తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోతుంది: సాయిరెడ్డి సంచలన వ్యాఖ్యలు
వైసీపీ నాయకుడు, రాజ్యసభ సభ్యుడు వేణుంకాబం విజయసాయిరెడ్డి తాజాగా సంచలన వ్యాఖ్యలు చేశారు
By: Tupaki Desk | 5 Feb 2024 7:06 PM GMTవైసీపీ నాయకుడు, రాజ్యసభ సభ్యుడు వేణుంకాబం విజయసాయిరెడ్డి తాజాగా సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో సుదీర్ఘ విరామం తర్వాత.. ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం త్వరలోనే కుప్పకూలి పోతుందని ఆయన అన్నారు. రాజ్యసభలో సోమవారం ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీపై తీవ్ర విమర్శలు చేశారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని హామీ ఇచ్చి, రాష్ట్ర విభజనతో రెండు రాష్ట్రాల్లో అధికారంలోకి రావాలని కాంగ్రెస్ చేసిన ప్లాన్ తునాతునకలు అయిపోయిందన్నారు. ఏపీతో పాటు తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ కుట్రలు తెలిసి, ఆ పార్టీకి 10 ఏళ్ల పాటు ఎన్నికల్లో బుద్ధి చెప్పారని అన్నారు.
సుదీర్ఘ విరామం, పదేళ్ల తర్వాత.. అతికష్టమ్మీద అనేక అబద్ధాలతో కూడిన వాగ్దానాలు చేసి తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందన్నారు. కానీ, కాంగ్రెస్ ప్రభుత్వం త్వరలోనే కూలిపోతుందన్నారు. ''ఇప్పుడు కూడా ఎన్నో అబద్ధాలు చెప్పి తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోతుంది. కొన్ని రోజులు వేచి చూస్తే చాలు. అప్పటి యూపీఏ ప్రభుత్వం ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పినా.. విభజన చట్టంలో ఆ అంశాన్ని చేర్చకపోవడంతో ప్రజలు ఎంతగానో నష్టపోయారు. రాష్ట్రాన్ని విభజించింది, కానీ ఏపీకి మాత్రం కాంగ్రెస్ పార్టీ తీరని అన్యాయం చేసింది'' అని సాయిరెడ్డి ఆంగ్ల ప్రసంగంతో విరుచుకుపడ్డారు.
ఏపీ విభజన అసంబద్ధంగా, అసంపూర్తిగా జరిగిందని సాయిరెడ్డి అన్నారు. ఈ కారణంగానే రాష్ట్రం అన్ని విధాలా నష్టపోయిందని చెప్పారు. ప్రత్యేక హోదా ఇవ్వకుండా మోసం చేశారని, అందుకే ఏపీ ప్రజలు కాంగ్రెస్ పార్టీని ఎప్పటికీ క్షమించరని వ్యాఖ్యానించారు. వచ్చే ఎన్నికల్లో రాహుల్ గాంధీ దేశంలో ఏ మూల నుంచి పోటీ చేసినప్పటికీ విజయం దక్కించుకోవడం దుస్సాధ్యమని చెప్పారు. ''2029 నాటికి కాంగ్రెస్ ముక్త్ భారత్ గా దేశం మారుతుంది'' అని విమర్శించారు. గత 2019లో జరిగిన ఏపీ ఎన్నికల్లో నోటా కంటే తక్కువ ఓట్లు కాంగ్రెస్ పార్టీకే వచ్చాయని, దీనిని బట్టి ఆ పార్టీ పరిస్థితి ఎలా ఉందో అర్థమవుతుందని అన్నారు. ఏపీకి చేసిన మోసానికి కాంగ్రెస్ కు శిక్షలు పడుతూనే ఉంటాయని వ్యాఖ్యానించారు.