Begin typing your search above and press return to search.

కాకినాడ పోర్టు కేసే కారణమా? సాయిరెడ్డి రాజీనామా ఎందుకు?

రాజకీయాల్లో ఎప్పుడు ఏం జరుగుతుందో ఊహించడం కష్టం. ఆకస్మిక పరిణామాలకు రాజకీయాల్లోనే ఎక్కువ అవకాశాలు ఉంటాయి. దీనికి ప్రత్యక్ష ఉదాహకరణ వైసీపీ నేత విజయసాయిరెడ్డి రాజకీయాలకు గుడ్ బై చెప్పడం.

By:  Tupaki Desk   |   25 Jan 2025 6:36 AM GMT
కాకినాడ పోర్టు కేసే కారణమా? సాయిరెడ్డి రాజీనామా ఎందుకు?
X

వైసీపీ రాజ్యసభా పక్ష నేత వి.విజయసాయిరెడ్డి రాజీనామా రాష్ట్ర రాజకీయాల్లో సంచలనంగా మారింది. పార్టీకి రాజీనామా చేయడమే కాకుండా ఏకంగా రాజకీయాల నుంచే తప్పుకుంటున్నట్లు ఆయన చేసిన ప్రకటన వైసీపీ వర్గాలను షాక్కు గురిచేసింది. పార్టీ ఆవిర్బావం నుంచి నెంబర్ టు నేతగా వ్యవహరిస్తూ ఆకస్మికంగా వైదలగొడంతో పెద్ద చర్చకు దారితీస్తోంది. అసలు విజయసాయిరెడ్డి ఎందుకు ఈ నిర్ణయం తీసుకున్నారు? తన రాజీనామాకు ఎలాంటి ఆర్థిక, రాజకీయ కారణాలు లేవని ఆయన అంటున్న దీనివెనుక ఓ ప్రధాన కేసు ఉందని అంటున్నారు. కాకినాడ సీ పోర్టు వాటాల బదిలీపై సీఐడీ కేసు నమోదు చేయడం, ఈడీ రంగంలోకి దిగడం విజయసాయిరెడ్డి నిష్క్రమణకు కారణమై ఉండొచ్చని పొలిటికల్ సర్కిల్స్ అభిప్రాయపడుతున్నాయి.

రాజకీయాల్లో ఎప్పుడు ఏం జరుగుతుందో ఊహించడం కష్టం. ఆకస్మిక పరిణామాలకు రాజకీయాల్లోనే ఎక్కువ అవకాశాలు ఉంటాయి. దీనికి ప్రత్యక్ష ఉదాహకరణ వైసీపీ నేత విజయసాయిరెడ్డి రాజకీయాలకు గుడ్ బై చెప్పడం. ఆయన ఆకస్మిక నిర్ణయం వెనుక ప్రధాన కారణం కాకినాడ సీపోర్టు కేసే అంటున్నారు. వైసీపీ అధికారం కోల్పోయిన నుంచి విజయసాయిరెడ్డి పొలిటికల్ జర్నీపై అనేక రకాలుగా ప్రచారం జరిగింది. రాజ్యసభ సభ్యులు మోపిదేవి, మస్తాన్ రావు రాజీనామా చేసినప్పుడే విజయసాయిరెడ్డి కూడా వైసీపీకి గుడ్ బై చెప్పనున్నారని, ఆయన బీజేపీలో చేరతారని పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. కానీ, అప్పట్లో ఆయన ఆ విషయాన్ని ఖండించారు. అధినేత జగన్ తోనే చివరి వరకు జర్నీ ఉంటుందని తెగేసి చెప్పారు. అదేవిధంగా పార్టీలో యాక్టీవ్ అవుతున్నట్లు సంకేతాలిచ్చారు. ముఖ్యమంత్రి చంద్రబాబుపై తీవ్ర వ్యాఖ్యలు చేస్తూ తగ్గేదేలే అన్నట్లు వ్యవహరించారు. కానీ, శుక్రవారం ఉరుములేని పిడుగులా ఆయన చేసిన ట్వీట్ వైసీపీని ఓ కుదుపు కుదిపింది.

వైసీపీ రాజ్యసభాపక్ష నేతగా ఉన్న విజయసాయిరెడ్డి ఏకంగా రాజకీయాల నుంచే తప్పుకుంటానని ప్రకటించడం వెనుక కాకినాడ సీ.పోర్టు కేసు ప్రధానంగా చర్చకు వస్తోంది. పోర్టులో మెజార్టీ వాటాలను దక్కించుకోడానికి వైసీపీ నేతలు విజయసాయిరెడ్డి, వైవీ విక్రాంత్ రెడ్డి బెదిరించినట్లు పోర్టు యజమాని కేవీ రావు సీఐడీకి ఫిర్యాదు చేశారు. ఈ కేసులో మనీలాండరింగ్ జరిగిందనే కారణంతో ఎన్ఫోర్సుమెంట్ డైరెక్టరేట్ రంగంలోకి దిగింది. సీఐడీ కేసుతో న్యాయపరంగా పోరాడవచ్చు. కాస్త కష్టమైనా బెయిల్ తెచ్చుకోవచ్చు. కానీ, ఈడీ కేసు నమోదు చేస్తే బెయిల్ తెచ్చుకోవడం అంత ఈజీ కాదు. కేసులో చార్జిషీటు దాఖలు చేసి, దర్యాప్తు పూర్తయిందని ఈడీ కోర్టుకు నివేదించేవరకు నిందితులకు జైలు జీవితం తప్పదు. సరిగ్గా ఇదే విషయం విజయసాయిరెడ్డిని భయపెట్టిందని అంటున్నారు. ఇప్పటికే జగన్ కేసులో జైలుకు వెళ్లివచ్చిన విజయసాయిరెడ్డి ఆ అనుభవంతో ముందు జాగ్రత్త తీసుకున్నారని ప్రచారం జరుగుతోంది.

కాకినాడ పోర్టు కేసులో విజయసాయిరెడ్డితో పాటు నిందితుడిగా ఆయన అల్లుడు సోదరుడు శరత్ చంద్రారెడ్డిపైనా అభియోగాలు నమోదయ్యాయి. అంతేకాకుండా వారి యాజమాన్యంలో ఉన్న ప్రతిష్ఠాత్మక అరబిందో కంపెనీ కూడా అభియోగాలు ఎదుర్కొంటోంది. ఇప్పటికే ఢిల్లీ లిక్కర్ స్కాంలో శరత్ చంద్రారెడ్డి కూడా చెరసాలకు వెళ్లొచ్చారు. ఇక కంపెనీపైనా ప్రస్తుతం ఆరోపణలు రావడం, దీనిపై ఈడీ ఎఫ్ఐఆర్ వేస్తే అరబిందో ప్రతిష్ఠ దెబ్బతినే ప్రమాదం ఉందనే ఆలోచనతోనే విజయసాయిరెడ్డి దిగివచ్చారని ప్రచారం జరుగుతోంది. అందుకే కొందరు ప్రముఖులను రంగంలోకి దించి కాకినాడ సీపోర్టు వాటాలను తిరిగి ఇచ్చేశారంటున్నారు. అయితే రాష్ట్రంలో ప్రస్తుత రాజకీయాలు తనకు ప్రతికూలంగా ఉండటంతో తాను రాజకీయాల్లో ఉన్నంత వరకు ముప్పు తప్పదనే ఆలోచనతో అస్త్ర సన్యాసం చేయాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.

ముఖ్యంగా విజయసాయిరెడ్డి నిర్ణయం వెనుక ఆయన వియ్యంకుల కుటుంబం ఒత్తిడి ఎక్కువగా ఉన్నాదని అంటున్నారు. ఇప్పటికే 70 ఏళ్లకు సమీపంలో ఉన్న విజయసాయిరెడ్డి ఇంకా ఎక్కువ కాలం రాజకీయాల్లో చురుగ్గా తిరిగే అవకాశాలు లేవు. ఐదేళ్ల తర్వాత పరిస్థితులు ఎలా ఉంటాయో ఊహించడం కష్టం. ఈ పరిస్థితుల్లో అధినేత జగన్మోహన్ రెడ్డికి అన్నీ వివరించి తన నిష్క్రమణపై ప్రకటన చేశారంటున్నారు. కాకినాడ పోర్టు కేసు తన వరకు రాకూడదనే ఉద్దేశంలో ఉన్న జగన్ కూడా విజయసాయిరెడ్డి వైదొలగతాననే విన్నపాన్ని తక్షణం అంగీకరించారని అంటున్నారు. ఇలా మరోసారి జైలుకు వెళ్లే ఇబ్బందుల నుంచి తప్పించుకోడానికే విజయసాయిరెడ్డి వ్యూహాత్మకంగా వ్యవహరించారని, ఇందుకు జాతీయ స్థాయిలో బీజేపీ పెద్దల సహకారం తీసుకుని రాష్ట్ర ప్రభుత్వంతో చర్చలు జరిపారని చెబుతున్నారు. ఏదిఏమైనా విజయసాయిరెడ్డి నిష్క్రమణ రాష్ట్ర రాజకీయాలను మరో మలుపు తిప్పనుందని అంటున్నారు.