బిగ్ బ్రేకింగ్... రాజకీయాలకు విజయసాయిరెడ్డి గుడ్ బై!
హెచ్చరికలు లేని తుఫాను, వార్నింగ్ లు లేని సునామీ అన్నట్లుగా ఓ బిగ్ బ్రేకింగ్ అప్ డేట్ ఏపీ రాజకీయాల్లో చోటు చేసుకుంది.
By: Tupaki Desk | 24 Jan 2025 2:16 PM GMTహెచ్చరికలు లేని తుఫాను, వార్నింగ్ లు లేని సునామీ అన్నట్లుగా ఓ బిగ్ బ్రేకింగ్ అప్ డేట్ ఏపీ రాజకీయాల్లో చోటు చేసుకుంది. ఎవరూ ఏమాత్రం ఊహించని విధంగా అన్నట్లుగా.. సడన్ గా "రాజకీయాల నుంచి తప్పుకుంటున్నాను" అంటూ వైసీపీ కీలక నేత, వైఎస్ జగన్ కి సన్నిహితుడు అనే పేరున్న ఆ పార్టీ రాజ్యసభ ఎంపీ ప్రకటించారు. ఈ విషయం తీవ్ర సంచలనంగా మారింది.
అవును... ఏపీ రాజకీయాల్లో బిగ్ బ్రేకింగ్ తెరపైకి వచ్చింది. ఇందులో భాగంగా... "రాజకీయాల నుంచి తప్పుకుంటున్నాను.. రాజ్యసభ సభ్యత్వానికి రేపు (జనవరి 25వ తారీఖున) రాజీనామా చేస్తున్నాను" అంటూ వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి 'ఎక్స్' వేదికగా ప్రకటించారు. ఆ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ విదేశాల్లో ఉన్న సమయంలో ఈ ప్రకటన రావడం గమనార్హం.
తాజాగా ఈ విషయాలపై ఎక్స్ వేదికగా ఓ పోస్టు పెట్టిన విజయసాయిరెడ్డి... "రాజకీయాల నుంచి తప్పుకుంటున్నాను.. రాజ్యసభ సభ్యత్వానికి 25న రాజీనామా చేస్తున్నాను. ఏ రాజకీయ పార్టీలోనూ చేరడం లేదు.. వేరే పదవులో, ప్రయోజనాలో, లేక డబ్బులో ఆశించి రాజీనామా చేయడం లేదు.. ఇది పూర్తినా నా వ్యక్తిగత నిర్ణయం.. ఎలాంటి ఒత్తిళ్లు లేవు.. ఎవరూ ప్రభావితం చేయలేదు" అని వెల్లడించారు.
ఇదే సమయంలో... నాలుగు దశాబ్ధాలుగా, మూడు తరాలుగా తనను నమ్మి ఆదరించిన వైఎస్ కుటుంబానికి రుణపడి ఉన్నట్లు తెలిపిన విజయసాయిరెడ్డి.. రెండుసార్లు రాజ్యసభ సభ్యుడిగా అవకాశం ఇచ్చిన జగన్ కు, తనను ఇంతటి ఉన్నతస్థాయికి తీసుకెళ్లిన భారతమ్మకు సదా కృతజ్ఞుడిని అని అన్నారు. జగన్ కు మంచి జరగాలని కోరుకుంటున్నట్లు తెలిపారు.
ఈ సందర్భంగా... పార్లమెంటరీ పార్టీ నాయకుడిగా, రాజ్యసభ ఫ్లోర్ లీడర్ గా, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా, పార్టీ - రాష్ట్ర ప్రయోజనాల కోసం చిత్తశుద్ధితో శక్తివంచన లేకుండా కృషి చేసినట్లు తెలిపారు.. ఇదే సమయంలో కేంద్రానికి, రాష్ట్రానికి మధ్య వారధిలా పనిచేసినట్లు సాయిరెడ్డి తెలిపారు.
ఇదే సమయంలో... తనను సుమారు తొమ్మిదేళ్లుగా ప్రోత్సహించి కొండత బలాన్ని, మనోధైర్యాన్ని ఇచ్చి తెలుగు రాష్ట్రాల్లో తనకు గుర్తింపునిచ్చిన ప్రధాని మోడీ, హోంమంత్రి అమిత్ షాలకు ప్రత్యేక ధన్యవాదాలు చెబుతున్నట్లు సాయిరెడ్డి తెలిపారు. ఇక... టీడీపీతో రాజకీయంగా విభేధించినట్లు చెప్పిన విజయసాయిరెడ్డి.. చంద్రబాబు ఫ్యామిలీతో వ్యక్తిగతంగా విబేధాలు లేవని.. పవన్ తో చిరకాల స్నేహం ఉందని అన్నారు.
ఇక.. తన భవిష్యత్తు వ్యవసాయం అని స్పష్టం చేసిన విజయసాయిరెడ్డి.. సుదీర్ఘ రాజకీయ ప్రయాణంలో తనను ఎంతో ఆదరించిన రాష్ట్ర ప్రజలకు, మిత్రులకు, సహచరులకు, పార్టీ కార్యకర్తలకు, ప్రతీ ఒక్కరికీ పేరు పేరునా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నట్లు విజయసాయిరెడ్డి తెలిపారు.