వైసీపీ నంబర్ టూ ఎక్కడ?
వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఆ సీనియర్ నాయకుడు అంతా తానై వ్యవహరించారు.
By: Tupaki Desk | 13 July 2024 11:30 PM GMTవైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఆ సీనియర్ నాయకుడు అంతా తానై వ్యవహరించారు. పార్టీలో, ప్రభుత్వంలో జగన్ తర్వాత నంబర్ టూగా ఆయన గుర్తింపు కూడా పొందారు. రాజ్యసభ ఎంపీగా రాష్ట్రం, కేంద్ర ప్రభుత్వం మధ్య వారధిగానూ వ్యవహరించారు. కానీ ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ ఓటమి తర్వాత ఆ లీడర్ పత్తాలేకుండా పోయారని అంటున్నారు. ఆయనే.. విజయసాయిరెడ్డి. పార్టీ ఓటమి తర్వాత విజయ సాయిరెడ్డి సైలెంట్ అయిపోవడం హాట్ టాపిక్‌గా మారింది.
వైసీపీ ఆవిర్భావం నుంచి జగన్‌తో ఉన్న ముఖ్యమైన నాయకులు విజయసాయిరెడ్డి, వైవీ సుబ్బారెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు రాష్ట్ర ప్రభుత్వంలో సజ్జల, ఢిల్లీలో సాయిరెడ్డి, పార్టీ వ్యవహారాల్లో వైవీ సుబ్బారెడ్డి చక్రం తిప్పారు. ముఖ్యంగా సాయిరెడ్డికి జగన్ అధిక ప్రాధాన్యతనిచ్చారు. కేంద్రం నుంచి నిధులు తదితర విషయాల్లో సాయిరెడ్డి కీలకంగా వ్యవహరించారు. మరోవైపు రాష్ట్రంలో ఉత్తరాంధ్ర బాధ్యతలను మొదట ఆయనకే కట్టబెట్టారు. కానీ వేమిరెడ్డి పార్టీ వీడటంతో చివరి నిమిషంలో నెల్లూరు నుంచి పోటీచేసి ఓడిపోయారు.
ఈ ఓటమి విజయసాయిరెడ్డిని దెబ్బకొట్టిందనే చెప్పాలి. ఇదే సమయంలో వైవీ సుబ్బారెడ్డి రాజ్యసభ సభ్యుడయ్యారు. దీంతో పార్లమెంటరీ నేతగా సుబ్బారెడ్డిని జగన్ నియమించడంతో సాయిరెడ్డి అంసతృప్తికి గురయ్యారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అప్పటివరకూ ఆ హోదాలో ఉన్న సాయిరెడ్డి ఇప్పుడు కేవలం రాజ్యసభ పక్షనేతగా మాత్రమే మిగిలిపోయారు. దీంతో పార్టీకి అంటీముట్టనట్లుగా సాయిరెడ్డి వ్యవహరిస్తున్నారనే టాక్ ఉంది. త్వరలోనే ఆయన పదవీ కాలం కూడా పూర్తి కానుంది. ఈ నేపథ్యంలో భవిష్యత్‌పై సాయిరెడ్డి ఎలాంటి నిర్ణయం తీసుకుంటారన్నది ఆసక్తికరంగా మారింది. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే సాయిరెడ్డి.. ఇప్పుడు కూటమి ప్రభుత్వ నిర్ణయాలపై అసలు స్పదించడం లేదు. దీంతో సాయిరెడ్డి మనసులో ఏముందనే చర్చ జోరందుకుంది.