సీమకు ఇన్ ఛార్జి కాగానే చెలరేగిపోతున్న సాయిరెడ్డి
దీంతో వైసీపీ సోషల్ మీడియా ఒకింత బోసినట్టు అయిపోయింది
By: Tupaki Desk | 31 July 2023 4:20 AM GMTఎంత నేర్చినా.. ఎంత వారలైనా.. అంటూ.. త్యాగరాజస్వామి కీర్తన అప్పుడప్పుడు మనకు వినిపిస్తూనే ఉంటుంది. ఎలాంటి వారైనా.. కాంత దాసులేనని ఆయన సూత్రీకరించారు. అయితే.. దీనికి వైసీపీ కీలక నాయకుడు, రాజ్యసభ ఎంపీ వేణుంబాకం విజయసాయిరెడ్డికి సంబంధం లేదు కానీ.. అలానే ఉన్నట్టుగా ఉందంటూ.. నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.
ఎందుకంటే.. నిన్న మొన్నటి వరకు సాయిరెడ్డి ఎక్కడున్నారో.. ఏం చేస్తున్నారో.. తెలియకుండా.. అజ్ఞాత వాసిగా కాలం గడిపారు. దీంతో వైసీపీ సోషల్ మీడియా ఒకింత బోసినట్టు అయిపోయింది. కొందరు ఇదే విషయంపై కామెంట్లు కూడా చేశారు. అయితే.. ఇంతలోనే.. సాయిరెడ్డి మళ్లీ విజృంభించారు. ఏపీ రాజకీయ పరిణామాలపై గంటకో ట్వీటు.. రెండు గంటలకో విమర్శ అన్నట్టుగా విరుచుకుపడుతున్నారు.
ఇదే ఇప్పుడు ఆసక్తిగా మారింది. సాయిరెడ్డి అలా.. అదృశ్యం కావడం, ఇటా మళ్లీ ప్రత్యక్షం కావడం.. పొలిటి కల్ విమర్శలతో వేడిపుట్టించడం.. వంటి అంశాలపై నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ఉత్తరాంధ్ర ఇంచార్జ్ పదవి నుంచి తప్పించి.. వైవీ సుబ్బారెడ్డిని నియమించడం.. వైసీపీ సోషల్ మీడియా విభాగం ఇంచార్జ్‌గా తప్పించి.. సజ్జల కుమారుడికి అప్పగించడం నేపథ్యంలో సాయిరెడ్డి సైలెంట్ అయ్యారు.
కనీసం మాట మాత్రంగా కూడా.. ఆయన స్పందించలేదు. వారాహి యాత్ర 1.0, 2.0 సమయంలో రాజకీ యంగా పెద్ద రగడ తెరమీదికి వచ్చినప్పుడు కూడా సాయిరెడ్డి మౌనంగా ఉన్నారు. కానీ, ఇటీవల మళ్లీ సీమ జిల్లాలకు ఇంచార్జ్‌కు నియమించే సరికి.. వెంటనే ఫోన్‌ను రిచార్జ్ చేసినట్టు వెంటనే తెరమీదికి వచ్చేశారని.. ట్వీట్ కూతలు కూస్తున్నారని.. నెటిజన్లు అంటున్నారు. ఏదేమైనా.. పదవులు లేకపోతే.. సాయిరెడ్డి కూడా ఇంతేనని చెబుతున్నారు. ఎంత నేర్చినా.. ఎంత చూసినా.. ఎంత వారలైనా.. పదవీ దాసులేనని అవి లేకపోతే ముందుకు సాగలేరని అంటున్నారు.