Begin typing your search above and press return to search.

విజన్ విషయంలో గతం గుర్తుచేసిన సాయిరెడ్డి...సెటైర్స్ పీక్స్!

గతంలో ట్విట్టర్ వేదికగా వైరల్ వ్యాఖ్యలు చేసే వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి.. మధ్యలో చిన్న గ్యాప్ తీసుకున్నట్లు కనిపించారు

By:  Tupaki Desk   |   16 Aug 2023 7:03 AM GMT
విజన్ విషయంలో గతం గుర్తుచేసిన సాయిరెడ్డి...సెటైర్స్ పీక్స్!
X

గతంలో ట్విట్టర్ వేదికగా వైరల్ వ్యాఖ్యలు చేసే వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి.. మధ్యలో చిన్న గ్యాప్ తీసుకున్నట్లు కనిపించారు. అనంతరం... ఆఫ్టర్ ఎ స్మాల్ గ్యాప్.. బాస్ ఈస్ బ్యాక్ అన్నట్లుగా మళ్లీ మొదలుపెట్టారని చెబుతున్నారు. ఈ సందర్భంగా చంద్రబాబుపై మరోసారి తనవైన వ్యగ్యాంస్త్రాలు సంధించారు.

అవును... విజయసాయి రెడ్డి గతకొన్ని రోజులుగా ట్విట్టర్ లో ఫుల్ యాక్టివ్ అయినట్లు కనిపిస్తున్నారు. ఇందులో భాగంగా ముఖ్యంగా చంద్రబాబు చేస్తున్న ప్రకటనల్ని ఎప్పటికప్పుడు టార్గెట్ చేస్తూ ట్వీట్స్ రూపంలో ట్రోల్ చేస్తున్నారు. ఇదే క్రమంలో తాజాగా వైజాగ్ లో చంద్రబాబు విడుదల చేసిన "విజన్ - 2047" ను టార్గెట్ చేశారు విజయసాయిరెడ్డి.

వైజాగ్ లో టీడీపీ అధినేత చంద్రబాబు "గ్లోబల్‌ ఫోరం ఫర్‌ సస్టెయినబుల్‌ ట్రాన్స్‌ఫర్మేషన్‌" (జీఎఫ్‌ఎస్‌టీ) ఛైర్మన్ హోదాలో ఇండియా విజన్ - 2047 డాక్యుమెంట్ ను విడుదల చేశారు. ఇందులో భాగంగా... స్వాతంత్రం సాధించి వందేళ్లు పూర్తి చేసుకునే నాటికి (2047) భారత్ గ్లోబల్ పవర్ గా ఎదగాలంటే అనుసరించాల్సిన ఐదు వ్యూహాల్ని విడుదల చేశారు.

ఈ సందర్భంగా... దేశ పురోభివృద్ధిలో తొలి అడుగు అయ్యేలా.. విజ్ఞాన వినియోగ సామర్థ్యం పెంపొందించి, దాన్ని అవసరమైన వర్గాలకు అందించడం ద్వారా వారి అభివృద్ధికి సోపానాలు వేయడమే విజన్‌-2047 లక్ష్యమని చంద్రబాబు చెప్పుకొచ్చారు. సరిగ్గా ఇదే విషయంపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ట్వీట్ చేశారు.

"విజన్ 2020 అని దేశమంతా తిరిగి స్వీయ ప్రగల్భాలు పలికినా 2004లో ప్రజలు చిత్తుగా ఓడించారు" అని గుర్తుచేసిన విజయసాయిరెడ్డి.. "ఇప్పుడు విజన్ 2047 అంటూ మరో గారడీ చేయాలని చూస్తున్నారు" అని ఆక్షేపించారు. అనంతరం... "ఓటి పడవకు పైన ఎన్ని అలంకారాలు చేసినా నీటిలోకి వెళ్లిన తర్వాత మునగక తప్పదు" అంటూ సాయిరెడ్డి సెటైర్లు వేశారు.

కాగా... గతంలో చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు విజన్ 2020 గురించి చెప్పిన సంగతి తెలిసిందే. కానీ 2004 నాటికి ఆయన రాష్ట్రంలో అనుసరించిన విధానాల కారణంగా అధికారం కోల్పోయారు. తిరిగి అధికారంలోకి రావడానికి ఆయనకు పదేళ్లు పట్టింది.

ఇదే సమయంలో 2014లో బీజేపీ, జనసేన కూటమి పొత్తుతో చంద్రబాబు తిరిగి అధికారం సాధించగలిగారు. అప్పుడు కూడా విజన్ 2029 ని తెరపైకి తెచ్చారు. అయితే 2014 సమయంలో ఆయన పాలన ఫలితంగా 2019లో 23సీట్లకే పరిమితం అయ్యారు. ఈ నేపథ్యంలో మరోసారి విజన్ 2047 ని తెరపైకి తెచ్చారు. ఈ సందర్భంగా సాయిరెడ్డి ట్వీట్ చేశారని తెలుస్తుంది!