ఆ బస్సు ప్రమాదానికి డ్రైవర్ తప్పిదమే కారణం
ఈ క్రమంలోనే ఈ ఘటనపై విచారణ జరిపేందుకు రవాణా శాఖ ఉన్నతాధికారులు ఓ దర్యాప్తు కమిటీని వేశారు
By: Tupaki Desk | 7 Nov 2023 12:50 PM GMTవిజయవాడలోని పండిట్ నెహ్రూ బస్ స్టేషన్ లో ప్రయాణికులపైకి బస్సు దూసుకువెళ్లిన ఘటన ఇరు తెలుగు రాష్ట్రాలతోపాటు దేశవ్యాప్తంగా సంచలనం రేపిన సంగతి తెలిసిందే. ప్లాట్ ఫాంపై బస్సు కోసం వేచి ఉన్న ప్రయాణికులపైకి హఠాత్తుగా బస్సు దూసుకు వచ్చిన దుర్ఘటనలో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. 7 నెలల పసివాడితపాటు 21 సంవత్సరాల యువకుడు, 45 ఏళ్ల మహిళ దుర్మరణం పాలయ్యారు. అయితే, ఈ ఘటనపై ప్రజాగ్రహం పెల్లుబుకింది. బస్సుల మరమ్మతు సరిగా నిర్వహించడం లేదని, డ్రైవర్ నిర్లక్ష్యం వల్లే ఈ ఘోరం జరిగిందని విమర్శలు వచ్చాయి.
ఈ క్రమంలోనే ఈ ఘటనపై విచారణ జరిపేందుకు రవాణా శాఖ ఉన్నతాధికారులు ఓ దర్యాప్తు కమిటీని వేశారు. ఈ క్రమంలోనే ఆ దుర్ఘటనపై దర్యాప్తు జరిపిన ఆ కమిటీ సంచలన విషయాలు వెల్లడించింది. ప్రమాదానికి కారణమైన బస్సు ఆటోమేటిక్ గేర్ సిస్టమ్ తో నడుస్తుందని, ఆ బస్సును నడపడంలో ప్రమాదానికి కారణమైన డ్రైవర్ కు సరైన శిక్షణ ఇవ్వలేదని నివేదికలో కమిటీ పేర్కొంది. ఆ బస్సు నడపడంలో పూర్తి నైపుణ్యం రాకముందే సదరు డ్రైవర్ కు బస్సును అప్పగించారని కమిటీ వెల్లడించింది.
ఈ ప్రకారం ఆ నివేదికను రవాణా శాఖ, ఆర్టీసీ ఉన్నతాధికారులకు కమిటీ సమర్పించింది. ఆ నివేదికపై ఉన్నతాధికారులతో ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమల రావు సమీక్ష జరుపుతున్నారు. రిటైర్మెంట్ కు దగ్గరలో ఉన్న డ్రైవర్ కు అధునాతన టెక్నాలజీ, ఆటోమేటిక్ గేర్ సిస్టం ఉన్న బస్సును అప్పగించారని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అధికారుల నిర్లక్ష్యానికి మూడు నిండుప్రాణాలు గాల్లో కలిసిపోయాయని విమర్శలు గుప్పిస్తున్నారు.