Begin typing your search above and press return to search.

దళపతి విజయ్.. మరో విజయ్ కాంతా? 'వి' జయలలితనా? కమల్ హాసనా?

తమిళనాట మరో కొత్త పార్టీ ప్రస్థానం మొదలైంది. ఇప్పటికే పార్టీ ఖరారైనప్పటికీ.. దళపతి విజయ్ గురువారం నుంచి పూర్తిస్థాయి రంగంలోకి దిగారు

By:  Tupaki Desk   |   22 Aug 2024 5:30 PM GMT
దళపతి విజయ్.. మరో విజయ్ కాంతా? వి జయలలితనా? కమల్ హాసనా?
X

తమిళనాట మరో కొత్త పార్టీ ప్రస్థానం మొదలైంది. ఇప్పటికే పార్టీ ఖరారైనప్పటికీ.. దళపతి విజయ్ గురువారం నుంచి పూర్తిస్థాయి రంగంలోకి దిగారు. అసలే తమిళ రాజకీయాలు సినిమా రంగంతో గట్టిగా ముడిపడి ఉంటాయి. ప్రస్తుత అధికార పార్టీ డీఎంకేకు చెందిన కరుణానిధి సినీ రచయిత అనే సంగతి తెలిసిందే. ఆయన మనవడు, సీఎం స్టాలిన్ కుమారుడు అయిన ఉదయనిధి తమిళ సినిమాల్లో హీరోగా చేసి ఇప్పుడు పూర్తిగా రాజకీయాలకు పరిమితం అయ్యారు. ఇక డీఎంకేకు చిరకాల ప్రత్యర్థి అన్నాడీఎంకేను స్థాపించింది తమిళుల సినీ దేవుడు ఎంజీఆర్ అనే సంగతి తెలిసిందే. ఆ తర్వాత పార్టీ సినీ నటి జయలలిత చేతుల్లోకి వెళ్లడం.. ఆమె పలుసార్లు సీఎం కావడం అందరికీ అనుభవమే.

కమల్ రజనీ నుంచి శరత్ కుమార్ వరకు

సౌతిండియా సూపర్ స్టార్ రజనీ కాంత్ దశాబ్దాల పాటు ఊరించి రాజకీయాల్లోకి వచ్చినట్లే వచ్చి విరమించుకున్నారు. విశ్వ నటుడు కమల్ హాస్ మక్కల్ నీది మయ్యం అంటూ తిప్పలు పడుతూ వస్తున్నారు. నటుడు, ఒకప్పుడు హీరోగానూ చేసిన శరత్ కుమార్ కూడా భార్య రాధికతో కలిసి పార్టీ పెట్టి దానిని విలీనం చేశారు. ఎటుచూసినా తమిళనాడు రాజకీయాలు సినీ రంగంతో ముడిపడి ఉన్నాయి.

విజయం లేకున్నా విజయకాంత్..

తమిళనాడు నల్ల ఎంజీఆర్ గా పేరుగాంచిన దివంగత విజయకాంత్ 20 ఏళ్ల కిందటనే ఎండీఎంకే పేరిట పార్టీ పెట్టారు. దానిని నిలపుకొంటూ వచ్చారు. గత ఏడాది ఆయన చనిపోయినా పార్టీ బాధ్యతలను భార్య చూస్తున్నారు. విజయకాంత్ ఊహించినంతగా విజయవంతం కాలేదు. కానీ, ఓ దశలో అసెంబ్లీలో రెండో అతిపెద్ద పార్టీగా ఎండీఎంకే నిలిచింది. ఆ తర్వాత ఒడిదొడుకులు ఎదురైనా ఎండీఎంకే మాత్రం అలానే నిలిచింది. అయితే, విజయకాంత్ సీఎం పదవికి దగ్గరగా మాత్రం రాలేదు.

శూన్యాన్ని భర్తీ చేస్తారా?

జయలలిత మరణం తర్వాత తమిళ రాజకీయాల్లో గ్యాప్ వచ్చింది. దానిని భర్తీ చేసేవారే లేరు. జయ పార్టీ అన్నాడీఎంకే.. పన్నీర్ సెల్వం, పళనిస్వామి వర్గాల మధ్య చీలిపోయింది. ఇప్పుడు విజయ్ పార్టీ.. తమిళ రాజకీయాల్లో ఆ లోటును భర్తీ చేస్తుందేమో చూడాలి? ఎందుకంటే తమిళనాడు వరుసగా రెండుసార్లు ఒకే పార్టీకి అధికారం దక్కిన సందర్భాలు తక్కువ. ఇప్పుడు డీఎంకే, వచ్చేసారి అన్నాడీఎంకే అన్నట్లు ఉంటుంది పరిస్థితి. అయితే, విజయ్ పార్టీ.. అన్నాడీఎంకే స్థానాన్ని ఆక్రమిస్తుందా? వచ్చే ఎన్నికల నాటికి డీఎంకేను సవాల్ చేస్తుందా? అభిమానుల అండాదండ పుష్కలంగా ఉన్న విజయ్.. ‘విజయకాంత్’ గా మిగిలిపోతారా? లేక వి‘జయలలిత’ అవుతారా? అనేది చూడాలి.

ఆకట్టుకునేలా జెండా..

విజయ్ తాజాగా ఆవిష్కరించిన పార్టీ జెండా.. కాస్త ఆలోచింపేజేదిలాగే ఉంది. ఎరుపు, పసుపు రంగుల్లో ఉన్న ఈ జెండాపై మధ్యలో వాగాయి పువ్వుకు అటూఇటు ఏనుగులు ఉన్నాయి. తమిళ సంప్రదాయంలో వాగాయిని విజయానికి గుర్తుగా అభివర్ణిస్తారు. విజయ్ పార్టీ జెండాతో పాటు గీతాన్ని కూడా విడుదల చేశారు. కార్యక్రమంలో ఆయన తల్లిదండ్రులు కూడా పాల్గొన్నారు. తద్వారా తండ్రితో విభేదాలు లేవని చాటారు. ఇక కులం, మతం, లింగం, ప్రాంతం వివక్షను తొలగిస్తామని విజయ్ ప్రకటించారు.