Begin typing your search above and press return to search.

విజయశాంతికి కీలక పదవిని అప్పగించిన కాంగ్రెస్‌!

నవంబర్‌ 30న తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ముంగిట భారతీయ జనతా పార్టీకి గట్టి షాక్‌ తగిలిన సంగతి తెలిసిందే.

By:  Tupaki Desk   |   18 Nov 2023 7:41 AM GMT
విజయశాంతికి కీలక పదవిని అప్పగించిన కాంగ్రెస్‌!
X

నవంబర్‌ 30న తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ముంగిట భారతీయ జనతా పార్టీకి గట్టి షాక్‌ తగిలిన సంగతి తెలిసిందే. ఆ పార్టీకి ప్రముఖ సినీ నటి, మాజీ ఎంపీ విజయశాంతి రాజీనామా చేశారు. గత కొంతకాలంగా బీజేపీ పట్ల అసంతృప్తిగా ఉంటున్న విజయశాంతి ఆ పార్టీ కార్యక్రమాలకు హాజరు కాని సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆమె హైదరాబాద్‌ లో భారత జాతీయ కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే సమక్షంలో కాంగ్రెస్‌ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు.

కాగా కాంగ్రెస్‌ పార్టీలో చేరిన ఒక్క రోజులోనే విజయశాంతికి కీలక పదవి లభించింది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు రాష్ట్ర ప్రచార, ప్లానింగ్‌ కమిటీని కాంగ్రెస్‌ పార్టీ నియమించింది. మొత్తం 15 మంది సభ్యులతో ఈ కమిటీని ఏర్పాటు చేసింది. ఇందులో భాగంగా కాంగ్రెస్‌ ప్రచార, ప్లానింగ్‌ కమిటీ చీఫ్‌ కోఆర్డినేటర్‌ బాధ్యతలను విజయశాంతికి అప్పగించింది.

ఇక ప్రచార, ప్లానింగ్‌ కమిటీకి కన్వీనర్లుగా సమరసింహారెడ్డి, పుష్పలీల, మల్లు రవి, కోదండరెడ్డి, నరేందర్‌ రెడ్డి, యరపతి అనిల్, రాములు నాయక్, పిట్ల నాగేశ్వరరావు, ఒబేదుల్లా కొత్వాల్, రమేష్, పారిజాతరెడ్డి, సిద్దేశ్వర్, రామ్మూర్తి నాయక్, అలీ బిన్‌ ఇబ్రహీం, దీపక్‌ జాన్‌ లను నియమించింది.

కాగా విజయశాంతి రాజకీయ ప్రస్థానం 1997లో మొదలైంది. 1997లో బీజేపీలో చేరి ఆ పార్టీ మహిళా విభాగం ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టారు. 2005లో ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన కోసం సొంతంగా తల్లి తెలంగాణ పార్టీని ఏర్పాటు చేశారు. ఆ తర్వాత కేసీఆర్‌ కోరిక మేరకు తల్లి తెలంగాణ పార్టీని టీఆర్‌ఎస్‌ లో విలీనం చేశారు. ఈ క్రమంలో టీఆర్‌ఎస్‌ తరఫున 2009లో మెదక్‌ నుంచి లోక్‌ సభకు ఎంపికయ్యారు.

ఈ క్రమంలో పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారని ఆరోపించి విజయశాంతిని 2013లో కేసీఆర్‌ పార్టీ నుంచి సస్పెండ్‌ చేశారు. సస్పెన్షన్‌కు గురైన తరువాత విజయశాంతి కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. 2014 ఎన్నికలలో మెదక్‌ అసెంబ్లీ నియోజకవర్గం నుండి పోటీ చేసి ఓడిపోయారు. కొంతకాలం రాజకీయాలకు దూరంగా ఉన్న ఆమె 2020లో బీజేపీలో చేరారు.

ఈ క్రమంలో సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చారు. ప్రిన్స్‌ మహేశ్‌ బాబు ‘సరిలేరు నీకెవ్వరూ’ సినిమాతో టాలీవుడ్‌ లోకి తిరిగి రీ ఎంట్రీ ఇచ్చారు. 13 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత విజయశాంతి నటించిన సినిమా ఇదే కావడం గమనార్హం.

ఆ సినిమా తర్వాత మరే సినిమా ఆమె చేయలేదు. మళ్లీ రాజకీయాల్లో యాక్టివ్‌ అయ్యారు. వచ్చే లోక్‌ సభ ఎన్నికల్లో మెదక్‌ నుంచి కాంగ్రెస్‌ అభ్యర్థిగా విజయశాంతి పోటీ చేస్తారని టాక్‌ నడుస్తోంది. ఈ హామీతోనే ఆమె కాంగ్రెస్‌ పార్టీలో చేరారని అంటున్నారు.