విజయసాయి ట్వీట్ల పవర్ తొలిసారి చూస్తున్నారా ?
విజయసాయిరెడ్డి. ఆడిటర్ నుంచి పొలిటీషియన్ గా టర్న్ అయిన వారు. ఆయన టాలెంట్ తోనే జాతీయ స్థాయిలో పెద్దలతో పరిచయాలు పెంచుకుని ఈ రోజున కీలక నేతగా ఉన్నారు.
By: Tupaki Desk | 17 March 2025 12:21 AM ISTవిజయసాయిరెడ్డి. ఆడిటర్ నుంచి పొలిటీషియన్ గా టర్న్ అయిన వారు. ఆయన టాలెంట్ తోనే జాతీయ స్థాయిలో పెద్దలతో పరిచయాలు పెంచుకుని ఈ రోజున కీలక నేతగా ఉన్నారు. అయితే రెండు నెలల క్రితం ఆయన తనకు వద్దు రాజ్యసభ సభ్యత్వం అని రాజీనామా చేశారు. ఆ తరువాత ఆయన వైసీపీని కూడా వీడివెళ్ళారు.
రాజకీయ సన్యాసం అని పెద్ద మాట వాడారు. ఆ తరువాత కొంతకాలమే సైలెంట్ గా ఉన్నారు. ఇపుడు ఆయన సోషల్ మీడియాలో ఎక్స్ వేదికగా తన ట్విట్టర్ హ్యాండిల్ కి మళ్ళీ పని చెబుతున్నారు. విజయసాయిరెడ్డి ట్వీట్లకు మంచి ఆదరణ ఉంది. అద్భుతమైన రెస్పాన్స్ కూడా ఉంది.
ఆయన ట్వీట్ వేశారు అంటే ప్రత్యర్ధులు నలిగిపోవాల్సిందే అని అంటారు. ఆయన వైసీపీ నుంచి టీడీపీ వైపుగా వేసిన ట్వీట్లు పసుపు శిబిరంలో మంటనే పుట్టించాయి ఆయన చంద్రబాబు లోకేష్ బాబులను టార్గెట్ గా చేసుకుని వందల ట్వీట్లు వేశారు. అవన్నా ఫన్నీగా ఉండడంతో పాటు అవసరమైన పొలిటికల్ మసాలాతో కూడిన ఫైర్ ని కూడా రగిలించేవి. ఆనాడు సాయిరెడ్డి ట్వీట్లను వైసీపీ శ్రేణులు అంతా ఫుల్ ఎంజాయ్ చేసేవి.
వైసీపీ పెద్దలు సైతం వాటిని చూసి హ్యాపీగా ఫీల్ అయ్యేవారు. కానీ కాలం ఒక్కటిగా ఉండదు కదా. విజయసాయిరెడ్డి ట్విట్టర్ కత్తి ఆ వైపు నుంచి ఈ వైపునకు వస్తుందని ఎవరూ కలలో కూడా ఊహించి ఉండరు. ఆయన వైసీపీకి రాజీనామా చేసి వ్యవసాయం చేసుకుంటారు అంటే చాలా మంది అవునా అనుకున్నారు.
కానీ రీసెంట్ గా ఆయన విజయవాడలో మీడియాతో మాట్లాడుతూ వైసీపీ నేతల మీద కోటరీ మీద వేసిన సెటైర్లు కామెంట్స్ హాట్ గా ఉన్నాయి. దాంతో విజయసాయిరెడ్డి ట్వీట్లు ఏ వైపో ఆనాడే అర్ధం అయిపోయింది. విజయసాయిరెడ్డి వంటి సీరియస్ పొలిటీషియన్ ఊరికే ఉంటారు అనుకుంటే పొరపాటు అని కూడా అంటున్నారు.
ఆయన అందుకే తన ట్విట్టర్ కి పనిచెబుతున్నారు. ఆయన లేటెస్ట్ గా కోటలు కోటరీలు రాజులు రాజ్యాలు అంటూ వేసిన ట్వీట్ నేరుగా జగన్ మీదనే అని అనుకుంటున్నారు. రాజులు జనంలోకి రాక వందిమాగధులు చెప్పిన దానిని విని అలగే అనుకుని అంతా బాగుంది అనుకుంటే రాజులు రాజ్యాలు కూడా ముగిసిపోయాయని ట్వీట్ చేశారు.
రాజు తెలివైనవాడు అయితే మారు వేషంలో వచ్చి వాస్తవాలు అన్నీ కనుగొంటారని ఆయన ట్వీట్ లో చెప్పారు. అలా ప్రజల బాగోగులు తెలుస్కుంటాడని కోటరీ అడ్డుగోడలు లేకుండా చూసుకుంటారని కూడా విజయసాయిరెడ్డి అన్నారు. ఇదంతా ఎందుకు అంటే జగన్ చుట్టూ కోటరీ ఉందని చెప్పిన విజయసాయిరెడ్డి ఇపుడు ఆయన మేలుకోవాలని అర్ధం వచ్చేలా ఈ ట్వీట్ చేశారని అంటున్నారు.
ఆయన ట్వీట్ ఇపుడు జగన్ చుట్టూ తిరుగుతోందని రానున్న రోజులలో మరిన్ని ట్వీట్లు ఆయన చేస్తారు అని అంటున్నారు. విజయసాయిరెడ్డి ఎదురు నిలబడి ఈ విధంగా సోషల్ మీడియా ద్వారా ఇండైరెక్ట్ గా అయినా నేరుగా అయినా పోరాటం చేస్తే కనుక అది వైసీపీని మరింతగా ఇబ్బందులలోకి నెడుతుందని అంటున్నారు.
విజయసాయిరెడ్డి రాజకీయ మేధావిగా ఉన్నారు. ఆయన వైసీపీని వీడడం అతి పెద్ద నష్టం అయితే ఆయన ఈ విధంగా ఎదురు నిలిచి ట్వీట్లతో కత్తి పడితే ఇంకా కష్టం నష్టం అని అంటున్నారు. మొత్తానికి విజయసాయిరెడ్డి ట్వీట్ల పవర్ పదును వైసీపీకి తొలిసారిగా అర్ధం అవుతోందని అంటున్నారు. అయితే ఇది ఆరంభం మాత్రమే అని ముందు ముందు మరిన్ని ఇలాంటివి ఎన్నో చూడాల్సి ఉందని అంటున్నారు.