Begin typing your search above and press return to search.

విజయసాయిరెడ్డి 2029 కి ప్లాన్ ?

అయితే ఇపుడు మరో సరికొత్త ప్రచారం అయితే సాగుతోంది. అదేంటి అంటే...

By:  Tupaki Desk   |   18 March 2025 1:00 AM IST
విజయసాయిరెడ్డి 2029 కి ప్లాన్ ?
X

వైసీపీలో నంబర్ టూగా నిన్నటి దాకా ఉన్న విజయసాయిరెడ్డి రాజకీయాలు వద్దు అని అన్నీ వదిలేశారు. అయితే ఆయన వదిలేసినంత సులువుగా రాజకీయం వదలదు కదా. అందుకే ఆయన మళ్ళీ ట్వీట్లతో సందడి చేస్తున్నారని అంటున్నారు. ఆయన రాజకీయాల్లో కొనసాగుతారని ప్రచారం అయితే జోరుగా సాగుతోంది.

ఆయన ఈ ఏడాది జూన్ తర్వాత భారతీయ జనతా పార్టీ తీర్ధం పుచ్చుకుంటారు అని అంటున్నారు. అలా కాషాయం కప్పుకుని బీజేపీ వంటి జాతీయ పార్టీలో తనదైన పాత్రని పోషిస్తారు అని అంటున్నారు. ఎటూ బీజేపీ కేంద్ర పెద్దలతో ఆయనకు మంచి రిలేషన్స్ ఉన్నాయి కాబట్టి మంచి భవిష్యత్తుకు బాటలు పడతాయని భావిస్తున్నారని అంటున్నారు.

ఇదిలా ఉంటే విజయసాయిరెడ్డి రాజ్యసభకు మళ్ళీ వెళ్తారని ప్రచారం ఒక వైపు సాగుతోంది. ఆయన సేవలను బీజేపీ అలా వినియోగించుకుంటుందని కూడా చెబుతున్నారు. అయితే ఆయన ఒక కీలక రాష్ట్రానికి గవర్నర్ గా వెళ్తారు అని కూడా ప్రచారం చేస్తున్న వారు ఉన్నారు.

అయితే ఇపుడు మరో సరికొత్త ప్రచారం అయితే సాగుతోంది. అదేంటి అంటే విజయసాయిరెడ్డి 2029 ఎన్నికల మీద ఫోకస్ చేశారని ఆయన బీజేపీ తరఫున విశాఖ నుంచి ఎంపీగా లోక్ సభకు పోటీ చేస్తారు అన్నది ఆ ప్రచారంగా ఉంది. ఎందుకంటే విజయసాయిరెడ్డి విశాఖలో ఏకంగా పదేళ్ళ పాటు ఉన్నారు.

ఒక విధంగా ఆయన సొంత ప్రాంతంగా విశాఖ ఉంది. ఆయనకు అక్కడ రాజకీయ సామాజిక భౌగోళిక పరిస్థితులు అన్నీ తెలుసు అని అంటున్నారు. అందుకే ఆయన ఏరికోరి విశాఖ నుంచి పోటీ చేయడానికి ఎంచుకుంటారని అంటున్నారు. ఆయన వైసీపీలో ఉన్నపుడు కూడా విశాఖ నుంచి పోటీకి చూశారని అప్పట్లో ప్రచారం సాగింది.

దాంతో ఇపుడు మళ్ళీ అలాంటి ప్రచారం చేస్తున్నారు. విశాఖ నుంచి విజయసాయిరెడ్డి పోటీ అని జరుగుతున్న ఈ ప్రచారం కానీ ఆయన బీజేపీలో చేరుతారు అన్న ప్రచారం కానీ ఇవన్నీ పుకార్లుగానే షికారు చేస్తున్నాయి. పైగా ఇవన్నీ సోషల్ మీడియాలో సాగుతున్న ప్రచారంగా ఉంది.

వీటి మీద ఆధారాలు అయితే లేవు. వీటి గురించి ఎవరికైనా పూర్తి విషయం తెలుసు అంటే అది ఒక్క విజయసాయిరెడ్డి మాత్రమే. ఆయనే ఇలాంటి ప్రచారాల మీద క్లారిటీ ఇవ్వగలరు. ఆయనే వాస్తవాలు చెప్పగలరు. అంతవరకూ ఇలాంటివి మరిన్ని అలా వస్తూనే ఉంటాయి. మొత్తానికి చూస్తే విజయసాయిరెడ్డి మీద వార్తలు పుంఖానుపుంఖాలుగా వస్తున్నాయి. స్పష్టత అయితే లేదు. ఒక విధంగా ఈ తరహా వార్తలు ఫ్యూచర్ లో మరిన్ని వచ్చినా రావచ్చు. చూడాలి మరి అసలు ఏమి జరుగుతుందో.