ఎన్నికలకు “దళపతి” సిద్ధం... పార్టీ పేరు "తమిళగ మున్నేట్ర కళగం"?
ఆ సంగతి అలా ఉంటే... గత కొంతకాలంగా ఆయన పొలిటికల్ ఎంట్రీ గురించి రకరకాల కథనాలు వస్తున్న సంగతి తెలిసిందే.
By: Tupaki Desk | 1 Feb 2024 3:57 AM GMTకోలీవుడ్ స్టార్ హీరో "దళపతి" విజయ్ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. తమిళనాట సూపర్ స్టార్ రజనీకాంత్ తర్వాత ఆ స్థాయి స్టార్ డమ్ సంపాదించుకున్న నటుడిగా ఆయన పేరు సంపాదించుకున్నారు. మరీ ముఖ్యంగా మాస్ ఆడియెన్స్ లో విజయ్ తన బలాన్ని పెంచుకుంటూ వస్తున్నారు. అది ఏ స్థాయిలో అంటే... ఆయన సినిమాలు టాక్ తో సంబంధం లేకుండా బాక్సాఫీస్ దగ్గర వసూళ్ల సునామీని క్రియేట్ చేస్తున్నాయి.
ఆ సంగతి అలా ఉంటే... గత కొంతకాలంగా ఆయన పొలిటికల్ ఎంట్రీ గురించి రకరకాల కథనాలు వస్తున్న సంగతి తెలిసిందే. ఎప్పటికప్పుడు పార్టీ పేరు త్వరలో ప్రకటించబోతున్నారని కూడా ప్రచారం జరుగుతూ ఉండేది. ఇక ఆయన రాజకీయ రంగప్రవేశాన్ని కోరుకుంటూ లక్షల మంది అభిమానులు ఆన్ లైన్ వేదికగా వెల్ కం చెబుతూ.. వారి వారి ఆకాంక్షలను బయటపెడుతుంటారు. కట్ చేస్తే... వారి కోరిక నెరవేరబోతుందని తెలుస్తుంది!
అవును... కొంతకాలంగా సేవా కార్యక్రమాలు చురుగ్గా చేపడుతున్న విజయ... ప్రతిభ కనబరిచిన పదో తరగతి, ప్లస్ వన్, ప్లస్ టూ విద్యార్థులకు ప్రోత్సాహకాలను కూడా అందిస్తున్నారు. ఈ సందర్భంగా చదువు విలువ గురించి, ఓటును అమ్ముకునే విషయం గురించి విద్యార్థులకు, వారి తల్లితండ్రులకూ ఆయా సమావేశాల్లో నొక్కి చెబుతుంటారు. ఒకపక్క సినిమాల్లో తీరికలేకుండా ఉన్న విజయ్.. మరోపక్క సోషల్ సర్వీస్ లోనూ తన వంతు సేవ చేస్తున్న దళపతి.. త్వరలో పూర్తిస్థాయిలో రాజకీయాలపై కూడా దృష్టిపెట్టినట్లు తెలుస్తోంది.
వాస్తవానికి ఒకానొకసమయంలో సూపర్ స్టార్ రజనీకాంత్ రాజకీయాల్లోకి రాబోతున్నారని కథనాలొచ్చాయి. బీజేపీతో కలిసి వస్తున్నారని ఒకసారి.. సింగిల్ గా వస్తున్నారని మరోసారి రకరకాలా ఊహాగాణాలు చక్కర్లు కొట్టాయి. అయితే... ఇటీవల ఆయన రాజకీయాల్లోకి రానని స్పష్టం చేయడంతో.. దళపతి విజయ్ తన రాజకీయ రంగ ప్రవేశాన్ని వేగవంతం చేస్తున్నారని.. ఆమేరకు అభిమానులు, శ్రేయోభిలాషులు, కొంతమంది సీనియర్ పొలిటీషియన్స్ తో సమాలోచనలు చేస్తున్నారని తెలుస్తుంది.
ఇందులో భాగంగానే.. "విజయ్ మక్కల్ ఇయక్కం" (అభిమానుల సంఘం) నిర్వాహకులతో ఇప్పటికే నాలుగుసార్లు సమావేశమయిన దళపతి... తాజాగా చెన్నై శివారు పనైయూర్ లో 150 మందితో సమావేశం ఏర్పాటు చేసి.. అందులో పార్టీ పేరుతో పాటు జెండా, అజెండాలపై చర్చించినట్లు తెలుస్తుంది. ఈ సమయంలో పార్టీపేరుపైనే ఆయన ఎక్కువగా చర్చించినట్లు సమాచారం. ఈ క్రమంలో మూడు పదాలతో ఒక పేరు వినిపించినట్లు తెలుస్తుంది.
ఇందులో భాగంగా... తమిళగం (తమిళనాడు), మున్నేట్రం (డెవలప్మెంట్), కళగం (పార్టీ) వంటి పదాలను విజయ్ సూచించారని.. అనంతరం ఈ మూడు పదాలు కలిసేలా "తమిళగ మున్నేట్ర కళగం" పేరును ప్రస్థావించారని.. ఇదే పేరు ఎన్నికల సంఘంలో కూడా నమోదు చేయించారని వార్తలు తమిళనాట గుప్పుమంటున్నాయి. 2026లో జరిగే శాసనసభ ఎన్నికలే దళపతి లక్ష్యం అని అంటున్నారు. పార్టీ పేరుపై ఫ్యాన్స్ నుంచి ఇంకా కన్ఫర్మేషన్ రాలేదు!