స్లీప్ మోడ్ లోకి విక్రమ్ ల్యాండర్
ఇందులో భాగంగానే రెండు రోజుల క్రితం రోవర్ స్లీప్ మోడ్ లోకి వెళ్లిపోయింది. ఇక, తాజాగా విక్రమ్ ల్యాండర్ కూడా స్లీప్ మోడ్ లోకి వెళ్లేందుకు సిద్ధమవుతోంది.
By: Tupaki Desk | 4 Sep 2023 12:25 PM GMTభారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) చేపట్టిన చంద్రయాన్ 3 ప్రయోగం విజయవంతమైన సంగతి తెలిసిందే. ప్రపంచంలో మరే దేశానికి సాధ్యం కాని విధంగా చంద్రుడి దక్షిణ ధ్రువంపై అడుగుపెట్టిన భారత్ ఆ ఘనత సాధించిన తొలి దేశంగా చరిత్ర పుటల్లో నిలిచిపోయింది. మొత్తంగా జాబిల్లిపై అడుగుపెట్టిన నాలుగో దేశంగా భారత్ అవతరించింది. ఈ క్రమంలోనే చంద్రుడి దక్షిణ ధ్రువం గురించిన పలు కీలక విషయాలను విక్రమ్ ల్యాండర్, రోవర్లు వెల్లడించాయి. నిర్దేశించిన లక్ష్యానికి మించి విక్రమ్ ల్యాండర్ అద్భుతంగా పనిచేసిందని, ఇస్రో ఇచ్చిన ఆదేశాల ప్రకారం విక్రమ్ రెండవసారి చంద్రుడి ఉపరితలం మీద సాఫ్ట్ ల్యాండింగ్ అయిందని ఇస్రో ప్రకటించింది.
తాము ఆదేశాలు ఇచ్చిన విధంగానే 40 సెంటీమీటర్లు గాల్లోకి లేచి 30 నుంచి 40 సెంటీమీటర్ల దూరంలో సురక్షితంగా ల్యాండ్ అయిందని ఇస్రో ప్రకటించింది. విక్రమ్ ల్యాండర్, రోవర్లు తమకు నిర్దేశించిన లక్ష్యాలను పూర్తి చేసుకున్నాయని ఇస్రో తెలిపింది. ఇందులో భాగంగానే రెండు రోజుల క్రితం రోవర్ స్లీప్ మోడ్ లోకి వెళ్లిపోయింది. ఇక, తాజాగా విక్రమ్ ల్యాండర్ కూడా స్లీప్ మోడ్ లోకి వెళ్లేందుకు సిద్ధమవుతోంది. ఈ రోజు విక్రమ్ స్లీప్ మోడ్ లోకి వెళ్ళబోతుందని ఇస్రో అధికారికంగా ప్రకటించింది. భారత కాలమానం ప్రకారం రాత్రి 8 గంటలకు ఈ ప్రక్రియ పూర్తవుతుందని ఇస్రో వెల్లడించింది. చంద్రుడి ఉపరితలంపై జరిపిన హాప్ ఎక్స్పరిమెంట్ విజయవంతమైందని ప్రకటించింది.
ఆ తర్వాత కొత్త ప్రదేశంలో కూడా అందులోని పేలోడ్లు పనిశాయని ఇస్రో వెల్లడించింది. కొత్త ప్రదేశంలో కూడా పేలోడ్లు పని చేశాయని, వాటి సమాచారం భూమికి చేరిందని ఇస్రో వెల్లడించింది. ప్రస్తుతం పే లోడ్లన్నీ స్విచ్ ఆఫ్ అయ్యాయని, ల్యాండర్ రిసీవర్లు మాత్రమే ఆన్ లో ఉన్నాయని చెప్పింది. సోలార్ ఎనర్జీ తగ్గి బ్యాటరీ ఖాళీ అయిన తర్వాత ప్రజ్ఞాన్ పక్కనే విక్రం కూడా నిద్రలోకి జారుకుంటుందని ప్రకటించింది. రెండ్రోజుల క్రితం ప్రజ్ఞాన్ రోవర్ నిద్రావస్థలోకి జారుకున్న సంగతి తెలిసిందే.
ఇక, సెప్టెంబర్ 22వ తేదీన అవి రెండు తిరిగి మేలుకుంటాయని పేర్కొంది. హాప్ ఎక్స్పరిమెంట్ కు ముందు, తర్వాత ఫోటోలను ఇస్రో తన అధికారిక ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేసింది. సోలార్ ప్యానల్స్ ద్వారా శక్తి పొందే విక్రమ్, రోవర్ జీవితకాలం రెండు వారాలే అన్న సంగతి తెలిసిందే. చంద్రుడిపై సూర్యరశ్మి ఉన్నంతసేపే ఆ వ్యవస్థలు పనిచేసేలాగా వాటిని రూపొందించారు. సూర్యాస్తమయం సమయంలో చంద్రుడి దక్షిణ ధ్రువంలో ఉష్ణోగ్రతలు మైనస్ 150 డిగ్రీల సెల్సియస్ కు పడిపోతున్నాయి. 14 రోజుల తర్వాత అంటే సెప్టెంబర్ 22వ తేదీన అక్కడ మళ్ళీ సూర్యోదయం అవుతుంది.
ఆ సమయంలో ల్యాండర్, రోవర్ లపై సూర్యరశ్మి పడి మళ్లీ అవి పని చేయడం ప్రారంభిస్తాయని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. అందుకే సోలార్ ఎనర్జీని రిసీవ్ చేసుకునేలాగా రోవర్ యాంగిల్ ను మార్చినట్టుగా శాస్త్రవేత్తలు వెల్లడించారు. సెప్టెంబర్ 22న సూర్యరశ్మి ద్వారా వచ్చే సోలార్ ఎనర్జీలో రోవర్, లాండర్ పనిచేస్తే అది మన ప్రయోగానికి అదనపు ప్రయోజనమని శాస్త్రవేత్తలు వెల్లడించారు. లేకుంటే చంద్రుడిపై అవి ఎప్పటికీ అలాగే ఉండిపోతాయని ప్రకటించారు.