అప్పుడు సుజనా.. సీఎం రమేశ్.. ఇప్పుడు విజయసాయి.. అయోధ్య!
తెలుగు రాజకీయాల్లో సంచలనంగా మారింది వైసీపీ రాజ్యసభ సభ్యులు విజయసాయి రెడ్డి.. అయోధ్య రామిరెడ్డిల రాజీనామా అంశం.
By: Tupaki Desk | 25 Jan 2025 10:57 AM ISTతెలుగు రాజకీయాల్లో సంచలనంగా మారింది వైసీపీ రాజ్యసభ సభ్యులు విజయసాయి రెడ్డి.. అయోధ్య రామిరెడ్డిల రాజీనామా అంశం. అయితే.. ఇక్కడ మర్చిపోకూడని విషయం ఏమంటే.. 2019లో టీడీపీ ఘోర పరాజయం తర్వాత కూడా ఇలాంటి సీనే అప్పుడూ జరిగింది. జగన్ కు కుడి భుజంగా వ్యవహరించే విజయసాయి తన రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేయటమే కాదు.. రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లుగా ప్రకటించారు. అయోధ్య రామిరెడ్డి విషయంలో మాత్రం అధికారిక ప్రకటన రాలేదు. ఆయన కూడా రాజీనామా చేసి.. రాజకీయాలకు దూరంగా ఉండాలన్న నిర్ణయాన్ని తీసుకున్నట్లుగా చెబుతున్నారు.
విజయసాయికి రాజ్యసభ సభ్యత్వం మరో మూడేళ్లు ఉంటే.. అయోధ్య రామిరెడ్డికి మరో ఏడాది మాత్రమే టైం ఉంది. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ ఘోర పరాజయం అనంతరం వీరిద్దరూ బీజేపీలోకి వెళతారన్న ప్రచారం జరిగింది. అందుకు భిన్నంగా తాజాగా వీరిద్దరూ తమ రాజ్యసభ సభ్యత్వానికి.. పార్టీకి గుడ్ బై చెప్పటం ఆసక్తికరంగా మారింది.
వీరిద్దరి రాజీనామాతో వైసీపీ పని అయిపోయిందని.. జగన్ కు భారీ దెబ్బ తగిలిందన్న ప్రచారం జరుగుతోంది. అయితే.. తెలుగు రాజకీయాల్లో ఇలాంటివి కామన్ గా మారాయి. అధినేతకు అత్యంత సన్నిహితంగా ఉండే వారు.. అధికారం చేజారిన వేళలో వారికి దూరంగా ఉండటం ఇటీవల కాలంలో ఎక్కువ అయ్యాయి. 2019 ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత.. చంద్రబాబుకు అత్యంత సన్నిహితంగా ఉండే సీఎం రమేశ్.. సుజనా చౌదరిలు ఇద్దరూ పార్టీకి రాజీనామా చేసేయటం.. బీజేపీ తీర్థం పుచ్చుకోవటం తెలిసిందే.
అప్పుడు సీఎం రమేశ్.. సుజనా చౌదరిలు అయితే.. ఇప్పుడు విజయసాయి రెడ్డి.. అయోధ్య రామిరెడ్డిలుగా చెప్పాలి. వారిద్దరూ చంద్రబాబుకు అత్యంత సన్నిహితుల జాబితాలో టాప్ 5లో ఉంటే.. ఇప్పుడు రాజీనామా చేసిన ఇద్దరు కూడా జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితుల జాబితాలో టాప్ 5లో ఉండటం గమనార్హం. అప్పట్లో చంద్రబాబుకు గుడ్ బై చెప్పిన ఇద్దరు నేతలు రాజ్యసభ సభ్యులుగా ఉంటే.. ఇప్పుడు జగన్ కు దూరమయ్యేందుకు సిద్ధమైన ఇద్దరు కూడా రాజ్యసభ సభ్యులే కావటం కాకతాళీయామేనా? అన్నది ప్రశ్నగా మారింది.