మరోసారి కాంగ్రెస్ లోకి రాములమ్మ!
నవంబర్ 30న తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ముంగిట భారతీయ జనతా పార్టీకి గట్టి షాక్ తగిలిన సంగతి తెలిసిందే.
By: Tupaki Desk | 16 Nov 2023 5:31 AM GMTనవంబర్ 30న తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ముంగిట భారతీయ జనతా పార్టీకి గట్టి షాక్ తగిలిన సంగతి తెలిసిందే. ఆ పార్టీకి ప్రముఖ సినీ నటి, మాజీ ఎంపీ విజయశాంతి రాజీనామా చేశారు. తన రాజీనామా పత్రాన్ని ఆమె బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డికి పంపారు. గత కొంతకాలంగా బీజేపీ పట్ల అసంతృప్తిగా ఉంటున్న విజయశాంతి ఆ పార్టీ కార్యక్రమాలకు హాజరు కావడం లేదు. దీంతో ఆమె పార్టీ మారతారని గతంలోనే ప్రచారం జరిగింది.
అయితే ఇటీవల ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తెలంగాణలో పర్యటించినప్పుడు విమానాశ్రయానికి వచ్చి ఆయనకు స్వాగతం పలికినవారిలో విజయశాంతి కూడా ఉన్నారు. దీంతో ఆమె పార్టీని వీడరని.. బీజేపీలోనే ఉంటారని అంతా భావించారు. అయితే అనూహ్యంగా ఆమె బీజేపీకి రాజీనామా చేశారు.
మరోవైపు తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల కోసం బీజేపీ ప్రకటించిన తొలి, మలి, తుది విడత అభ్యర్థుల జాబితాల్లోనూ విజయశాంతి పేరు లేదు. పార్టీలో చురుగ్గా లేకపోవడం, పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనకపోవడంతోనే ఆమెకు సీటు కేటాయించలేదని ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో విజయశాంతి పార్టీని వీడాలని నిర్ణయించుకుని రాజీనామా చేశారని అంటున్నారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ సమక్షంలో విజయశాంతి కాంగ్రెస్ పార్టీలో చేరే అవకాశం ఉందని సమాచారం.
ఇప్పటికే మాజీ ఎంపీలు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, జి. వివేకానంద్, మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్ రెడ్డి వంటి వారు బీజేపీకి రాజీనామా చేశారు. ఇప్పుడు వీరి కోవలో చేరిన నాలుగో కీలక నేత విజయశాంతే కావడం గమనార్హం. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, వివేకానంద్, ఏనుగు రవీంద్రరెడ్డి కాంగ్రెస్ లో చేరడంతో విజయశాంతి కూడా అందులోనే చేరతారని చెబుతున్నారు.
కాగా విజయశాంతి రాజకీయ ప్రస్థానం 1997లో మొదలైంది. 1997లో బీజేపీలో చేరి ఆ పార్టీ మహిళా విభాగం ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టారు. 2005లో ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన కోసం సొంతంగా తల్లి తెలంగాణ పార్టీని ఏర్పాటు చేశారు. ఆ తర్వాత కేసీఆర్ కోరిక మేరకు తల్లి తెలంగాణ పార్టీని టీఆర్‌ఎస్ లో విలీనం చేశారు. ఈ క్రమంలో టీఆర్‌ఎస్ తరఫున 2009లో మెదక్ నుంచి లోక్ సభకు ఎంపికయ్యారు.
ఈ క్రమంలో పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారని ఆరోపించి విజయశాంతిని 2013లో కేసీఆర్ పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. సస్పెన్షన్‌కు గురైన తరువాత విజయశాంతి కాంగ్రెస్ పార్టీలో చేరారు. 2014 ఎన్నికలలో మెదక్ అసెంబ్లీ నియోజకవర్గం నుండి పోటీ చేసి ఓడిపోయారు. కొంతకాలం రాజకీయాలకు దూరంగా ఉన్న ఆమె 2020లో బీజేపీలో చేరారు.
ఈ క్రమంలో సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చారు. ప్రిన్స్ మహేశ్ బాబు ‘సరిలేరు నీకెవ్వరూ’ సినిమాతో టాలీవుడ్ లోకి తిరిగి రీ ఎంట్రీ ఇచ్చారు. 13 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత విజయశాంతి నటించిన సినిమా ఇదే కావడం గమనార్హం.
ఆ సినిమా తర్వాత మరే సినిమా ఆమె చేయలేదు. మళ్లీ రాజకీయాల్లో యాక్టివ్ అయ్యారు.