రాములమ్మ 2.0.. సినిమాల్లోనే కాదు.. రాజకీయాల్లోనూ.. అధిష్ఠానంతో టచ్
అందుకోసం అవసరమైతే అధిష్ఠానం చుట్టూ తిరగాలి.. అనుకున్నది సాధించాలి.. ఇప్పుడు రాములమ్మ విజయశాంతి అదే చేశారు.
By: Tupaki Desk | 10 March 2025 11:37 AM ISTమహా సముద్రం లాంటి కాంగ్రెస్ పార్టీలో అంతే.. అధిష్ఠానంతో సరైన సమయంలో టచ్ లోకి వెళ్లాలి.. వారు ఇచ్చిన హామీని గుర్తు చేయాలి. అందుకోసం అవసరమైతే అధిష్ఠానం చుట్టూ తిరగాలి.. అనుకున్నది సాధించాలి.. ఇప్పుడు రాములమ్మ విజయశాంతి అదే చేశారు.
బీజేపీలో మంచి స్థాయిలో ఉంటూ 2023లో జరిగిన అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ లోకి వచ్చారు విజయశాంతి. దీంతో అందరూ ఆశ్చర్యపోయారు. కాంగ్రెస్ ఓడిపోతే పరిస్థితి ఏంటి? అనే అనుమానం ఉన్నా.. విజయశాంతి ధైర్యం చేసి నిర్ణయం తీసుకున్నారు.
రాములమ్మ కాంగ్రెస్ లోకి వచ్చే సమయంలోనే అప్పటి రాష్ట్ర వ్యవహారాల ఇన్ చార్జి మణిక్ రావ్ ఠాక్రేకు తనకు పదవి ఇవ్వాలనే షరతు పెట్టారట. ఈ షరతును గుర్తు చేసేందుకు విజయశాంతి ఇటీవల కాంగ్రెస్ హై కమాండ్ వద్దకు వెళ్లారట. ఢిల్లీలో కాంగ్రెస్ పెద్దలను కలిసి తనకు ఇచ్చిన హామీని ప్రస్తావిస్తూ ఎమ్మెల్సీ టికెట్ కావాలని కోరినట్లు తెలిసింది.
ఇక ఠాక్రే సైతం గతంలో విజయశాంతికి ఇచ్చిన హామీని అధిష్ఠానం చెవిన వేసినట్లు తెలిసింది. అందుకనే అనూహ్యంగా రాములమ్మను పదవి వరించింది.
ఇక కాంగ్రెస్ ఎమ్మెల్సీ టికెట్ కోసం బీసీ నాయకులు పెద్దఎత్తున పోటీ పడుతుండడంతో అధిష్ఠానం కూడా మధ్యే మార్గం ఆలోచించింది. మహిళా కోటాలో బీసీ కోటానూ పరిగణిస్తూ విజయశాంతిని ఎంపిక చేసింది.
దీంతో.. ఐదేళ్ల కిందట సరిలేరు నీకెవ్వరు సినిమాతో సినిమాల్లో సెకండ్ ఇన్నింగ్స్ ను ఘనంగా స్టార్ట్ చేసిన లేడీ సూపర్ స్టార్ విజయ శాంతి ఇప్పుడు రాజకీయాల్లోనూ సెకండ్ ఇన్నింగ్స్ ను అంతే ఘనంగా మొదలుపెట్టారు.
కొసమెరుపు: 2009లో తొలిసారి ఎంపీగా గెలిచి చట్ట సభలో అడుగుపెట్టిన విజయశాంతి 16 ఏళ్ల తర్వాత ఎమ్మెల్సీగా చట్ట సభలో అడుగుపెడుతున్నారు. అది కూడా అధికార పార్టీ సభ్యురాలిగా.. మరి రాజకీయ సెకండ్ ఇన్నింగ్స్ లో ఎంతవరకు రాణిస్తారో?