పవన్ సీఎం అంటూ విజయసాయి... కాపుల్లో ఆశలు పెరుగుతున్నాయా ?
ఆయన కనుక గట్టిగా పూనుకోకపోతే వైసీపీ ఏదో విధంగా ఒడ్డున పడేది.
By: Tupaki Desk | 6 Dec 2024 12:17 PM GMTఏపీలో ఒక బలమైన సామాజిక వర్గం వైసీపీకి దూరం కావడం వల్లనే 2024 ఎన్నికలలో దారుణ పరాజయం పాలు అయింది. ముఖ్యంగా ఈ ఎన్నికల్లో వైసీపీ ఘోర ఓటమికి పవన్ కళ్యాణ్ అత్యంత కీలక భూమిక పోషించారు అన్నది వాస్తవం. ఆయన కనుక గట్టిగా పూనుకోకపోతే వైసీపీ ఏదో విధంగా ఒడ్డున పడేది. లేదా గౌరవప్రదమైన ఓటమితో బలమైన విపక్షంగానూ ఉండేది.
మరి ఓడిన ఆరు నెలల తరువాత దీని మీద పూర్తి స్థాయిలో విశ్లేషించుకున్నారో ఏమో తెలియదు కానీ పవన్ ని వైసీపీ నేతలు తెగ పొగుడుతున్నారు. ఒకనాడు పవన్ కి రాజకీయాలు ఏవీ తెలియవని అన్న వారే ఇపుడు ఆయన బెస్ట్ లీడర్ అంటున్నారు. వారూ వీరూ కాదు వైసీపీకి వెన్నెముక లాంటి రాజ్యసభ ఎంపీ విజయసాయిరెడ్డి పవన్ గురించి ప్రశంసలతో మాట్లాడుతున్నారు అంటే దాని వెనక రాజకీయ వ్యూహాలనే అంతా ఆలోచిస్తున్నారు.
తాజాగా విజయసాయిరెడ్డి చేసిన ఒక ట్వీట్ ఏపీలోనే సంచలనం రేపింది. యంగెస్ట్ స్టేట్ ఏపీకి యంగ్ సీఎం గా పవన్ రావాలని అందులో విజయసాయిరెడ్డి కోరుకున్నారు. 75 ఏళ్ల వయసు ఉన్న చంద్రబాబు సీఎం గా చంద్రబాబు నాయకత్వం ఇక అనవసరం అన్నట్లుగా ఆయన పేర్కొన్నారు.
అంతే కాదు పవన్ కి జాతీయ స్థాయిలో ఉన్న పాపులారిటీ, అలాగే ఆయన వయసు దృష్ట్యా ఏపీకి పవన్ నాయకత్వం వహిస్తేనే బాగుంటుంది అని విజయసాయిరెడ్డి ఒక వినూత్నమైన అనూహ్యమైన సూచన చేశారు. ఏపీని నడిపించే నాయకుడిగా ఎన్డీయే కూటమిలో పవన్ ది బెస్ట్ అని కూడా అన్నారు.
ఆయన నాయకత్వంలో ఏపీలో ఎన్డీయే పాలన సాగాలని కోరుకున్నారు. ఈ నేపధ్యంలో చంద్రబాబుని ఓల్డ్ లీడర్ గా ఆయన అభివర్ణించారు. పవన్ మీద విజయసాయిరెడ్డి ఈ రకమైన ప్రశంసలు కురిపించడం అయితే సర్వత్రా చర్చనీయాంశం అవుతోంది. వైసీపీ కూడా దీనిని ఆసక్తిగానే గమనిస్తోంది.
అయితే ఇది కూటమిలో చిచ్చు రేపేందుకే విజయసాయిరెడ్డి ఈ విధంగా ట్వీట్ చేశారని టీడీపీ అంటోంది. గతంలో పవన్ మీద వైసీపీ నేతలు చేసిన విమర్శలు గుర్తు చేస్తోంది. ఇవన్నీ పక్కన పెడితే పవన్ సీఎం అంటే మాత్రం కాపులు చాలా సంతోషిస్తారు. అభిమానులు అయితే ఎగిరి గంతు వేస్తారు.
వారికి ఈ రాజకీయాలూ వ్యూహాలు అన్నవి పట్టనే పట్టవు. వారికి కావాల్సింది తమ నేత సీఎం కావడం. వైసీపీ సరిగ్గా దీనిని చూసి ఈ విధమైన ఎత్తుగడను ఎంచుకుందా అన్నది కూడా చర్చగా ఉంది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ మీద వైసీపీ చేసినన్ని విమర్శలు ఎవరూ చేయలేదు, ఆయనను ఒక వ్యక్తిగానే తీసుకుని ఈ విమర్శలు చేసింది. కానీ ఆయనకు ఉన్న అపారమైన అభిమాన జనం, అదే విధంగా ఆయన వెనకనే ఉన్న బలమైన సామాజిక వర్గాన్ని పట్టించుకోలేదు.
దాని ఫలితమే ఘోర ఓటమిని ఆ పార్టీ అందుకోవాల్సి వచ్చింది. అయితే వైసీపీ నేతలు ఇపుడు తన స్టాండ్ మార్చుకున్నారు. ఏపీలో వారికి టీడీపీ ప్రథమ ప్రత్యర్ధి, చంద్రబాబుతోనే వారికి రాజకీయ వైరం ఉంది. అందుకే పవన్ పట్ల సాఫ్ట్ కార్నర్ వైఖరిని ప్రదర్శిస్తున్నారు అని అంటున్నారు. ఇటీవల మరో మాజీ మంత్రి పేర్ని నాని కూడా పవన్ సముద్రంలోని వెళ్లి షిప్ లను తనిఖీ చేయడాన్ని మంచి విషయం అభినందనీయం అని మెచ్చుకున్నారు.
ఇపుడు చూస్తే విజయసాయిరెడ్డి కూడా అదే బాటలో మరిన్ని అడుగులు ముందుకు వేసి పవన్ ని ఏకంగా ఆకాశానికి ఎత్తేస్తున్నారు. ఇక జగన్ లో కూడా ఈ మార్పు చూడాల్సి ఉంది అని అంటున్నారు. ఆయన దత్తపుత్రుడు అన్న మాటను పదే పదే అనకుండా ఉంటే బాగుంటుంది అని అంటున్నారు. కాపుల మద్దతు కోసమే వైసీపీ ఈ విధంగా కామెంట్స్ చేస్తోందా అన్న చర్చ ఉంది.
అదే సమయంలో కాపులు కూడా ఇంతకంటే మంచి తరుణం రాదు అనే అంటున్నారు. కూటమి గెలుపునకు పవన్ విశేషమైన పాత్ర పోషించారు కాబట్టి పవన్ కి సీఎం చాన్స్ దక్కాల్సిందే అన్నది వారి ఆలోచన. ఇపుడు విజయసాయిరెడ్డి ట్వీట్ తో వారి ఆశలు మరింతగా మొలకెత్తుతున్నాయి. అయితే దీని మీద పవన్ జనసేన నేతలు అయితే రాజకీయ వ్యూహంగా భావించి పట్టించుకునేది ఉండదు, కానీ పవన్ ని ఎంతగా వైసీపీ పొగడితే అంతలా అది టీడీపీకే ఇబ్బంది అవుతుంది అని అంటున్నారు. ఈ లాజిక్ తెలిసిన వైసీపీ ఊరుకుంటుందా ఇదే వైఖరి కంటిన్యూ చేస్తుందా అన్నది చూడాల్సి ఉంది.