Begin typing your search above and press return to search.

రాములమ్మకు స్టార్ క్యాంపెయినర్ హోదా ?

తొందరలోనే బీజేపీకి రాజీనామా చేయబోతున్న విజయశాంతి(రాములమ్మ) కాంగ్రెస్ లో చేరటం ఖాయమనే ప్రచారం పెరిగిపోతోంది.

By:  Tupaki Desk   |   12 Nov 2023 11:30 AM GMT
రాములమ్మకు స్టార్ క్యాంపెయినర్ హోదా ?
X

తొందరలోనే బీజేపీకి రాజీనామా చేయబోతున్న విజయశాంతి(రాములమ్మ) కాంగ్రెస్ లో చేరటం ఖాయమనే ప్రచారం పెరిగిపోతోంది. నిజానికి రాములమ్మకు ఇంతకుమించిన ఆప్షన్ కూడా లేదు. ఎందుకంటే చాలాకాలంగా రాములమ్మకు బీజేపీలో ఎలాంటి ప్రాధాన్యత దక్కటంలేదు. పోటీచేసే అవకాశం ఎక్కడా లభించలేదు. అలాగే పార్టీ తరపున ప్రచారం చేసేట్లుగా స్టార్ క్యాంపెయినర్ హోదా కూడా దక్కలేదు. ఇదంతా ముందు అనుమానించిందే. ఎందుకంటే పార్టీ కార్యక్రమాలకు విజయశాంతి చాలా దూరంగా ఉంటున్నారు.

బహుశా ఒకటి రెండురోజుల్లోనే బీజేపీకి రాములమ్మ రాజీనామా చేయబోతున్నట్లు బాగా ప్రచారం పెరిగిపోతోంది. ఇక కాంగ్రెస్ విషయం చూస్తే పార్టీలో చేరిన వెంటనే స్టార్ క్యాంపెయినర్ హోదా ఇవ్వాలని హస్తంపార్టీ నేతలు డిసైడ్ అయ్యారట. అసెంబ్లీ ఎన్నికల్లో పోటీకి ఎలాగూ అవకాశంలేదు కాబట్టి ఈ ఎన్నికల్లో అన్నీ నియోజకవర్గాల్లో ప్రచారం చేయించాలని ప్లాన్ చేస్తోందట. ఇపుడు స్టార్ క్యాంపెయినర్ హోదాలో కూర్చోబెట్టి తొందరలోనే జరగబోయే పార్లమెంటు ఎన్నికల్లో టికెట్ ఇచ్చే ఉద్దేశ్యంలో కాంగ్రెస్ ఉన్నట్లు సమాచారం.

రాములమ్మ కూడా అసెంబ్లీ ఎన్నికల్లో పోటీకి పెద్దగా ఆసక్తి చూపటంలేదు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని ఏదో ఒక పార్లమెంటు స్ధానం నుండి పోటీచేయాలని అనుకుంటున్నారట. దానికి కాంగ్రెస్ అగ్రనేతలు కూడా సానుకూలంగా స్పందించిన కారణంగానే బీజేపీకి రాజీనామా చేయాలని డిసైడ్ అయినట్లు తెలుస్తోంది. పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్న కారణంగా ఎక్కువరోజులు విజయశాంతి ఉండరని కమలనాదులు కూడా అనుమానిస్తునే ఉన్నారు. అందుకనే అసెంబ్లీ టికెట్ కానీ స్టార్ క్యాంపెయినర్ హోదా కానీ ఇవ్వలేదు.

మొత్తానికి రోగి కోరింది వైద్యుడు ఇచ్చింది ఒకటే మందన్నట్లుగా విజయశాంతి కోరుకుంటున్నది, పార్టీ చేస్తున్నది ఒకటిగానే ఉంది. అందుకనే బీజేపీలో నుండి రాములమ్మ బయటకు వచ్చేయటం ఖాయమనే ప్రచారం పెరిగిపోతోంది. పార్టీలో చేరితే తనకు దక్కబోయే హోదాపై ఇప్పటికే విజయశాంతి ఏఐసీసీ స్పష్టమైన హామీ తీసుకున్నట్లు సమాచారం. ఇదే సమయంలో బీజేపీలో నుండి కాంగ్రెస్ లో చేరిన కోమటిరెడ్డి రాజగోపాలరెడ్డి చొరవ తీసుకుని విజయశాంతి విషయం ఫైనల్ చేయటంలో బాగా యాక్టివ్ గా ఉన్నట్లు కాంగ్రెస్ వర్గాల సమాచారం. చివరకు ఏమవుతుందో చూడాలి.