Begin typing your search above and press return to search.

రాములమ్మ ఎమ్మెల్సీ ప్రయత్నాలు!

ఈనేపథ్యంలో విజయశాంతి తనకు ఓ పదవికావాలని డైరెక్ట్ గా హైకమాండ్ ను కలిశారు.

By:  Tupaki Desk   |   7 March 2025 11:08 AM IST
రాములమ్మ ఎమ్మెల్సీ ప్రయత్నాలు!
X

గ్రాడ్యుయేట్, టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల ప్రక్రియ అలా పూర్తయిందో లేదో..ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలు వచ్చిపడ్డాయి. దీంతో అధికార కాంగ్రెస్ పార్టీలో కోలాహాలం మొదలైంది. మొత్తం 5 సీట్లు ఖాళీగా ఉన్నాయి. ఇందులో ఒకటి బీఆర్ఎస్ కు, నాలుగు కాంగ్రెస్ కు దక్కనున్నాయి. అయితే ఇందులో నాలుగో సీట్లలో కాంగ్రెస్ గెలవాలంటే ఎంఐఎం మద్దతు తప్పనిసరి. ఈక్రమంలో కాంగ్రెస్ కు నాలుగు సీట్లు దక్కనుండడంతో వీటి కోసం భారీగా కాంగ్రెస్ నేతలు పోటీపడుతున్నారు.

ఆశావహుల్లోకి రాములమ్మ విజయశాంతి కూడా వచ్చి చేరారు. రాములమ్మ తెలంగాణలోని పార్టీలన్నింటినీ చుట్టేసిన సంగతి తెలిసిందే. మొదట్లో బీజేపీలో ఉన్నా రాములమ్మ ఆ తర్వాత ఓ పార్టీ పెట్టారు. ఆ తర్వాత బీఆర్ఎస్ లో చేరారు. ఆ తర్వాత కేసీఆర్ పై కోపంతో కాంగ్రెస్ లో చేరారు. కేసీఆర్ పై కోపంతో కాంగ్రెస్ లో చేరినా.. ఆ పార్టీలో పెద్దగా యాక్టివ్ గా లేరు. ఎప్పుడోగాని ఓ ట్వీట్ చేసి వదిలేస్తారు. ఎన్నికల ముందు అలా ఒకసారి వచ్చిపోతారు. అంతేగాని ఆమె కాంగ్రెస్ లో ఉన్నట్టు పెద్దగా క్యాడర్ కూడా గుర్తించడం లేదు.

ఈనేపథ్యంలో విజయశాంతి తనకు ఓ పదవికావాలని డైరెక్ట్ గా హైకమాండ్ ను కలిశారు. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గేను కలిసి పార్టీకి తాను ఎనలేని సేవలు అందించానని, తన సేవలు, త్యాగాన్ని గుర్తించి ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ పదవిని తనకు కేటాయించాలని కోరారు. దీనికి హైకమాండ్ ఎలా స్పందిస్తుంది అనేది తర్వాత తెలుస్తుంది.

ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ స్థానాలకు విపరీతమైన పోటీ ఉంది. కాంగ్రెస్ కు వచ్చే నాలుగు సీట్లకు నలభై ఆరు మంది పోటీ పడుతున్నారు. ఇందులో తమకూ ఒక సీటు కావాలని మిత్రపక్షం సీపీఐ కోరుతోంది. అలాగే గ్రేటర్ ఎన్నికల్లో ఎంఐఎం మద్దతు ఇవ్వాలంటే దానికో సీటు ఇవ్వాలి. అంటే నాలుగు సీట్లలో రెండు సీట్లు మిత్రపక్షాలకే పోతే పార్టీ నాయకులకు ఎలా అవకాశం ఇచ్చేది అంటూ అధిష్ఠానం ఇరకాటంలో పడింది. ఒక వేళ మిత్రపక్షాలకు ఇవ్వకపోయినా నాలుగు సీట్లను కాంగ్రెస్సే తీసుకున్నా.. వాటిని కేటాయించడం కూడా తలనొప్పిగానే మారింది.

ఎమ్మెల్సీ సీటు కోరుతున్న వారందరూ గతంలో ఎమ్మెల్యే, ఎంపీ ఎన్నికలప్పుడు త్యాగం చేసిన వారే. అలాగే ఎక్కువ మంది రేవంత్ అనుచరులే ఉన్నారు. కొందరు ఎప్పటినుంచో ఏ అవకాశం లేకుండా ఉన్నారు. వారూ తమకూ కేటాయించాలని అడుగుతున్నారు. ఇదిలా ఉంటే నాలుగు సీట్లను సామాజిక వర్గాల వారీగా ఇవ్వాల్సి ఉంది. ఇందులో ఓసీ,బీసీ,ఎస్సీ, ఎస్టీ కి కేటాయించాల్సి ఉంది. బీసీల్లో వివిధ కులాలు తమకు కేటాయించాలంటున్నాయి. ఎస్సీల్లో మాల, మాదిగ వర్గాలు తమకే కేటాయించాలంటున్నాయి.

ఎమ్మెల్సీ సీట్లకు ఇంత పోటీ ఉన్న నేపథ్యంలో.. ఎప్పుడో ఒకసారి పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనే విజయశాంతికి సీటు ఇస్తుందా అనేది డౌటే అంటున్నారు విశ్లేషకులు. ఎమ్మెల్సీ చాన్స్ ఇవ్వడం అనేది పూర్తిగా హైకమాండ్ చేతిలోనే ఉంటుంది. రాష్ట్ర నేతలు పంపించిన వివరాల ప్రకారం వారు సెలక్ట్ చేస్తారు. మరి ఇంత కాంపిటీషన్ లో రాములమ్మకు బెర్త్ ఖాయమవుతుందా? లేదా అనేది రెండు, మూడు రోజుల్లోనే తేలనుంది.