'బుడమేరు'.. పాలకుల పాపం.. తలా పిడికెడు!
అయితే... ఎప్పటికప్పుడు.. ఈ బుడమేరు పొంగినప్పుడల్లా పాలకులు.. తమ పాపం ఏమీ లేదని.. గత పాలకులదే తప్పని అనేస్తారు. ఇప్పుడు చంద్రబాబు కూడా అదే అనేశారు.
By: Tupaki Desk | 3 Sep 2024 5:02 AM GMTవిజయవాడ మునిగిపోవడానికి.. ప్రజలు గత నాలుగు రోజులుగా కంటిపై కునుకు లేకుండా ఉండడానికి కారణం.. బుడమేరు. ఇది కృష్ణానది పాయ. దీనికి చాలానే చరిత్ర ఉంది. ఇప్పుడు ఇది పొంగి.. పొర్లడంతోనే విజయవాడ సహా చుట్టుపక్కల ఉన్న గ్రామాలు అన్నీ నీటమునిగాయి. అయితే... ఎప్పటికప్పుడు.. ఈ బుడమేరు పొంగినప్పుడల్లా పాలకులు.. తమ పాపం ఏమీ లేదని.. గత పాలకులదే తప్పని అనేస్తారు. ఇప్పుడు చంద్రబాబు కూడా అదే అనేశారు. కానీ, వాస్తవం.. అది కాదు. ఈ బుడమేరు పాపం.. కొన్ని దశాబ్దాల నాటిది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కాలం నుంచి కూడా.. ఈ సమస్య ఉంది. అప్పట్లోనే ఇక్కడి ప్రజాప్రతినిధులు.. అనేక రూపాల్లో ఈ సమస్యను పరిష్కరించాలని వేడుకున్నారు.
దీంతో గతంలో ఎన్టీఆర్ హయాంలోనే బుడమేరును ఆనుకుని ఉన్న ఆవాసాలను తొలగించడంతోపాటు.. బుడమేరుకు అడ్డంకు లు లేకుండా చేసే ప్రయత్నాలు సాగాయి. అయితే.. ఇవి పూర్తిగా ముందుకు సాగలేదు. దీనికి కారణం.. స్థానిక ఓటు బ్యాంకు.. సహా కబ్జాల పర్వమే. వ్యాపారాలు.. ఎక్కువగా జరిగేది కూడా.. ఈ బుడమేరును ఆనుకుని నిర్మించిన సముదాయాల్లోనే కావ డం విశేషం. అంతేకాదు.. బుడమేరుకు చుట్టుపక్కల అంతా కూడా ఆక్రమణలే కనిపిస్తాయి. ఇప్పుడు అప్పుడు అనే తేడా లేకుండా.. ఇక్కడి వారికి రాజకీయంగా బలమైన మద్దతు కూడా ఉంది.
అందుకే బుడమేరు ఆక్రమణలు మూడు పువ్వులు ఆరు కాయలుగా ముందుకు సాగుతున్నాయి. అంతేకాదు.. ప్రతి చోటా బుడమేరును ఆనుకుని నిర్మించిన భారీ సౌధాలతో ఈ ఏరు నానాటికీ కుంచించుకు పోయింది. దీంతో బుడమేరు పరిస్థితి దీనం గా మారింది. బుడమేరు పొంగకుండా వేసిన కట్టలను తొలిచేసి ఆక్రమించుకుని ఆలయాలు కట్టిన పరిస్థితి.. వీటికి రాజకీయ నేతల మద్దతు ఉన్న పరిస్థితి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.
మొత్తంగా చూస్తే.. ఎప్పటికప్పుడు ప్రభుత్వాలు చర్యలు తీసుకుంటున్నామని.. బుడమేరు కట్టను పటిష్టం చేస్తున్నామని చెబుతుండడమే తప్ప.. చేసిన పరిస్థితి కూడా కనిపించడం లేదు. దీనికి కారణం.. ఫక్తు రాజకీయాలే. ఇప్పుడు మునకను చూసైనా.. ప్రభుత్వం మేల్కొంటే మంచిది. కనీసం.. శాశ్వత ప్రాతిపదికన.. చర్యలు చేపట్టి బుడమేరుకు శాశ్వత పరిష్కారం చూపించాల్సి ఉంది.