Begin typing your search above and press return to search.

చిన్నమ్మ వర్సెస్ విజయసాయిరెడ్డి : చిలికి చిలికి గాలి వానగా...!

వైసీపీలో కీలకమైన నేతగా విజయసాయిరెడ్డి ఉన్నారు. ఆయన వచ్చే ఎన్నికల్లో పార్టీ విజయం కోసం కృషి చేస్తున్నారు.

By:  Tupaki Desk   |   4 Nov 2023 9:38 AM GMT
చిన్నమ్మ వర్సెస్ విజయసాయిరెడ్డి : చిలికి చిలికి గాలి వానగా...!
X

వైసీపీలో కీలకమైన నేతగా విజయసాయిరెడ్డి ఉన్నారు. ఆయన వచ్చే ఎన్నికల్లో పార్టీ విజయం కోసం కృషి చేస్తున్నారు. ఇదిలా ఉంటే బీజేపీకి ఏపీ ప్రెసిడెంట్ గా నియమితురాలు అయిన దగ్గుబాటి పురంధేశ్వరి ఎంతసేపూ వైసీపీ మీదనే విమర్శలు చేస్తూ టార్గెట్ చేస్తున్నారు అని అంటున్నారు. ఏపీలో బీజేపీ బలపడేందుకు కేంద్ర పెద్దలు ఆమెకు చాన్స్ ఇస్తే ఆమె దాన్ని టీడీపీని బలోపేతం చేయడానికి ఉపయోగిస్తున్నారు అని ప్రచారంలో ఉంది.

దాన్ని విజయసాయిరెడ్డి మరింత గట్టిగానే చెబుతూ వస్తున్నారు. అంతే కాదు ఆమె బీజేపీ కోసం పనిచేస్తున్నారా లేక టీడీపీ కోసమా అని ఆయన ప్రశ్నించారు. ఆమె ఆమె భర్త దగ్గుబాటి వెంకటేశ్వరరావు కలసి మారిన పార్టీల గురించి కూడా విజయసాయిరెడ్డి చిట్టా బయటకు తీసి చెప్పుకొచ్చారు. మొదట టీడీపీ, ఆ తరువాత ఎన్టీయార్ టీడీపీ అక్కడ నుంచి బీజేపీ, 2004 ఎన్నికల ముందు కాంగ్రెస్, 2014 తరువాత బీజేపీ ఇలా ఎన్ని పార్టీలు మారుతారు అని పురంధేశ్వరి మీద విజయసాయిరెడ్డి శరసంధానమే చేశారు.

ఇక ఏపీలో ఇసుక మద్యం స్కాం అని పురంధేశ్వరి ఆరోపిస్తూంటే గత ప్రభుత్వం హయాంలో జరిగిన వాటిని వైసీపీ బయటకు తీసి చంద్రబాబు మీద కేసులు పెడుతోంది. నాడు ఇదే బీజేపీ నేతలు ఏమీ మాట్లాడకుండా మౌనం వహించి ఇపుడు వైసీపీని టార్గెట్ చేస్తున్నారు అని కూడా విమర్శిస్తున్నారు.

ఇదిలా ఉంటే హైదరాబాద్ లో ఖరీదైన ప్రాంతంలో పురంధేశ్వరి నిర్మాణాలు చేయడం మీద విజయసాయిరెడ్డి ప్రశ్నించారు. ఆమెను ఎయిర్ ఇండియా ఇండిపెండెంట్ డైరెక్టర్ గా కేంద్రం నియమించింది. దాంతో ఆమె ఆ విమానయాన సంస్థ అమ్మకం విషయంలో మధ్యవర్తిగా వ్యవహరించారని ఘాటైన ఆరోపణలనే విజయసాయిరెడ్డి చేశారు.

ఇలా పురంధేశ్వరి గురించి ఎవరికీ తెలియని విషయం బయటపెట్టి విజయసాయిరెడ్డి ఆమెను ఇబ్బంది పెట్టరని అంటున్నారు. ఈ ఇన్ఫర్మేషన్ బీజేపీలో ఆమె అంటే పడని ఒక వర్గం ఇచ్చిందని కూడా అంటున్నారు. ఇలా మధ్యవర్తిగా వ్యవహరించి ఆమె ఎంత లాభపడ్డారు అన్నదే విజయసాయిరెడ్డి సూటి ప్రశ్న.

అలాగే హైదరాబాద్ లో ఆమె నూతన నిర్మాణాల గురించి కూడా సందేహాలను లేవనెత్తేలా ఆయన సమాచారాన్ని బయటపెడుతున్నారు. తాను తలచుకుంటే పురంధేశ్వరి గురించి చాలా విషయాలు చెబుతాను అని విజయసాయిరెడ్డి అనడేం కాదు ప్రతీ రోజు అనేక అంశాలను బయటకు తెస్తున్నారు. ఆమె బీజేపీ కోసం కాదు టీడీపీ కోసం అని ఆరోపించడం కూడా హీటెక్కించేదే. ఆమె వల్ల బీజేపీకి అదనంగా ఒక్క ఓటు అయినా వచ్చిందా అని కూడా విజయసాయిరెడ్డి ప్రశ్నిస్తున్నారు.

దీంతో పురంధేశ్వరి ఇపుడు ఏకంగా సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తికి ఒక లేఖ రాశారు ఆ లేఖలో పదేళ్ళుగా బెయిల్ మీద ముఖ్యమంత్రి వైఎస్ జగన్, ఎంపీ విజయసాయిరెడ్డి ఉంటున్నారని, విచారణ కూడా వారి కేసులలో జాప్యం జరుగుతోందని ఆమె పేర్కొన్నారు. దీని మీద చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

ఇప్పటికే ఇలాంటి ఆరోపణలతో ఒక పిటిషన్ని వైసీపీ రెబెల్ ఎంపీ రఘురామ క్రిష్ణం రాజు సుప్రీం కోర్టులో వేశారు. దాని మీద ప్రతివాదులకు నోటీసులు వెళ్లాయి. ఈ కేసు విచారణ జనవరికి వాయిదా పడింది. మొత్తానికి బీజేపీలో పురంధేశ్వారి వైసీపీలో విజయసాయిరెడ్డిల మధ్య పెద్ద ఎత్తున డైలాగ్ వార్ అయితే మీడియా సాక్షిగా సాగుతోంది. మరి ఇది ఎటు దారి తీస్తుంది అన్నది చూడాలి.

బీజేపీ కేంద్ర పెద్దలతో వైసీపీ పెద్దలకు మంచి రిలేషన్స్ ఉన్నాయి. ఇక పురంధేశ్వరి వలస వచ్చిన నేత అని బీజేపీలో ఒక వర్గం ఆమెను వ్యతిరేకిస్తోంది. ఆమె ప్రెసిడెంట్ అయి నాలుగు నెలలు గడచినా పెర్ఫార్మెన్స్ అయితే పెద్దగా లేదు అని అంటున్నారు. ఆమె సామాజిక వర్గం ఓట్లతో పాటు టీడీపీ నుంచి కూడా జనాలను తీస్తారని ఆశించినా అలాంటిది జరగడంలేదు అంటున్నారు. దాంతో ఆమె పదవికి ముప్పు ఉంటుందా అన్న చర్చకు తెర లేస్తోంది. ఇక ఆమె సుప్రీం కోర్టుకు లేఖ రాయడం మీద ఎలాంటి పరిణామాలు ఉంటాయన్నది కూడా చూడాలని అంటున్నారు.