ఆ సీటును ఆయన కోసం రిజర్వ్ చేశారా.. వైసీపీ హాట్ టాపిక్..!
అయితే.. ఎన్నికల సమయానికి వైసీపీ వ్యూహం వేరే ఉందని.. విజయవాడ సెంట్రల్‌ను కేవలం రిజర్వ్ చేసి పెట్టారని వైసీపీ నేతల మధ్య చర్చ సాగుతోంది.
By: Tupaki Desk | 16 Jan 2024 9:30 AM GMTఏపీ అధికార పార్టీ వైసీపీ.. దూకుడుగా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. అభ్యర్థుల ఖరారు.. ఇంచార్జ్ నియామకాలు వంటివాటిని పూర్తి చేసుకుని.. ఎన్నికలకు సమాయత్తం అవుతోంది. ఇప్పటికే రెండు మూడు జాబితాలు ఇచ్చిన వైసీపీ.. అనేక మార్పులు చేర్పులు చేసింది. అయితే.. వీటిలో కొన్ని కొన్ని చోట్ల.. ఇంచార్జ్‌లను నియమించినా.. అంతర్గతంగా వేరే వ్యూహాలు ఉన్నాయని ప్రచారం జరుగుతోంది. అంటే... ఇంచార్జ్‌లను నియమించిన స్థానాల్లో ఎన్నికల సమయానికి మార్పులు చేయనున్నారు.
ఇలాంటి వ్యూహాత్మక నియోజకవర్గాల్లో విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం పేరు వైసీపీ నేతల మధ్య చర్చగా మారింది. ఇక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యే మల్లాది విష్ణును పక్కన పెట్టి.. పశ్చిమ నియోజకవర్గం ఎమ్మెల్యే మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్‌ను ఇక్కడ ఇంచార్జ్‌గా నియమించారు. అయితే.. ఈ ఇద్దరు నేతల మధ్య పొసగడం లేదు. శ్రీనివాస్‌కు సహకరించే విషయంలో మల్లాది రగడ పెడుతున్నారు. వీరి మధ్య పంచాయతీ సాగుతూనే ఉంది.
అయితే.. ఎన్నికల సమయానికి వైసీపీ వ్యూహం వేరే ఉందని.. విజయవాడ సెంట్రల్‌ను కేవలం రిజర్వ్ చేసి పెట్టారని వైసీపీ నేతల మధ్య చర్చ సాగుతోంది. గత ఎన్నికలకు ముందు.. ఇదే టికెట్‌ను ఆశించి.. పార్టీ ఇవ్వకపోవడంతో రాజకీయాలకు దూరమైన.. కాపు నాయకుడు, రంగా కుమారుడు రాధా కోసం ఈ సీటును రిజర్వ్ చేసి ఉంచారని అంటున్నారు వైసీపీ నాయకులు. రాధాపార్టీలోకి వస్తారని.. ఆయన రాగానే.. ఈ సీటును ఇస్తారని.. పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది.
వంగవీటి రాధా.. ప్రస్తుతం టీడీపీలో ఉన్నారు. ఆయనకు గత ఎన్నికల్లో టికెట్ దక్కలేదు. ఈ దఫా ఎక్కడ ఇస్తారో కూడా క్లారిటీ లేదు. అయితే.. కాపు ఓట్లను దక్కించుకునేందుకు.. మాత్రం ప్రయత్నాలు సాగుతున్నాయి. కానీ, రాధా కోరుకున్న సెంట్రల్ నియోజకవర్గం టీడీపీలోనూ ఖాళీ లేదు. ఇదే వైసీపీకి కలిసి వచ్చే అంశంగా చెబుతున్నారు. రాధాకు.. సెంట్రల్ నియోజకవర్గం ఆశ పెట్టి.. ఆయనను పార్టీలోకి చేర్చుకోవాలనేది వైసీపీ వ్యూహం.
తద్వారా రాధా-రంగా మిత్రమండలి అభిమానులను తమవైపు తిప్పుకోవాలనేది వైసీపీ మాస్టర్ ప్లాన్‌గా కనిపిస్తోంది. ఈ నేపథ్యంలోనే సెంట్రల్ నియోజకవర్గాన్ని వ్యూహాత్మకంగా వైసీపీ రిజర్వ్‌లో పెట్టిందని ఆ పార్టీ నాయకులు చెబుతున్నారు. మరి ఏం జరుగుతుందో చూడాలి.