Begin typing your search above and press return to search.

విజయవాడ హీట్ : వైసీపీ మేయర్ సీటుకు ఎసరు ?

ఇక వైసీపీ మేయర్ గా గత మూడున్నరేళ్ళుగా పదవిలో ఉన్న భాగ్యలక్ష్మిని ఈ గండం వెంటాడుతోంది అని అంటున్నారు. ఆమెని బీసీ సామాజిక వర్గానికి చెందిన మహిళగా తెచ్చి ఎంపిక చేశారు.

By:  Tupaki Desk   |   8 Jan 2025 3:30 AM GMT
విజయవాడ హీట్ : వైసీపీ మేయర్ సీటుకు ఎసరు ?
X

వైసీపీకి వరస రాజకీయ దెబ్బలు అలవాటు అయిపోతున్నాయి. రాజకీయాల్లో ప్రస్తుతం అన్నీ అధికారం చుట్టూనే తిరుగుతున్నాయి. ఒకనాడు ఏపీలోని అన్ని స్థానిక సంస్థలు తమ వైపే అని చెప్పి జబ్బలు చరచుకున్న వైసీపీకి ఇపుడు చాలా చోట్ల పీఠాలు కదలిపోతున్నాయి. వైసీపీ అధికారంలో ఉన్నపుడు చేసిన ఒక తీర్మానం వల్లనే ఇంకా ఆ పార్టీ పీఠాలు ఉన్నాయని అంటున్నారు.

స్థానిక సంస్థల ఎన్నికల్లో చైర్మన్లు, మేయర్లు ఎవరి మీద అవిశ్వాసం పెట్టాలి అన్నా నాలుగేళ్ల సమయం కచ్చితంగా ముగియాలి అని చట్ట సవరణ వైసీపీ ప్రభుత్వం చేసింది. దాని వల్లనే ఇంకా కూటమి నేతలు ఆగుతున్నారు. అయితే పంచాయతీ రాజ్ చట్టంలో ఈ మేరకు సవరణలు చేశారు. దాంతో మండల పరిషత్తులు జిల్లా పరిషత్తులలో వైసీపీ పీఠాలు కదలబోతున్నాయి.

కానీ మునిసిపల్ చట్టానికి సవరణ చేయాల్సి ఉంది. దాంతో మున్సిపాలిటీలు కార్పోరేషన్లలో ఆ హడవుడి ఇపుడే మొదలైంది. ఈ నేపథ్యంలో ఏపీలో ఉన్న పలు కార్పోరేషన్ల మీద టీడీపీ కూటమి కన్ను పడింది అని అంటున్నారు. రాజకీయ రాజధానిగా పేరున్న విజయవాడ మేయరు పీఠానికి ఇపుడు ఎసరు పెట్టే కార్యక్రమానికి రంగం సిద్ధం అవుతోంది.

విజయవాడ కార్పోరేషన్ లో మొత్తం 64 మంది కార్పోరేటర్లు ఉన్నారు. ఇందులో 2021లో జరిగిన ఎన్నికల్లో వైసీపీ ఏకంగా 49 మంది కార్పోరేటర్లను గెలుచుకుంది. టీడీపీకి దక్కినది 13 మంది మాత్రమే. అయితే ఎన్నికలకు ముందు ఒక కార్పోరేటర్ వైసీపీలో చేరడంతో ఆ సంఖ్య పన్నెండుకు పడిపోయింది.

ఇక ఎన్నికల్లో టీడీపీ కూటమి బంపర్ మెజారిటీతో గెలవడంతో మొత్తం సీను మారిపోయింది. ఇపుడు వరసబెట్టి టీడీపీ కూటమిలోకి చేరడానికి వైసీపీ కార్పొరేటర్లు క్యూ కడుతున్నారు. ఆ విధంగా చూస్తే ఇప్పటికే 11 మంది వైసీపీ కార్పోరేటర్లు కూటమిలో చేరిపోయారు. వారిలో టీడీపీలోకి అయిదురుగు, జనసేనలోకి నలుగురు, బీజేపీలోకి ఇద్దరు చేరారు. దాంతో కార్పోరేషన్ లో వైసీపీ సంఖ్య కాస్త 38కి పడిపోయింది.

ఇపుడు ఈ మిగిలిన వారిలో పది మంది కూటమి వైపుగా చూస్తున్నట్లుగా పెద్ద ఎత్తున ప్రచారం సాగుతోంది. కార్పోరేషన్ లో మెజారిటీ దక్కాలీ అంటే మ్యాజిక్ ఫిగర్ 33గా ఉంది. అయితే ఇపుడు టీడీపీ కూటమి వద్ద 24 మంది కార్పోరేటర్ల బలం ఉంది. మరో 10 మంది వైసీపీ నుంచి చేరిపోతే కూటమి చేతిలోకి బెజవాడ కార్పోరేషన్ వస్తుంది.

ఇక వైసీపీ మేయర్ గా గత మూడున్నరేళ్ళుగా పదవిలో ఉన్న భాగ్యలక్ష్మిని ఈ గండం వెంటాడుతోంది అని అంటున్నారు. ఆమెని బీసీ సామాజిక వర్గానికి చెందిన మహిళగా తెచ్చి ఎంపిక చేశారు. ఒక సామాజిక ప్రయోగం చేశారు. అంతా బాగానే ఉన్నా ఇపుడు వైసీపీ మేయర్ పీఠానికే ఎసరు వస్తోంది. 2026లో ఎన్నికలు జరగనున్నాయి.

ఎటూ ఏపీలో కూటమి అధికారంలో ఉంది కాబట్టి కూటమి పార్టీలే స్థానిక ఎన్నికల్లో గెలుస్తాయని అంచనా వేసుకుంటున్న వైసీపీ కార్పోరేటర్లు ముందస్తుగానే మాట్లాడుకుని తమకు నచ్చిన పార్టీలలోకి చేరిపోతున్నారు. వచ్చే ఎన్నికల్లో తమకే టికెట్లు ఇవ్వాలని వారు ఒప్పందాలు పెట్టుకుంటున్నారు అని అంటున్నారు మొత్తం మీద జరుగుతున్న ఈ పరిణామాలను చోద్యం చూడడం మినహా వైసీపీ పెద్దలు ఏమీ చేయలేని పరిస్థితి ఉందని అంటున్నారు.