అమరావతిలో బాహుబలి బ్రిడ్జి రెడీ.. ఎప్పటి నుంచి అందుబాటులోకి వస్తుందంటే..
ఏపీలో ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాజధాని పనుల్లో ఊపు కనిపిస్తోంది.
By: Tupaki Desk | 7 Feb 2025 10:30 AM GMTఏపీలో ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాజధాని పనుల్లో ఊపు కనిపిస్తోంది. ఐకానిక్ టవర్లతోపాటు అంతర్గత రోడ్ల నిర్మాణానికి ప్రాధాన్యమిస్తున్న ప్రభుత్వం.. రాజధాని కనెక్టవిటీకి అత్యంత ముఖ్యమైన విజయవాడ పశ్చిమ బైపాస్ ను రెడీ చేస్తోంది. ఈ బైపాస్ రోడ్డులో అతి ప్రధానమైన బాహుబలి వంతెన కూడా పూర్తయింది. ఈ వంతెన మీదుగా గత సంక్రాంతి నాటికి ట్రాఫిక్ ను మళ్లించినా, ఇంకా అక్కడక్కడ పనులు పెండింగులో ఉండటం వల్ల పూర్తి స్థాయిలో వినిపియోగించడం లేదు. ఏప్రిల్ నాటికి ఈ బైపాస్ అందుబాటులోకి వచ్చే అవకాశాలు మెరుగ్గా ఉన్నాయి.
ఉమ్మడి క్రిష్ణా- గుంటూరు జిల్లాల మధ్య కనెక్టవిటీ పెంచడంతోపాటు రాజధాని అమరావతి నగరానికి దేశంలో ప్రధాన నగరాలతో అనుసంధానించాలనే ఉద్దేశంతో విజయవాడ పశ్చిమ బైపాస్ ను నిర్మిస్తున్నారు. 2021లో ప్రారంభమైన పనులు దాదాపు ముగింపు దశకు చేరుకున్నాయి. హైటెన్షన్ విద్యుత్ టవర్స్ తొలగింపుతోపాటు, అక్కడక్కడ అండర్ పాసులను సిద్ధం చేయాల్సివుంది. అయితే ఈ రోడ్డు నిర్మాణంలో క్రిష్ణా నదిపై నిర్మించిన బాహుబలి వంతెన ప్రధాన ఆకర్షణగా నిలిచింది.
ఈ బ్రిడ్జి నిర్మాణం అమరావతి నగరానికి ఎంతో కీలకం కాబోతోంది. దాదాపు మూడు కిలోమీటర్లు ఉండే ఈ వంతెనపై ప్రయాణం కొత్త అనుభూతిని ఇస్తుంది. విశాలమైన నదిపై విశాలమైన రోడ్డుపై ప్రయాణం ఓ తీపి గుర్తుగా మిగిలిపోతుందని చెబుతున్నారు. అతిపెద్ద వంతెన, చుట్టూ కొండలు, రెండు వైపులా పచ్చని పంట పొలాలు మధ్య అలా ముందుకు వెళ్లి అత్యాధునికంగా నిర్మిస్తున్న అమరావతిలో అడుగు పెట్టే సందర్భం కోసం పర్యాటకులు ఎదురుచూస్తున్నారు.
ఎన్నో ప్రత్యేకతలు ఉన్న ఈ బ్రిడ్జి, ఆ రోడ్డు.. రాజధాని అమరావతి ప్రాజెక్టును అత్యున్నత స్థాయికి తీసుకువెళతాయని అంటున్నారు. మరికొద్ది రోజుల్లో అందుబాటులోకి రానున్న ఈ బాహుబలి వంతెన వల్ల హైదరాబాద్ నుంచి వచ్చే వారు విజయవాడ నగరంలోకి ప్రవేశించకుండానే గుంటూరు, చెన్నై, విశాఖపట్నం వెళ్లవచ్చు. గొల్లపూడి నుంచి కాజ వరకు అమరావతి మీదుగా రోడ్డు నిర్మించడం వల్ల విజయవాడపై ట్రాఫిక్ ఒత్తిడి తగ్గుతుంది.