అంబానీ అదానీ కంటే ధనికుడు కుటుంబ కలహాలతో చివరికిలా!
ఒకప్పుడు అతడు ముఖేష్ అంబానీ, గౌతమ్ అదానీ కంటే ధనవంతుడు.
By: Tupaki Desk | 14 May 2024 3:57 AM GMTఒకప్పుడు అతడు ముఖేష్ అంబానీ, గౌతమ్ అదానీ కంటే ధనవంతుడు. కానీ ఇప్పుడు అద్దె ఇంట్లో నివసిస్తున్నాడు.. జీవనం కోసం చాలా కష్టపడుతున్నాడు.. కేవలం కుటుంబ కలహాలతో ఈ ధనికుడు ఈ స్థితికి పడిపోయాడనేది హిందీ మీడియా విశ్లేషణ. ఇదంతా ఎవరి గురించి? అంటే... రేమండ్ గ్రూప్ ఫౌండర్ విజయ్ పత్ సింఘానియా గురించిన కథనమిది....
రేమండ్ గ్రూప్ ఛైర్మన్- మేనేజింగ్ డైరెక్టర్‌గా గౌతమ్ సింఘానియా ప్రజలకు సుపరిచితం. రేమండ్ గ్రూప్ మార్కెట్ క్యాపిటలైజేషన్ సుమారు రూ. 14280 కోట్లు. అయితే అతడి తండ్రి విజయపత్ సింఘానియా గురించి కొద్ది మందికి మాత్రమే తెలుసు. ఆయన ఉత్థానపతనాలు కొందరికే తెలుసు.
విజయ్‌పత్ ఒకప్పుడు మొత్తం రేమండ్ సామ్రాజ్యానికి అధిపతి. ఇప్పుడు అద్దె ఫ్లాట్‌లో నివసిస్తున్నారు. విజయపత్ ఒకప్పుడు అనిల్ అంబానీ, ముఖేష్ అంబానీ, గౌతమ్ అదానీ సహా చాలామంది పాపులర్ బిలియనీర్ల కంటే ధనవంతుడు. వారసుడైన గౌతమ్ కి తన కంపెనీ షేర్లన్నింటినీ ఇచ్చిన తర్వాత అతనితో సంబంధం దెబ్బతింది. ఇది విజయ్ పథ్ సింఘానియా పతనానికి నాంది పలికింది. ఒకానొక సమయంలో ఒక స్థలంపై వివాదం ఎంతో తీవ్రమైంది... కొడుకు గౌతమ్ తన తండ్రి గారైన విజయపత్‌ను ఇంటి నుండి గెంటేశాడు.
చిన్నప్పటి నుంచి విజయపత్ సింఘానియా కుటుంబ కలహాలతో సతమతమయ్యేవాడు. తన మేనమామ మరణం తరువాత, అతని దాయాదులు రేమండ్‌పై నియంత్రణ సాధించడానికి ప్రయత్నించారని అతడు పేర్కొన్నాడు. అతడు తన ఇద్దరు కొడుకుల మధ్య రేమండ్ గ్రూప్‌ను విభజించడం గురించి ఆలోచించడం ప్రారంభించే వరకు అంతా బాగానే ఉంది. అయినప్పటికీ అతడి కుమారులలో ఒకరైన మధుపతి సింఘానియా సింగపూర్‌కు వెళ్లడం ద్వారా తన కుటుంబ సంబంధాలను తెంచుకున్నాడు. విజయపత్ సింఘానియా బిజినెస్ టుడేతో ఒకప్పటి ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ప్రస్తుతం తన జీవన ప్రమాణాలను కాపాడుకోవడానికి .. మంచి జీవితాన్ని గడపడానికి కష్టపడుతున్నానని తెలిపారు.
గౌతమ్ సింఘానియాకు కార్లపై ఉన్న మక్కువ అతనిని తరచుగా వార్తల్లోకి తెచ్చింది. అతడు ఇటీవల ఒక కొత్త కార్ ని కొనుగోలు చేసారు. అది అతడిని సోషల్ మీడియాలో సంచలనంగా మార్చింది. కార్‌టాక్‌లో ప్రచురించిన ఒక కథనం ప్రకారం బిలియనీర్ గౌతమ్ అదానీ కి ఖరీదైన కార్ల సేకరణ అలవాటు ఉంది. ఇప్పుడు అతడు తన మూడవ సరికొత్త మెక్‌లారెన్ 750Sని కొనుగోలు చేశాడు.