ఒక్క క్షణం ఆలోచించమ్మా చెల్లమ్మా... సాయిరెడ్డి ట్వీట్ వైరల్!
ఈ నేపథ్యంలో.. ఎన్టీఆర్ కూతురు దగ్గుబాటి పురంధేశ్వరిపై వైసీపీ పార్లమెంటరీ నేత, రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి వరుస ట్వీట్లు చేశారు.
By: Tupaki Desk | 28 Aug 2023 11:59 AM GMTమహానటుడు, దివంతగత మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారకరామారావు పేరిట ఇవాళ 100 రూపాయల స్మారక నాణెం విడుదల అయిన సంగతి తెలిసిందే. రాష్ట్రపతి భవన్ లో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో ఎన్టీఆర్ కుటుంబ సభ్యుల సమక్షంలో ఈ నాణేన్ని రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ఆవిష్కరించారు.
ఈ కార్యక్రమంలో పార్టీలకు అతీతంగా.. పాత వైరాలకు అతీతంగా.. ఎన్టీఆర్ కుటుంబ సభ్యులు అంతా కలిసి నడిచారు. బీజేపీ పార్టీ పెద్దలను కలిశారు. భవిష్యత్ రాజకీయాలపై చర్చించారని సమాచారం! ఈ నేపథ్యంలో.. ఎన్టీఆర్ కూతురు దగ్గుబాటి పురంధేశ్వరిపై వైసీపీ పార్లమెంటరీ నేత, రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి వరుస ట్వీట్లు చేశారు.
ఈ సందర్భంగా... "పురంధేశ్వరి! ఒక్క క్షణం ఆలోచించమ్మా!" అంటూ మొదలుపెట్టిన విజయసాయిరెడ్డి... అనంతరం "తండ్రిపై ప్రేమ గుండెలోతుల్లో ఉండాలి" అంటూ ఒక ట్వీట్ పెట్టారు. ఇది హాట్ టాపిక్ గా మారింది. దీంతో అన్నగారికి శత్రువులు బయట లేరనే కామెంట్లు వినిపిస్తున్నాయి!
ఈ సందర్భంగా... "వాటాలు తేల్చుకోలేక మద్రాసులో ఎన్టీఆర్ ఇల్లు పాడు పెట్టేశారు. అబిడ్స్ లో అయన ఇల్లు అమ్ముకున్నారు. బంజారాహిల్స్ లో ఆయన మరణించిన ఇల్లు పడగొట్టి అపార్ట్మెంట్ లు కట్టుకుని అద్దెకిచ్చారు. దానికి ఎదురు ఉన్న అయన ఇంట్లో మ్యూజియం పెట్టాలనుకున్నారు.. అయన ఆశయాలకు నీళ్ళుకొట్టారు" అంటూ సాయిరెడ్డి ట్వీట్ చేశారు.
అనంతరం... "తండ్రిపై ప్రేమ గుండెలోతుల్లో హృదయ అంతరంగం నుంచి రావాలేకానీ... పేపర్లు, టీవీల్లో కాదు చెల్లెమ్మా!" అంటూ ప్రారంభించిన సాయిరెడ్డి... "సమాధి తప్ప ఆయనకు స్మారకచిహ్నం కూడా లేకుండా చేసి ఇప్పుడు 100 రూపాయల నాణెం అంటారు" అని కీలక విషయాలు ఎత్తారు.
ఇదే సమయంలో.. "భారతరత్న గురించి మీరు ఢిల్లీలో ఏనాడు అడగలేదు" అని గతం గుర్తుచేసిన విజయసాయిరెడ్డి... "రాజకీయ పూర్వాశ్రమంలో మిమ్మల్ని వెన్నుతట్టి ప్రోత్సహించిన అప్పటి మీ నాయకురాలు సోనియాకు మీరు చెప్పిన హృదయపూర్వక కృతఙ్ఞతలు మరచిపోలేమమ్మా!" అంటూ పార్లమెంటులో ఎన్టీఆర్ విగ్రహం ప్రారంబోత్సవం సందర్భంగా... సోనియా గాంధీకి థాంక్స్ చెబుతూ పురందేశ్వరి ఇచ్చిన ప్రకటన తాలూకు ఫోటోను పోస్ట్ చేశారు.
అనంతరం "ఎన్టీఆర్ గారు ప్రేమతో చూసుకున్న అబిడ్స్ ఇల్లు.. విజయ్ ఎలక్ట్రికల్స్ రమేశ్ గారికి కేవలం 4 కోట్లకు అమ్ముకున్నారు. వీళ్ళ దగ్గర నాలుగు కోట్లు కూడా లేవా? అది నందమూరి రామకృష్ణ గారి వాటాకు వచ్చింది. చంద్రబాబు లేక పురంధ్రీశ్వరి ఆ ఇంటిని కొని ఎన్టీఆర్ జ్ఞాపకార్థంగా వుంచవచ్చుగా!" అని అన్నారు.
ఇదే ట్వీట్ లో ఒక వీడియోను పోస్ట్ చేసిన సాయిరెడ్డి కీలక విషయాలు ప్రథావించారు. "ఆయన మీద మీకున్న నిజమైన ప్రేమకు అద్దం పడుతుంది ఈ వీడియోలోని అయన మద్రాస్ ఇంటి ప్రస్తుత పరిస్థితి" అంటూ ఎన్టీఆర్ నివసించిన ఇంటి పరిస్థితిని, అన్నగారిపై కుటుంబ సభ్యులకు ఉన్న ఆత్మీయతను చెప్పకనే చెప్పే ప్రయత్నం చేశారు!
ఈ క్రమంలో అత్యంత కీలకమైన ఫోటోలను షేర్ చేశారు సాయిరెడ్డి. తాజాగా ఎన్ టీఆర్ 100 రూపాయల నాణెం ఆవిష్కరణ కార్యక్రమంలో భాగంగా హస్తినలో ఉన్న నందమూరి కుటుంబ సభ్యులు అంతా ఒకచోట చేరిన ఫోటోను షేర్ చేస్తూ... వారంతా బీజేపీ చీఫ్ జేపీ నడ్డా తో భేటీ అయిన విషయాన్ని కీలకంగా ప్రస్థావించారు.
"ఇంతకంటే ఆధారం కావాలా? చిన్నమ్మా! పురంధేశ్వరి! పతీసమేతంగా మరిదిని తీసుకెళ్లి మీ పార్టీ జాతీయ అధ్యక్షుడు నడ్డా గారికి ఇష్టం లేకపోయినా బలవంతంగా ఏదో చెప్పే ప్రయత్నం. బీజేపీకి తెలీదా, మీరంతా ఒకటే అని. అందుకేకదా దొంగ చేతికే తాళం ఇచ్చింది!" అని సాయిరెడ్డి ట్వీట్ చేశారు.
ఇదే సమయంలో జేపీ నడ్డాతో చంద్రబాబు సంబాషిస్తున్న ఫోటోను షేర్ చేసిన ఆయన... "ఢిల్లీ సాక్షిగా కుట్రల చేయడం మీ మరిది గారికి అలవాటే. కానీ ఈసారి మిమ్మల్నీ తీసుకెళ్లి అమ్మేసే ప్రయత్నం చేస్తున్నారు చూడండి... అదీ హైలైట్. చంద్రబాబు జీవితంలో ఎవ్వరికీ విశ్వసనీయమైన స్నేహితుడు కాలేడన్న కమ్మటి వాస్తవం ఢిల్లీ నుంచి గల్లీ దాకా అందరికీ తెలుసు" అని ముగించారు.
ప్రస్తుతం విజయసాయిరెడ్డి లేవనెత్తిన విషయాలు, గుర్తుచేసిన అంశాలు, సంధించిన ప్రశ్నలు, షేర్ చేసిన ఫోటోలు... ఆన్ లైన్ వేదికగా హాట్ టాపిక్ గా మారాయి. ఏపీ రాజకీయాల్లో వైరల్ ఇష్యూగా స్ప్రెడ్ అవుతున్నాయి!