సంధ్య థియేటర్ ఘటన.. బీజేపీపై విజయశాంతి సంచలన కామెంట్స్
పుష్ప 2 బెనిఫిట్ షో సందర్భంగా తొక్కిసలాటలో రేవతి అనే మహిళా చనిపోవడంతో చర్చకు దారితీసింది.
By: Tupaki Desk | 23 Dec 2024 9:33 AM GMTసంధ్య థియేటర్ వద్ద జరిగిన ఉదంతం ఇప్పుడు సినీ ఇండస్ట్రీలోనూ.. అటు పొలిటికల్ గానూ వాడివేడిగా మారింది. పుష్ప 2 బెనిఫిట్ షో సందర్భంగా తొక్కిసలాటలో రేవతి అనే మహిళా చనిపోవడంతో చర్చకు దారితీసింది. ఆమె కొడుకు శ్రీతేజ్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. దీంతో అల్లు అర్జున్‌పై పెద్ద ఎత్తున విమర్శలు మొదలయ్యాయి.
ఈ ఘటన కేవలం హైదరాబాద్ వరకే పరిమితం కాకుండా రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ హాట్ టాపిక్ అయింది. మెల్లమెల్లగా ఈ ఘటన రాజకీయ రంగు పులుముకుంది. ఇప్పటికే ఈ కేసులో అల్లు అర్జున్ అరెస్ట్ అయి జైలు వరకు కూడా వెళ్లొచ్చారు. ఇప్పుడు ఆయన బెయిల్ మీదనే ఉన్నారు. ఇక.. శనివారం నాటి అసెంబ్లీ సమావేశాల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ ఘటన మీద కీలక వ్యాఖ్యలు చేశారు. అదేరోజు సాయంత్రం బన్నీ కూడా ప్రెస్‌మీట్ పెట్టడం మరింత సంచలనంగా మారింది. తన క్యారెక్టర్‌ను కొంత మంది తక్కువ చేసి చూపించే ప్రయత్నం చేస్తున్నారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై పోలీసులు సీరియస్ అయ్యారు.
ఈ ఘటనపై తాజాగా.. ప్రముఖ సీనియర్ హీరోయిన్, కాంగ్రెస్ పార్టీ నాయకురాలు విజయశాంతి స్పందించారు. ట్విట్టర్ వేదికగా ఆమె ఓ పోస్ట్ చేశారు. ఒక సినిమా విడుదల సందర్భంగా జరిగిన దురదృష్ట సంఘటన ప్రశాంతంగా ఉన్న ప్రజల మధ్య తెలంగాణ విభజన రేఖలు తెచ్చే వరకూ వెళ్తున్నట్లు కనిపిస్తోందని పేర్కొన్నారు. రెండు రోజుల పరిణామాలు, ప్రెస్‌మీట్‌లు అన్నీ భావోద్వేగానికి గురిచేస్తున్నాయని తెలిపారు. ‘ప్రాంతాలుగా విడిపోయి ప్రజలుగా కలిసి ఉందాం’ అనే నాటి తెలంగాణ ఉద్యమ స్ఫూర్తి ఇప్పుడు అలా కాకుండా ప్రజల మనోభావాల మధ్య విభజనలు వచ్చే వరకూ నడవాలని రాజకీయ పార్టీల ప్రయోగంగా కనిపిస్తోందని పేర్కొన్నారు.
ఈ ఘటనను బీజేపీ అనవసరంగా రాద్ధాంతం చేస్తున్నదని విజయశాంతి అభిప్రాయపడ్డారు. ఈ ఘటనను తమకు అనుకూలంగా మార్చుకునేందుకు బీజేపీ నేతలు ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. ఆ పార్టీకి చెందిన తెలుగు రాష్ట్రాల నేతల ప్రకటనల్లో ఇదే స్పష్టంగా కనిపిస్తోందని తెలిపారు. సినీ పరిశ్రమను నాశనం చేసేందుకు సీఎం ప్రయత్నిస్తున్నారని ఆరోపణలు చేయడాన్ని ఖండించారు. సినీ పరిశ్రమకు అన్ని ప్రాంతాల ప్రజలు కావాలని, ఇలాంటి ఘటనలు చోటుచేసుకోకుండా ప్రయత్నం చేయాలని పేర్కొన్నారు.
అయితే.. ఇన్ని రోజులుగా విజయశాంతి నుంచి ఎలాంటి స్టేట్మెంట్ రాలేదు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా ఆమె ఎలాంటి ప్రకటనలు ఇవ్వలేదు. ఇన్ని రోజులకు ఆమె పుష్ప 2 ఘటనపై స్పందించడం చర్చకు దారితీసింది.