ఆయనొచ్చేశారు : ఉత్తరాంధ్రాలో ఫ్యాన్ స్పీడందుకుంటుందా ?
ఆయనను ఉత్తరాంధ్రా వైసీపీ రీజనల్ కో ఆర్డినేటర్ గా మరోసారి నియమించారు.
By: Tupaki Desk | 20 Oct 2024 8:30 AM GMTవైసీపీలో కీలకమైన నేత రాజ్యసభ సభ్యుడు కూడా అయిన వి విజయసాయిరెడ్డి. ఆయన వైసీపీకి ఒక విధంగా బ్యాక్ బోన్ గా చెప్పాలి. ఆయనను ఉత్తరాంధ్రా వైసీపీ రీజనల్ కో ఆర్డినేటర్ గా మరోసారి నియమించారు. ఆయనను అలా నియమించడం వెనక జగన్ స్ట్రాటజీ ఉంది అని అంటున్నారు.
విజయసాయిరెడ్డికి ఈ బాధ్యతలు ఇది ఫస్ట్ టైం కాదు, ఆయన 2016 నుంది 2022 దాకా అంటే మొత్తం ఆరేళ్ల పాటు ఉత్తరాంధ్రా జిల్లాల బాధ్యతలు చూశారు. ఆ టైం లో వైసీపీకి అన్నీ విజయాలే సమకూరాయి. 2014లో ఉత్తరాంధ్రాలో ఫ్యాన్ తిరగలేదు. మొత్తం 34 అసెంబ్లీ సీట్లకు గానూ తొమ్మిది మాత్రమే వైసీపీకి వచ్చాయి. అలాగే అయిదు ఎంపీ సీట్లు ఉంటే ఒక్కటి దక్కింది.
ఈ నేపథ్యంలో విజయసాయిరెడ్డి ఇంచార్జి అయ్యాక జరిగిన 2019 ఎన్నికల్లో మొత్తం 34 అసెంబ్లీ సీట్లకు గానూ 28 సీట్లు వైసీపీకి దక్కితే అయిదు ఎంపీ సీట్లలో నాలుగు దక్కాయి. అంతే కాదు విశాఖ మేయర్ సీటుని కూడా ఆయన వైసీపీకి దక్కేలా చూసారు.
ఒక విధంగా పార్టీని బలోపేతం చేశారు అని చెప్పాల్సి ఉంది. అయితే ఆయన మీద ఆరోపణలు రావడంతో వైసీపీ అధినాయకత్వం 2022లో తప్పించి వైవీ సుబ్బారెడ్డికి బాధ్యతలు అప్పగించింది. వైవీ సుబ్బారెడ్డి వచ్చాక పార్టీ నానాటికీ తీసికట్టు అన్నట్లుగా తయారైంది. అది కాస్తా చివరికి 2024 నాటికి మొత్తం ఉత్తరాంధ్రలో 34 అసెంబ్లీ సీట్లకు గానూ వైసీపీకి కేవలం రెండు అంటే రెండు సీట్లు దక్కేలా చేసింది. ఒక్క ఎంపీ సీటు వచ్చింది. 2014 కంటే తీసికట్టుగా ఫలితాలు రావడంతో జగన్ పునరాలోచన చేసి మళ్లీ విజయసాయిరెడ్డికే పగ్గాలు ఇచ్చారు.
విజయసాయిరెడ్డి పార్టీని పటిష్టం చేస్తారని మొత్తం మూడు ఉమ్మడి జిల్లాలలో తిరిగి పార్టీని రీ యాక్టివ్ చేస్తారని జగన్ నమ్ముతున్నారని అంటున్నారు. అంతే కాదు ఆయనది లక్కీ హ్యాండ్ అని కూడా భావిస్తున్నారుట. ఇక విశాఖ నుంచే రాజకీయాలు మొదలెడుతున్న విజయసాయిరెడ్డి రానున్న రోజులలో మూడు జిల్లాలో కలియ తిరిగి పార్టీలో మళ్లీ చురుకుదనం కొత్తదనం తెస్తారని అధినాయకత్వం గట్టిగా నమ్ముతోంది.
అయితే విజయసాయిరెడ్డి నియామకం పట్ల సొంత పార్టీలో కొంత భిన్న అభిప్రాయాలు ఉన్నాయి. వాటిని ఆయన ఈసారి ఎలా చక్కదిద్దుకుంటారో చూడాల్సి ఉంది. ఏది ఏమైనా వైసీపీ రీజనల్ కో ఆర్డినేటర్ల ఎంపిక విషయంలో ఒకే సామాజిక వర్గానికి కట్టబెట్టిందని విమర్శలు ఉన్నా అంగబలం అర్ధ బలం ఉన్న వారినే ఎంపిక చేసింది అని అంటున్నారు. పైగా ఎంపిక చేసిన వారిలో ఒక్క కారుమూరి నాగేశ్వరరావు తప్ప మిగిలిన వారు అంతా చట్ట సభలలో ప్రతినిధులుగా ఉన్న వారే అని గుర్తు చేస్తున్నారు. అలా వారు తమ అధికారాలను అవకాశాలను వాడుకుని మరీ పార్టీని బలోపేతం చేసేందుకే ఈ ఎంపికలు అంటున్నారు.
ఇక విపక్షంలో ఉన్న పార్టీకి ఎన్నో సవాళ్ళు ఉంటాయి. దాంతో కూడా గట్టి వారినే దింపాలని పార్టీ భావించింది అని అంటున్నారు. అంతే కాదు ప్రతిపక్షంలో ఉన్నపుడు ఎవరూ ముందుకు రాని నేపథ్యం కూడా ఉంటుందని అంటున్నారు. అవసరం అయితే అన్ని విధాలుగా కూటమి నేతలను ఢీ కొనే విధంగా వ్యూహాలు రూపొందించడంతో పాటు ఢీ అంటే ఢీ అన్నట్లుగా ఉండాలని వైసీపీ ఈ డెసిషన్ తీసుకుందని అంటున్నారు. మొత్తానికి ఉత్తరాంధ్రాలో రిపేర్లు చాలానే ఉన్నాయి. విజయసాయిరెడ్డి వాటిని ఎలా చేస్తారు అన్నదే చూడాల్సి ఉంది అని అంటున్నారు.