విజయసాయిరెడ్డి భారీ కోరిక... జగన్ కు చెప్పారంట!
ఏపీ అధికార పార్టీలోని కీలక నేతల్లో ఒకరైన రాజ్యసభ ఎంపీ విజయసాయిరెడ్డి తన బలమైన, భారీ కోరికను తాజాగా బయటపెట్టారు.
By: Tupaki Desk | 12 April 2024 7:52 AM GMTఏపీ అధికార పార్టీలోని కీలక నేతల్లో ఒకరైన రాజ్యసభ ఎంపీ విజయసాయిరెడ్డి తన బలమైన, భారీ కోరికను తాజాగా బయటపెట్టారు. తాజాగా ఒక టీవీ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో స్పందించిన ఆయన... ఏపీ రాజకీయాలపైనా, ఎన్డీయే లోకి జగన్ ను మోడీ ఆహ్వానించడంపైనా, తన రిటైర్మెంట్ ప్లాన్స్ పైనా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా తన బలమైన కోరికను జగన్ దృష్టికి తీసుకెళ్లినట్లు వెల్లడించారు. ఇప్పుడు ఈ వ్యాఖ్యలు వైరల్ గా మారాయి.
అవును... తాజాగా ఒక ప్రముఖ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో స్పందించిన విజయసాయిరెడ్డి... తనకు విశాఖపట్నం ఎంపీగా పోటీ చేయాలని ఉన్నప్పటికీ నెల్లూరు లోక్ సభకు పోటీ చేస్తున్నట్లు తెలిపారు. ఇదే సమయంలో... నెల్లూరు జిల్లాలోని అన్ని అసెంబ్లీ నియోజకవర్గల్లోనూ పార్టీ గెలవబోతోందని అన్నారు. ఇక తన ప్రత్యర్ధి ఆర్థికంగా చాలా బలమైన వ్యక్తి అయినప్పటికీ... తమకు ప్రజల మద్దతు ఉందని స్పష్టం చేశారు.
ఇదే సమయంలో తొలిసారి ప్రత్యక్ష రాజకీయాల్లో పోటీ చేయబోతున్న ఆయన... డబుల్ ఇంజిన్ సర్కార్ పైనా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇందులో భాగంగా.. ఏపీలో కూటమి జతకట్టడం ఇదే తొలిసారి కాదని.. 2014లోనే ఏపీలో డబుల్ ఇంజిన్ సర్కార్ ను ప్రజలు ఇప్పటికే చూశారని.. ఆ డబుల్ ఇంజిన్ సర్కార్ తో ఏపీ దివాళ తీసిందని అన్నారు.
ఇదే సమయంలో 2014లో ఏపీలో ప్రజలను డబుల్ ఇంజిన్ సర్కారనే వంచించారని.. తీరా ప్రజలు నమ్మి అధికారం అప్పగిస్తే రెండు ఇంజిన్లు చెరో దిక్కుకూ వెళ్లి రాష్ట్రానికి నష్టం చేశాయని ఎద్దేవా చేశారు. ఆ క్రమంలోనే నాడు గ్రామీణాభివృద్ధి నిలిచిపోయి, అవినీతి విశృంఖలంగా పెరిగిపోయిందని అన్నారు. ఈ నేపథ్యంలో... మరోసారి టీడీపీ, బీజేపీ కలిసి పోటీ చేయడం విడ్డూరమని చెప్పిన సాయిరెడ్డి... తాము వద్దనుకున్న తర్వాతే టీడీపీతో బీజేపీ కలిసిందని తెలిపారు.
ఈ సందర్భంగా... తన కోరికను బయటపెట్టారు విజయసాయిరెడ్డి. ఇందులో భాగంగా... తాను ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావాలనుకోలెదన్నట్లుగా చెప్పిన ఆయన... ఈ ఎన్నికల్లో ఎంపీగా పోటీ చేస్తానని తాను అనుకోలేదని.. జగన్ ఆదేశాలతోనే తాను బరిలోకి దిగినట్లు తెలిపారు. ఇదే క్రమంలో... తనకు రాజకీయ రిటైర్మెంట్ తర్వాత గవర్నర్ గా చేయాలని ఉందని.. ఇదే విషయాన్ని తమ నాయకుడు జగన్ కు చెప్పానని.. ఆయన సిఫారుసు చేస్తే గవర్నర్ గా వెళ్తా అని తెలిపారు.