బీజేపీతో విజయసాయి...సంకేతాలు ఇచ్చినట్లేనా ?
మీడియా మీద ఈ విధంగా వ్యాఖ్యానించారు విజయసాయిరెడ్డి తాను మాత్రం బీజేపీలో చేరుతున్నారా అంటే ఖండించలేదని అంటున్నారు.
By: Tupaki Desk | 13 March 2025 4:00 AM ISTవిజయసాయిరెడ్డి రాజకీయ సన్యాసం వ్యవసాయం ఇవన్నీ మీడియాకు సంచలన వార్తలుగానే ఉన్నాయి. అయితే రాజకీయంగా కీలకమైన నాయకుడు సడెన్ గా అన్నీ వదులుకుని తూచ్ అని అంటారని ఎవరూ అనుకోరని కూడా చెబుతున్నారు. అందుకే విజయసాయిరెడ్డి తాను రాజకీయాలకు దూరం అని చెబుతునా మీడియా మసాలా వార్తలు ఎన్ని రాయాలో అన్నీ రాస్తూ వస్తోంది.
ఇక ముసుగులో గుద్దులాట ఎందుకు అన్నట్లుగా విజయసాయిరెడ్డి సీఐడీ విచారణకు హాజరైతే ఆయననే పట్టుకుని డైరెక్టుగానే ఈ విషయం అడిగేసింది. మీరు బీజేపీలోకి వెళ్తారట, గవర్నర్ పదవి ఖాయమట అని. అయితే మీడియా అంత సూటిగా అడిగినా విజయసాయిరెడ్డి మాత్రం దానికి ఏ విధంగానూ జవాబు ఇవ్వలేదు. ఆయన మాత్రం వ్యవసాయం గురించే మాట్లాడారు.
తాను వ్యవసాయమే చేస్తున్నాను అన్నారు. ప్యాంటూ షర్ట్ వేసుకున్న వారు వ్యవసాయం చేయకూడదా అని ప్రశ్నించారు. గోచీ కట్టుకునే వ్యవసాయం చేయాలా అని నిలదీశారు. రైతుల మనోభావాలను దెబ్బతీసే విధంగా మీడియాలోని కొన్ని సెక్షన్లు రాస్తున్నాయని అసహనం వ్యక్తం చేశారు.
మీడియా మీద ఈ విధంగా వ్యాఖ్యానించారు విజయసాయిరెడ్డి తాను మాత్రం బీజేపీలో చేరుతున్నారా అంటే ఖండించలేదని అంటున్నారు. అంతే కాదు ప్రస్తుతానికి తాను ఏ రాజకీయ పార్టీని కలవలేదని ఎవరితోనూ లేనని అంటున్నారు.
అంటే ప్రస్తుతానికి అన్న మాటకే ఇక్కడ కోట్ చేసుకోవాలని అంటున్నారు. అంటే ఫ్యూచర్ లో ఏమైనా విజయసాయిరెడ్డి బీజేపీలో చేరుతారా అన్నది కూడా చర్చకు వస్తోంది. ఆయన మాటనే తీసుకుంటే బీజేపీ విషయంలో స్పష్టంగా చెప్పలేదు. అంతే కాదు ఈసారి రాజకీయ సన్యాసం అన్న మాట కూడా వాడలేదు.
అంతే కాదు వైసీపీలో మళ్ళీ చేరను అన్నారు అంటే రాజకీయాల్లో ఇంకా ఉన్నట్లే కదా అన్న చర్చకు కూడా అవకాశం కల్పించారు అని అంటున్నారు. విజయసాయిరెడ్డికి జాతీయ స్థాయిలో పలుకుబడి ఉంది. బీజేపీ పెద్దలతో ఆయనకు మంచి రిలేషన్స్ ఉన్నాయి.
అందువల్ల ఆయన జూన్ నెలలో బీజేపీలో చేరుతారని ఆ తరువాత ఆ పార్టీ మెంబర్ గా ఉంటారని మరి గవర్నర్ అవుతారా లేక తిరిగి తన కోటాలోనే రాజ్యసభకు ఏపీ నుంచి నెగ్గుతారా అన్నది కూడా చర్చగానే ఉంది. మొత్తానికి విజయసాయిరెడ్డి తాజాగా వైసీపీ అధినాయకత్వం మీద చేసిన విమర్శలతో ఆయన రాజకీయంగా ఢీ కొట్టడానికే సిద్ధంగా ఉన్నారని అంటున్నారు. చూడాలి మరి ఏమి జరుగుతుందో.