Begin typing your search above and press return to search.

సాయిరెడ్డిలో భయం.. సడన్ ఛేంజ్

గతంలో ఆ భూముల్లో నిర్మాణాలకు ఎలాంటి దరఖాస్తు చేయని విజయసాయిరెడ్డి ఇప్పుడు తన వైఖరి మార్చుకోవడం వెనుక జరిగిన పరిణామాలు చర్చనీయాంశమవుతున్నాయి.

By:  Tupaki Desk   |   15 Feb 2025 5:00 PM IST
సాయిరెడ్డిలో భయం.. సడన్ ఛేంజ్
X

వైసీపీ మాజీ నేత వి.విజయసాయిరెడ్డి భయపడ్డారా? రాజకీయాల్లో ఉంటూ భయమనే మాటకు తన జీవితంలో చోటు లేదని చెప్పుకున్న ఆయన రాజకీయ సన్యాసం స్వీకరించిన తర్వాత వెనకడుగు వేస్తున్నారా? అంటే అవుననే సమాధానమే వినిపిస్తోంది. ఒక్కోసారి పరిస్థితులకు తగ్గట్టుగా నడుచుకోవాల్సి వస్తుందని సాయిరెడ్డి తీరు చెబుతోంది. భీమిలి బీచ్ కు అనుకుని తన కుమార్తె కొనుగోలు చేసిన భూముల్లో నిర్మాణాలకు అనుమతులు ఇవ్వాల్సిందిగా ఆయన ప్రభుత్వానికి లేఖ రాయడం ఆసక్తికరంగా మారింది. గతంలో ఆ భూముల్లో నిర్మాణాలకు ఎలాంటి దరఖాస్తు చేయని విజయసాయిరెడ్డి ఇప్పుడు తన వైఖరి మార్చుకోవడం వెనుక జరిగిన పరిణామాలు చర్చనీయాంశమవుతున్నాయి.

వైసీపీలో ఉండగా, విజయసాయిరెడ్డిపై ఎన్నో విమర్శలు వచ్చాయి. పార్టీ ఉత్తరాంధ్ర ఇన్ చార్జిగా పనిచేసిన సాయిరెడ్డి విశాఖలో విలువైన భూములు కబ్జా చేశారని ఆరోపణలు ఎదుర్కొన్నారు. అదే సమయంలో ప్రభుత్వ స్థలాలను ఆక్రమించుకున్నారని, ఆయన కుమార్తె పేరుతో కొన్న స్థలం చుట్టూ ప్రభుత్వ భూమిని ఆక్రమించుకోవడమే కాకుండా, అక్రమంగా ప్రహరి నిర్మించారని, వాటర్ బాడీల్లో మార్పులు తెచ్చేలా నిర్మాణాలు చేశారని ప్రభుత్వానికి ఫిర్యాదులు వెళ్లాయి. హైకోర్టులో కేసులు కూడా దాఖలయ్యాయి. కోర్టు ఆదేశాల మేరకు ఆక్రమణల తొలగింపునకు ప్రభుత్వం చర్యలు తీసుకుంది. అయితే వైసీపీలో ఉండగా, ఈ భూములపై మొండిగా వ్యవహరించిన సాయిరెడ్డి.. తాజాగా నిర్మాణాలకు అనుమతులు కోరుతూ దరఖాస్తు చేసుకోవడం విశేషంగా చెబుతున్నారు.

సాయిరెడ్డి కుమార్తె నేహారెడ్డి కొనుగోలు చేసిన స్థలంలో అక్రమ నిర్మాణాలపై జనసేన కార్పొరేటర్ మూర్తి యాదవ్ హైకోర్టులో కేసు వేయడం, ఆ ఆక్రమణలు తొలగించాలని ఈ నెల 5న హైకోర్టు తీర్పు ఇవ్వడంతో ప్రభుత్వం సీరియస్ యాక్షన్ తీసుకుంది. ఆక్రమణల తొలగింపుపై వారం రోజుల్లో కోర్టుకు నివేదిక సమర్పించాలని ఆదేశించడంతోపాటు నిజాయితీ గల అధికారులతో కమిటీ వేసి పర్యవేక్షించాలని ఆదేశించింది. దీంతో ఐదుగురు ఉన్నతాధికారులతో ఏర్పాటైన కమిటీ విశాఖ-భీమిలి సాగర తీరంలో సర్వే చేసింది. ఎక్కడెక్కడ ఆక్రమణలు ఉన్నాయో గుర్తించి, వాటి తొలగింపునకు చర్యలు తీసుకుంటోంది. దీంతో సాయిరెడ్డి దిగివచ్చినట్లు చెబుతున్నారు. సాగర తీరంలో నిర్మాణాలపై హైకోర్టు ఆగ్రహంగా ఉండటంతో తన కుమార్తె కొనుగోలు చేసిన భీమిలి, నేరేళ్ల వలస ప్రాంతాల్లోని భూముల్లో ప్రహరి నిర్మాణానికి అనుమతులు ఇవ్వాల్సిందిగా తాజాగా దరఖాస్తు చేసుకున్నారు.

అయితే ఈ వ్యవహారం కోర్టులో ఉండటంతో అధికారులు చాలా కొర్రీలు వేసి దరఖాస్తును తిరస్కరించినట్లు చెబుతున్నారు. దరఖాస్తు చేసిన భూమిలో ఏ ప్రాజెక్టు నిర్మించాలనుకుంటున్నారో స్పష్టత ఇవ్వాలని సూచిస్తూ సీజెడ్ఎంఏ అధికారులు సాయిరెడ్డి దరఖాస్తును వెనక్కి పంపారు. ప్రహరీ విస్తర్ణం, అంచనా వ్యయం తెలియజేయాలని, ఆ భూములపై ఉన్న కోర్టు కేసులు, న్యాయస్థానం ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ సాయిరెడ్డి దరఖాస్తును రిజక్ట్ చేశారు. కాగా, గతంలో భయమన్నది తన బ్లడ్ లోనే లేదన్నట్లు వ్యవహరించిన సాయిరెడ్డి తాజాగా వైఖరి మార్చుకోవడం చర్చనీయాంశమవుతోంది.