వీళ్లకు వరద కష్టం.. వాళ్లకు పొలిటికల్ నష్టం.. !
విజయవాడ వరద ప్రభావిత ప్రాంతాలను గమనిస్తే.. ఇక్కడ ప్రజలు పడుతున్న కష్టాలుకనిపిస్తాయి. వీరికి సాంత్వన చేకూర్చాల్సిన అవసరం ఎంతైనా ఉంది. దీనిలో సందేహం లేదు.
By: Tupaki Desk | 16 Sep 2024 8:30 AM GMTవరదలు సాధారణ ప్రజలకు కష్టాలు తెస్తాయి. ఇది కళ్ల ముందు కనిపించే వాస్తవం. అయితే.. ఇదేసమయంలో నాయకులకు, రాజకీయ పార్టీలకు పొలిటికల్‌గా అంతే నష్టం కలిగిస్తాయి. అటు బాధితుల కష్టానికి-ఇటు రాజకీయ నేతల నష్టానికి మధ్య అవినాభావ సంబంధం ఉంది. విజయవాడ వరద ప్రభావిత ప్రాంతాలను గమనిస్తే.. ఇక్కడ ప్రజలు పడుతున్న కష్టాలుకనిపిస్తాయి. వీరికి సాంత్వన చేకూర్చాల్సిన అవసరం ఎంతైనా ఉంది. దీనిలో సందేహం లేదు.
వరదలు దాటేసి.. 14 రోజులు అయిపోయినా.. దాని తాలూకా ఇబ్బందులు ఇంకా పోలేదు. ఈవిషయాన్ని మంత్రి నారాయణే నేరుగా చెప్పుకొచ్చారు. అయితే.. ఈ కష్టాలు తొలిగితే సరే.. లేకపోతే. మాత్రం ప్రజలు కొన్నాళ్లు కష్టపడ తారు. కొంతమేరకు నష్టపోతారు. కానీ, అంతిమంగా మాత్రం రాజకీయ పార్టీలకు తీవ్ర నష్టం వాటిల్లడం ఖాయం. ఎందుకంటే.. విజయవాడలోని రెండు నియోజకవర్గాల్లో వరద పోటెత్తింది. ఈ రెండు నియోజకవర్గాలలో ఒకటి టీడీపీ గెలిస్తే.. మరొకటి బీజేపీ దక్కించుకుంది.
ఈ ఇద్దరు ఎమ్మెల్యేల్లో ఒక్కరు మాత్రం యాక్టివ్‌గా ఉన్నారు. ఆయనే సెంట్రల్ ఎమ్మెల్యే బొండా ఉమా. ఈ నియోజక వర్గంలో జరిగిన నష్టం లక్ష మందికి పైగానే ఉంటే.. పశ్చిమ నియోజకవర్గంలో జరిగిన నష్టం మరింత ఎక్కువగా ఉంది. ఇక్కడ కొండ ప్రాంతాల్లో ప్రజలు నానా తిప్పలు పడ్డారు. అయితే.. ఈ నియోజకవర్గం ఎమ్మెల్యే సుజనా చౌదరి 15 రోజులు అయినా.. ఎవరికీ కనిపించడం లేదు. ఆయన ఊసు ధ్యాస కూడా ఎక్కడా కనిపించలేదు. సుజనా ఫౌండేషన్ అని స్తాపించారు. దీని కింద కొన్ని పనులు కూడా చేపట్టారు.
కానీ, కీలక సమయంలో పశ్చిమ నియోజకవర్గం ప్రజలకు ఇబ్బందులు తప్పలేదు. దీనికితోడు గెలిచింది బీజేపీ నాయకుడు కావడంతో టీడీపీ నాయకులు కూడా పెద్దగా రియాక్ట్ కాలేదు. దీనికితోడు సుజనా వర్సెస్ టీడీపీ నేతల మధ్య జరుగుతున్న కోల్డ్ వార్‌లో అంతిమంగా జనాలే నలిగిపోయారు. ఇక, ఇప్పుడిప్పుడే తేరుకుంటున్నారు. సర్కారు సాయం కోసం ఎదురు చూస్తున్నారు. మొత్తంగా చూస్తే.. ఇప్పుడు కనుక సర్కారునుంచి కానీ.. నాయకుల నుంచి కానీ.. బాధితులకు సరైన పరిహారం.. మెరుగైన ఆదరణ లభించకపోతే.. అంతిమంగా నాయకులు నష్టపోవడం ఖాయం.
ఎందుకంటే.. ఈ రెండు నియోజకవర్గాల ప్రజలు మాస్. ఇప్పుడు జరిగింది .. రేపు మరిచిపోయే రకాలు కాదు. ఎల్లకాలం గుర్తు పెట్టుకుంటారు. గత చరిత్ర చూస్తే.. విజయవాడ రంగాకు బ్రహ్మరథం పట్టింది ఈ రెండు నియోజకవర్గాల ప్రజలే. ఆయన ఒక్కచోటే గెలిచి ఉండొచ్చు. కానీ, జనాదరణలో రంగా, దేవినేని నెహ్రూకు ఈ రెండు నియోజకవర్గాల్లో మాత్రం భారీ మద్దతు దారులు ఉండడం గమనార్హం.