Begin typing your search above and press return to search.

రాములమ్మ ఎక్కడ..? కాంగ్రెస్ అందుకే దూరం పెట్టిందా..?

విజయశాంతి కాంగ్రెస్ పార్టీలో చేరినప్పటికీ ఇప్పటివరకు కూడా ఆమెకు పెద్దగా ప్రయారిటీ దొరకడం లేదు. పార్టీ నేతలు ఎవరు కూడా ఆమెను పట్టించుకున్నట్లుగానూ కనిపించలేదు.

By:  Tupaki Desk   |   7 Dec 2024 2:30 PM
రాములమ్మ ఎక్కడ..? కాంగ్రెస్ అందుకే దూరం పెట్టిందా..?
X

ఎన్నో హిట్ సినిమాల్లో నటించి తెలుగు ప్రేక్షకుల మన్ననలు పొందిన నటి విజయశాంతి. ఎన్నో హిట్ మూవీస్‌లో నటించి లేడీ సూపర్ స్టార్ అయ్యారు. ఓ ప్రతిఘటన.. కర్తవ్యం.. ఒసేయ్ రాములమ్మ.. ఇలా ఎన్నో రకాల చెప్పుకోదగిన సినిమాల్లో నటించి తనకంటూ పేరు సాధించారు. పలు హిట్ సినిమాల్లో నటిస్తూనే ఆమె పొలిటికల్‌గా ఎంట్రీ ఇచ్చారు. అయితే.. పలు పార్టీల్లో పనిచేసిన ఆమె సొంత పార్టీని సైతం స్థాపించారు. కానీ.. పెద్దగా ప్రభావం చూపలేకపోయారు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పటికీ ఆమెను పట్టించుకునే వారు కరువయ్యారు. దీంతో ఆమె పొలిటికల్ కెరియర్ ప్రశ్నార్థకంగా మారిందన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.

సినిమాలు చేస్తున్న క్రమంలోనే విజయశాంతి పొలిటికల్ ఎంట్రీ ఇచ్చారు. ముందుగా ఆమె బీజేపీలో చేరారు. బీజేపీ అగ్రనేత ఎల్‌కే అద్వానీ వద్ద పనిచేశారు. అద్వానీ రథయాత్రల్లోనూ భాగస్వామ్యం అయ్యారు. ఆ తరువాత జరిగిన పరిణామాలతో ఆమె బీజేపీకి దూరం అయ్యారు. సొంత పార్టీని స్థాపించారు. తల్లి తెలగాణ పేరిట కొత్త పార్టీని తీసుకొచ్చారు. ప్రత్యేక రాష్ట్ర సాధనే లక్ష్యంగా కొట్లాడారు. ఇక ఆ తరువాత తన పార్టీని టీఆర్ఎస్‌లో విలీనం చేశారు. కేసీఆర్ పార్టీలో చేరిపోయారు.

మెదక్ లోక్‌సభ నుంచి పోటీచేసి గెలుపొందారు. తెలంగాణ బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టే క్రమంలోనూ టీఆర్ఎస్ తరఫున ఉన్న ఏకైక ఎంపీ కూడా విజయశాంతినే. ఇక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అయ్యాక.. కేసీఆర్ ఆమెను పక్కన పెట్టడం ప్రారంభించారు. దీంతో వెంటనే ఆమె కాంగ్రెస్ పార్టీలో చేరిపోయారు. ఆమె స్టార్‌‌డమ్‌ను గుర్తించిన పార్టీ ఆమెను 2018 ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రచార కమిటీ చైర్మన్‌గా నియమించింది. ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ బోల్తా కొట్టడంతో ఆ వెంటనే మళ్లీ ఆమె బీజేపీ గూటికి చేరారు. మునుగోడు ఉప ఎన్నిక ముందు వరకు కూడా బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యురాలిగా బాధ్యతలు నిర్వర్తించారు. ఇక.. మునుగోడు ఉపఎన్నిక ముగిసిన వెంటనే మళ్లీ కాంగ్రెస్ పార్టీలో చేరిపోయారు.

అయితే.. విజయశాంతి కాంగ్రెస్ పార్టీలో చేరినప్పటికీ ఇప్పటివరకు కూడా ఆమెకు పెద్దగా ప్రయారిటీ దొరకడం లేదు. పార్టీ నేతలు ఎవరు కూడా ఆమెను పట్టించుకున్నట్లుగానూ కనిపించలేదు. 2023 నవంబర్‌లో బీజేపీని వీడి కాంగ్రెస్‌లో చేరగా.. ఆమె అధిష్టానం ప్రచార కమిటీ, ప్లానింగ్ కమిటీ చీఫ్ కో ఆర్డినేటర్, కన్వీనర్‌గా నియమించింది. దీంతో ఆమె రాష్ట్రవ్యాప్తంగానూ ఎన్నికల్లో జోరుగా ప్రచారం చేశారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తయినా.. ఏడాది సంబరాలు జరుగుతున్నా ఇంతవరకు ఆమె ఎక్కడా కనిపించలేదు. అధికారం చేపట్టిన కొత్తలో కేవలం ట్వీట్లకు పరిమితం అయ్యారు. ఇప్పుడు పార్టీ మంచి ఊపులో ఉన్నప్పటికి కూడా ఆమెకు పెద్దగా ప్రాధాన్యం దక్కడం లేదు. అసలు విజయశాంతి కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నారా అన్న అనుమానాలు సైతం ఆ పార్టీలో కనిపిస్తున్నట్లు టాక్ నడుస్తున్నది. అయితే.. ఆమె పదేపదే పార్టీలు మారడం వల్లే ఈ దుస్థితి వచ్చినట్లుగా రాజకీయ నిపుణులు అంటున్నారు. రాజకీయాల్లో తప్పడుగులు వేస్తే పొలిటికల్ ఫ్యూచర్ ఇలానే ఉంటుందని చెప్పడానికి విజయశాంతి ఎగ్జామ్‌పుల్ అయిపోయారు. ఇక ముందు ముందు విజయశాంతి రాజకీయ భవితవ్యం ఎలా ఉండబోతున్నదా అన్న చర్చ సైతం నడుస్తున్నది.