విజయసాయిరెడ్డి ఒంటరి పోరాటం ?
వైసీపీలో నంబర్ టూగా ఉంటూ వచ్చిన వి విజయసాయిరెడ్డి ప్రభ నెమ్మదిగా కరిగిపోతోందా అన్న చర్చ మొదలైంది.
By: Tupaki Desk | 19 July 2024 10:30 AM GMTవైసీపీలో నంబర్ టూగా ఉంటూ వచ్చిన వి విజయసాయిరెడ్డి ప్రభ నెమ్మదిగా కరిగిపోతోందా అన్న చర్చ మొదలైంది. ఆయన ఒకనాడు జగన్ కి సర్వస్వంగా ఉండేవారు. జగన్ తో పాటు పదహారు నెలల పాటు జైలు జీవితాన్ని అనుభవించి వచ్చిన విజయసాయిరెడ్డి 2019లో వైసీపీని అధికారంలోకి తీసుకుని రావడంతో అత్యంత కీలకమైన భూమిక పోషించారు.
అటువంటి ఆయన పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత ఉత్తరాంధ్రాలో రీజనల్ కో ఆర్డినేటర్ గా వ్యవహరించారు. మూడేళ్ళ పాటు ఉన్న తరువాత 2022లో ఆయనను తప్పించి వైవీ సుబ్బారెడ్డికి ఆ బాధ్యతలు అప్పగించారు. దాని వెనక వైసీపీలో విజయసాయిరెడ్డి అంటే పడని వారే ఇలా హైకమాండ్ కి చెప్పి చేయించారు అని అంటారు.
ఇక ఆనాటి నుంచి విజయసాయిరెడ్డికి గుర్తింపు తగ్గింది. 2024 ఎన్నికల్లో నెల్లూరు నుంచి విజయసాయిరెడ్డి ఎంపీగా పోటీ చేసి ఓటమి పాలు అయ్యారు. వైసీపీ కూడా ఓటమి పాలు అయింది. ఇక వైసీపీకి 2016 నుంచి 2024 వరకూ ఎనిమిదేళ్ళ పాటు పార్లమెంటరీ పార్టీ నేతగా ఉంటూ వచ్చిన విజయసాయిరెడ్డిని ఆ పదవి నుంచి తప్పించి ఆ బాధ్యతలు వైవీ సుబ్బారెడ్డికి ఇచ్చారు.
రాజ్యసభలో వైసీపీ పక్ష నేతగా మాత్రమే ఆయన ప్రస్తుతమున్నారు. ఆరున్నర పదుల వయసులో విజయసాయిరెడ్డి ఎవరూ ఎదుర్కోని ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఒక మహిళా అధికారితో ఆయన బిడ్డను కన్నారన్న ఆరోపణలు మానసికంగానే కాదు అన్ని విధాలుగా ఆయన్ని ఇబ్బంది పెడుతున్నాయి. అదే సమయంలో భూ దందా ఆరోపణలు కూడా ఆయన మీద కూటమి నేతలు చేస్తున్నారు.
విశాఖలో కొద్ది రోజుల క్రితం విజయసాయిరెడ్డి మీడియా మీటింగ్ పెట్టి మరీ తనను తాను రక్షించుకునే ప్రయత్నం చేశారు. ఈ విషయంలో ఎంత దాకా అయినా పోరాడుతాను అని స్పష్టం చేశారు. ఇదే సమయంలో ఆయన వైసీపీలోని కొంతమంది తనను ప్రతిపక్షంతో కలసి ఇబ్బందులకు గురి చేశారు అని కూడా హాట్ కామెంట్స్ చేశారు.
ఇవన్నీ పక్కన పెడితే విజయసాయిరెడ్డికి ఈ క్లిష్ట పరిస్థితులలో పార్టీ నుంచి మద్దతు అయితే పెద్దగా రాకపోవడాన్ని అంతా చర్చిస్తున్నారు. ఆయన సైతం ఇదే విషయం మీద బాధ పడుతున్నారని అంటున్నారు. పార్టీ కోసం ఎంతో చేశామని ఈ సమయంలో తనకు సపోర్ట్ గా ఎవరూ లేకపోవడంతో ఒంటరి అయ్యామని ఫీల్ అవుతున్నారని ప్రచారం సాగుతోంది.
అయితే విజయసాయిరెడ్డి మీద ఇంతటి నింద పడిన నేపధ్యంలో ఆయన తానుగా ఒంటరి పోరాటం చేయాల్సిందేనా అన్నది కూడా అంతా చర్చించుకుంటున్నారు. విజయసాయిరెడ్డి మీద ఇదే అదనుగా టీడీపీ కూటమి బాణాలను ఎక్కు పెడుతోంది. నారా లోకేష్ అయితే ఎక్స్ ద్వారా ట్వీట్ చేస్తూ విజయసాయిరెడ్డిని విమర్శిస్తే నెల్లూరు జిల్లాకే చెందిన మంత్రి ఆనం రామనారాయణరెడ్డి అయితే రాజకీయాలకే విజయసాయిరెడ్డి అనర్హుడు అని ఘాటు వ్యాఖ్యలు చేశారు. మరి రాజకీయంగా కష్టకాలంలో ఉన్న విజయసాయిరెడ్డి ఎలా బయటపడతారో చూడాలి. ఇదే క్రమంలో ఆయన సంచలన నిర్ణయాలు ఏమైనా తీసుకుంటారా అన్న చర్చ కూడా సాగుతోంది.