గుండెబరువెక్కే సీన్లు.. కన్నీళ్లు తెప్పించే సన్నివేశాలు.. విజయవాడ వరద కష్టాలు
తాజాగా అలాంటి కలిచివేసే దృశ్యమే ఒకటి వైరల్ అయింది. ఆ ఫొటోను చూసిన వారంతా ‘దేవుడా.. ఏమిటీ ఈ దుస్థితి’ అంటూ రోదిస్తున్నారు.
By: Tupaki Desk | 5 Sep 2024 5:07 AM GMTభారీ వర్షాలతో బెజవాడ వణికిపోయింది. వచ్చిన వరదలతో నగరం మొత్తం ఆగమైంది. సిటీ పూర్తిగా జలదిగ్బంధంలో చిక్కుకుపోయింది. చరిత్రలో ఎన్నడూ లేనంతగా వర్షం కురియడంతో ప్రజలు బిక్కుబిక్కుమంటూ గడిపారు. ఇళ్లు, రోడ్లు కనిపించలేనంతగా ముంచెత్తడంతో అంతటా భయానక దృశ్యాలు కనిపించాయి. మరికొన్ని కన్నీరు తెప్పించే దృశ్యాలు ఆవిష్కృతం అయ్యాయి.
విజయవాడలో ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాలతో ప్రజలు నానా ఇబ్బందులు పడ్డారు. అకస్మా్త్తుగా వచ్చిన వరదలతో ఇళ్లు, కాలనీలు పూర్తిగా నీటమునిగాయి. ఇప్పటికే వర్షాలతో, వరదలతో అల్లాడిపోయిన నగరంలో ఇప్పుడు మరోసారి వర్షం పడుతోంది. నిన్న అర్ధరాత్రి నుంచి ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురుస్తోంది. దీంతో మరోసారి ప్రజలు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న తమపై వరుణుడు మరోసారి పగబట్టినట్టుగా చేస్తున్నాడని ఆవేదన చెందుతున్నారు.
ఇదిలా ఉండగా.. మొన్నటి వరదల బారి నుంచి నగరం కొంచెం కొంచెం తేరుకుంటోంది. మొన్నటి వరదలకు చాలా మంది ప్రాణాలు కోల్పోయారు. మరికొంత మంది వరదల్లోనే తప్పిపోయారు. ఈ ఘటనలు చాలా వరకు విషాదంలో ముంచాయి. అందులోనూ.. కొన్ని విషాదాలు అయితే హృదయాలను పిండేసేలా కనిపించాయి. మొన్న తన చిన్నారిని కాపాడుకునేందుకు ఓ తండ్రి తన బిడ్డను ప్లాస్టిక్ డబ్బాలో తరలించే దృశ్యాన్ని చూశాం. తాజాగా అలాంటి కలిచివేసే దృశ్యమే ఒకటి వైరల్ అయింది. ఆ ఫొటోను చూసిన వారంతా ‘దేవుడా.. ఏమిటీ ఈ దుస్థితి’ అంటూ రోదిస్తున్నారు.
చిట్టినగర్ పరిధిలోని 14 ఏళ్ల బాలుడు అదృశ్యమై నీటిలో శవమై తేలాడు. అయితే.. మృతదేహాన్ని అదే వరదలో నడుములోతు నీటిలో తీసుకెళ్తున్న దృశ్యం అందరినీ కలిచివేసింది. కొడుకు మృతదేహాన్ని తరలిస్తుండగా ఆ తల్లి రోదించిన తీరు కంటతడి పెట్టించింది.