మొబైల్ యాప్ లు ట్యాప్... విజయసాయిరెడ్డి సంచలన వ్యాఖ్యలు!
డేటా ప్రొటెక్షన్ బిల్లుపై రాజ్యసభలో జరిగిన చర్చలో వైసీపీ పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డి స్పందించారు
By: Tupaki Desk | 10 Aug 2023 6:37 AM GMTడేటా ప్రొటెక్షన్ బిల్లుపై రాజ్యసభలో జరిగిన చర్చలో వైసీపీ పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డి స్పందించారు. ఈ సందర్భంగా ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. మొబైల్ లోని స్పీకర్ ను నియంత్రించడం ద్వారా, వెనుక వైపు ఉన్న కెమెరా ద్వారా కూడా సంభాషణలు ట్యాప్ చేయొచ్చని కీలక వ్యాఖ్యలు చేశారు.
అవును... మొబైల్ లోని స్పీకర్ ను నియంత్రించడం ద్వారా, వెనుక వైపు ఉన్న కెమెరా ద్వారా కూడా సంభాషణలు ట్యాప్ చేయొచ్చని, ఇందుకు సర్వీస్ ప్రొవైడర్ నో, టవర్ నుంచి వచ్చే సంకేతాలనో నియంత్రణలోకి తీసుకోవాల్సిన అవసరం కూడా లేదని రాజ్యసభలో వ్యాఖ్యానించారు విజయసాయిరెడ్డి. ఇదే సమయంలో మొబైల్ లోని ఏ యాప్ నైనా ట్యాప్ చేయొచ్చని అన్నారు.
ఈ సందర్భంగా... వాట్సప్, ఫేస్ టైమ్, టెలిగ్రామ్, సిగ్నల్ ఇలా మొబైల్ లోని ఏ యాప్ నైనా ట్యాప్ చేయొచ్చని.. అలా చేయడాన్ని తాను కళ్లారా చూశానని విజయసాయిరెడ్డి తెలిపారు. ట్యాప్ చేసే విధానాన్ని విదేశీ కంపెనీలు ప్రదర్శిస్తుండగా ప్రత్యక్షంగా చూసినట్లు ఆయన వెల్లడించారు. అయితే వాటి అమ్మకాల్లో నిబంధనలు ఉన్నాయని అన్నారు.
విదేశాలకు చెందిన ఆయా కంపెనీలు.. ప్రభుత్వాలు, ప్రభుత్వ సంస్థలకు మాత్రమే ఆరకం సాఫ్ట్ వేర్ లు అమ్ముతామనే నిబంధనను విధిస్తున్నాయని తెలిపారు. అయితే ప్రభుత్వ శాఖల ముసుగులో పలువురు వాటిని కొనుగోలు చేసి స్వప్రయోజనాల కోసం వినియోగిస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు.
ఇందుకు సంబంధించి సుమారు 15 నుంచి 20 సాఫ్ట్ వేర్లు ఉన్నాయని.. వాటి విలువ రూ.50 కోట్ల నుంచి రూ.వంద కోట్ల వరకు ఉందని.. దీంతోపాటు ఏడాదికి నిర్వహణ నిమిత్తం అందులో 20 శాతం వరకు వసూలు చేస్తారని తెలిపారు.
ఇలా.. అంత పెద్ద మొత్తం వెచ్చించే వారు ఎవరి ఫోన్ నైనా ట్యాప్ చేయొచ్చని విజయసాయిరెడ్డి వివరించారు. ఉదాహరణకు తాను తన ప్రత్యర్ధి మొబైల్ లోకి బగ్ ను పంపించొచ్చని.. లేదా ఆయన తన ఫోన్ లోకి బగ్ పంపించొచ్చని టీడీపీ ఎంపీ కనకమేడల రవీంద్రకుమార్ ను ఉద్దేశించి విజయసాయిరెడ్డి వ్యాఖ్యానించారు!