార్టీ పెట్టారు అన్నది అందరికీ తెలిసిందే. డీఎంకే పాలన మీద వ్యతిరేకత ఉన్నా పార్లమెంట్ ఎన్నికలో ఆల్టర్నేషన్ లేకనే జనాలు ఆ కూటమిని గెలిపించారు అన్నది విజయ్ నమ్ముతున్నారు.

ప్రజలకు సరైన పార్టీగా డీఎంకేకి అసలైన ప్రత్యర్ధిగా నిరూపించుకుంటే 2026 ఎన్నికల్లో గెలిచి తీరవచ్చు అన్నది విజయ్ ప్లాన్ గా ఉంది. తాజాగా విజయ్ తన పార్టీ జెండాను ఆవిష్కరించి అజెండాను కూడా పార్టీ జనాలలకు చెప్పారు. జెండా మీద రెండు ఏనుగులు మధ్యలో ఒక పుష్పం ఉంది.

ఈ రెండు ఏనుగులూ ప్రజా బలానికి నిర్వచనంగా పేర్కొన్నారు. ఆ మధ్యలో పుష్పం పేరుని వాగాయ్ గా విజయ్ వివరించారు. తమిళనాడుని చోళ పాండ్య రాజులు పాలించారు. వారి టైం లో యుద్ధంలో విజయం సాధించిన వారిని వాగాయ్ పుష్పాలతో ఘన స్వాగతం పలికేవారుట.

అలా తన పార్టీ జెండా మీద ఈ గుర్తులు ఉంచారు. ఇక రెండు ఎరుపులు మధ్యలో పసుపు రంగును జెండా మీద ముద్రించారు. ఈ రంగులు కూడా ప్రజలకు గుర్తు అని చెప్పారు. విజయ్ పార్టీ పేరు తమిళగ వెట్రికలగం అంటే షార్ట్ కట్ లో టీవీకే అన్న మాట. తొలి రాష్ట్ర సదస్సుని విల్లుపురంలో నిర్వహించి జెండా అజెండా ప్రకటించిన విజయ్ మరిన్ని రాష్ట్ర సదస్సులను ప్రతీ జిల్లలో నిర్వహించడానికి నిర్ణయించినట్లుగా చెప్పారు.

యాభై ఏళ్ళ విజయ్ తమిళ నాట యువతకు మంచి ఆకర్షణ. ఆయన సినిమాలు బ్లాక్ బస్టర్లుగా నిలిచినవి ఉన్నాయి. తమిళనాడు ప్రజల ఆశయాలకు తగిన విధంగా టీవీకే ఉంటుందని విజయ్ చెబుతున్నారు. ఆయన గురి అధికార పీఠం మీద ఉంది. చాలా జాగ్రత్తగా అడుగులు వేస్తున్నారు. బహుజనులు దళితులు ఇలా చాలా కీలక సామాజిక వర్గాల మద్దతును పొందే విధంగా అజెండాను సెట్ చేస్తున్నారు. అన్నా డీఎంకే నుంచి భారీ ఎత్తున వలసలు ఉంటాయని భావిస్తున్నారు.

ఒక విధంగా చూస్తే తమిళనాడులో అన్నా డీఎంకే వీక్ అయింది. బీజేపీ కూడా వర్గ పోరుతో ఉంది. ఓటు శాతం 2024 ఎంపీ ఎన్నికల్లో పెరిగినా సీటు ఒక్కటీ రాలేదు. అన్నా డీఎంకేతో బంధం కటీఫ్ అయింది. దాంతో బీజేపీకి 2026 ఎన్నికలు ఎలా ఎదుర్కోవాలో తెలియడం లేదు. మరో వైపు అన్నా డీఎంకే లోని వారు అంతా విజయ్ వైపు చూస్తున్న నేపథ్యం ఉంది.

అలా చూస్తే కనుక 2026 అసెంబ్లీ ఎన్నికల్లో డీఎంకే కి టీవీకేకి మధ్య పెద్ద పోరే సాగనుంది. ఎవరు విజేత అవుతారు అన్నది కూడా చూడాల్సి ఉంది. అయితే ఇండియా కూటమిలో ఉన్న డీఎంకేకు బలం బలగం సంస్థాగత నిర్మాణం అన్నీ గట్టిగానే ఉన్నాయి. మరి వాటిని తట్టుకుని టీవీకే గెలిస్తే మాత్రం తమిళనాట అద్భుతమే. స్టాలిన్ ని మాజీ సీఎం చేసే సత్తా విజయ్ కి ఉందా లేదా అంటే వెయిట్ అండ్ సీ.