Begin typing your search above and press return to search.

కిరణ్ కుమార్ రెడ్డి మీద రాములమ్మ ఫైరింగ్ ఒక రేంజిలో !

ఇక కాంగ్రెస్ ఎమ్మెల్సీగా పదవిని అందుకున్న రాములమ్మ అలియాస్ విజయశాంతి ప్రెస్ మీట్ పెట్టి మరీ నల్లారి వారి మీద నిప్పులు చెరిగారు.

By:  Tupaki Desk   |   14 March 2025 4:39 PM IST
కిరణ్ కుమార్ రెడ్డి మీద రాములమ్మ ఫైరింగ్ ఒక రేంజిలో !
X

ఉమ్మడి ఏపీ చివరి సీఎం గా నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి ఉన్నారు. ఆయన మూడేళ్ళ పాటు పాలించారు. ఆయన హయాంలోనే తెలంగాణా ఉద్యమం ఉధృతంగా సాగింది. ఈ క్రమంలో ఆయన ఉమ్మడి ఏపీ సీఎంగా అన్ని ప్రాంతాలకూ ప్రతినిధిగా తన బాధ్యతలను తాను నిర్వహించారు. అదే సమయంలో అధినాయకత్వం సూచనలను అమలు చేశారు. అయితే తెలంగాణావాదులలో మాత్రం ఆయన తెలంగాణా రాష్ట్ర ఏర్పాటుకు బద్ధ వ్యతిరేకిగా మారిపోయారు.

దానికి కిరణ్ సీఎం గా తీసుకున్న కొన్ని చర్యలు కారణం. అంతే కాదు ఆయన లాస్ట్ బాల్ అంటూ వేసిన పొలిటికల్ స్ట్రాటజీ అలాగే ఆయన సమైక్యాంధ్రా పేరుతో పార్టీని పెట్టడం ఇవన్నీ కూడా ఆయన యాంటీ తెలంగాణా లీడర్ అని ఎస్టాబ్లిష్ చేశాయి. ఇక సమైక్యవాదిగా తనను తాను చిత్రీకరించుకున్నా ఆ ఇమేజ్ ఏదీ కిరణ్ కి రాజకీయంగా మైలేజ్ తీసుకుని రాలేదు. అదే సమయంలో ఆయన రాజకీయంగా కూడా గత పదేళ్ళలో అందుకున్న పదవులూ లేవు.

కానీ తెలంగాణావాదులు మాత్రం ఆయనను అలాగే చూస్తున్నారు. ఇక కాంగ్రెస్ ఎమ్మెల్సీగా పదవిని అందుకున్న రాములమ్మ అలియాస్ విజయశాంతి ప్రెస్ మీట్ పెట్టి మరీ నల్లారి వారి మీద నిప్పులు చెరిగారు. బీజేపీ నుంచి ఎందుకు బయటకు వచ్చేశారు అన్న ప్రశ్నకు ఆమె బదులిస్తూ కిరణ్ కుమార్ రెడ్డితో స్టేజ్ పంచుకోలేక అని జవాబు ఇచ్చారు.

అంతే కాదు ఆయన తెలంగాణా వ్యతిరేకి అని ఘాటైన విమర్శలు చేశారు. తెలంగాణాకు ఒక్క పైసాని ఇవ్వను ఏమి పీక్కుంటారో పీక్కోండి అని అన్నారు కిరణ్ అని ఫ్లాష్ బ్యాక్ గురించి చెప్పారు. ఆయనను బీజేపీలోకి తెచ్చారు. కిషన్ రెడ్డి స్నేహితుడు కిరణ్ కుమార్ రెడ్డి అని ఆమె అన్నారు. అందుకే తాను బీజేపీ నుంచి వెళ్ళిపోయానని అన్నారు.

కేవలం ఇదొక్కటే కారణం కాదు అనేక ఇతర కారణాల వల్ల కూడా తాను బీజేపీని వీడాల్సి వచ్చింది అని అన్నారు. ఇక కాంగ్రెస్ ఎమ్మెల్సీ రాములమ్మకు ఎలా ఇస్తారు అని అంటున్నారు. మేము కష్టపడ్డాం, ఆస్తులు అమ్ముకున్నాం, తెలంగాణాకు కాపలా కుక్కలా ఉన్నామని విజయశాంతి చెప్పారు.

అందుకే తమకు పదవి ఇచ్చారని అన్నారు. కేసీఆర్ మీద కూడా ఆమె నిప్పులు చెరిగారు. మిగులు రాష్ట్రంగా ఉన్న తెలంగాణాను ఏడు లక్షల కోట్ల రూపాయల అప్పులు చేసి వెళ్ళారని ఆమె నిందించారు. ఆ అప్పులు వేటి కోసం తెచ్చారు వేటికి ఖర్చు పెట్టారో చెప్పాలని డిమాండ్ చేశారు.

కేసీఅర్ చేసిన తప్పులు వెలికి తీయాలని ఆమె కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కోరారు. అంతే కాదు కాళేశ్వరం నుంచి అన్ని చోట్లా అవినీతి ఉందని తాను కూడా కోర్టులో పిటిషన్లు వేశాను అని ఆమె అన్నారు. సీరియస్ గానే కాంగ్రెస్ కేసీఆర్ వ్యవహారం చూడాలని ఆమె కోరారు.

ఇక తనకు ఎమ్మెల్సీ ఇచ్చిన కాంగ్రెస్ అధినాయకత్వానికి విజయశాంతి ధన్యవాదాలు తెలిపారు. ఇదిలా ఉంటే కిరణ్ కుమార్ రెడ్డి తెలంగాణా వ్యతిరేకి అని అంటున్న రాములమ్మ రేవంత్ రెడ్డి తెలంగాణా ఉద్యమం కోసం ఏమి చేశారని ఆయన నాయకత్వంలోని పార్టీలో పనిచేస్తున్నారని నెటిజన్లు విమర్శిస్తున్నారు. తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి వంటి వారు మంత్రులుగా ఎలా పనిచేస్తున్నారని కూడా ప్రశ్నిస్తున్నారు.