Begin typing your search above and press return to search.

గ్రామ, వార్డు సచివాలయాల ప్రక్షాళన.. ఇకపై మూడు కేటగిరీలుగా విభజన

గత వైసీపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన గ్రామ వార్డు సచివాలయాలను ప్రక్షాళించాలని కూటమి ప్రభుత్వం నిర్ణయించింది.

By:  Tupaki Desk   |   17 Jan 2025 12:32 PM GMT
గ్రామ, వార్డు సచివాలయాల ప్రక్షాళన.. ఇకపై మూడు కేటగిరీలుగా విభజన
X

గత వైసీపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన గ్రామ వార్డు సచివాలయాలను ప్రక్షాళించాలని కూటమి ప్రభుత్వం నిర్ణయించింది. శుక్రవారం జరిగిన మంత్రివర్గ సమావేశంలో సచివాలయాలను మూడు కేటగిరీలుగా విభజించాలని నిర్ణయించింది. జనాభా ఆధారంగా సిబ్బందిని సర్దుబాటు చేస్తామని సమాచార శాఖ మంత్రి పార్ధసారథి ప్రకటించారు. మంత్రివర్గ భేటీలో తీసుకున్న నిర్ణయాలను మంత్రి వెల్లడించారు.

గ్రామ, వార్డు సచివాలయాలను మూడు కేటగిరీలుగా విభజించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆధ్వర్యంలోని మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం సచివాలయాల్లో సగటున 11 మంది చొప్పున సిబ్బంది పనిచేస్తున్నారు. వీరిలో చాలామందికి తగిన పని ఉండటం లేదని ఆరోపణలు ఉన్నాయి. కొన్నిచోట్ల పని ఎక్కువై సిబ్బందిపై భారం పడుతోందని ప్రభుత్వానికి ఫిర్యాదులు అందాయి. దీంతో సచివాలయాలను జనాభా ఆధారంగా విభజించి సిబ్బందిని సర్దుబాటు చేయాలని మంత్రివర్గం నిర్ణయించింది.

ఇకపై గ్రామ, వార్డు సచివాలయాలను మూడు రకాలుగా విభజిస్తారు. ఇందులో 3500 జనాభా ఉన్న సచివాలయాలకు 8 మంది సిబ్బందిని కేటాయిస్తారు. అదేవిధంగా 2500 జనాభా ఉంటే ఏడుగురు, అంతకంటే తక్కువ జనాభా ఉంటే ఆరుగురు చొప్పున పనిచేస్తారు. గ్రామాల్లో పంచాయతీ కార్యదర్శి, మున్సిపాలిటీలు, నగర పంచాయతీల్లో వార్డు అడ్మినిస్ట్రేటర్ సెక్రటరీ ఆయా సచివాలయాలకు హెడ్ గా వ్యవహరిస్తారు.

రాష్ట్రవ్యాప్తంగా సుమారు 15 వేల వార్డు, గ్రామ సచివాలయాలు ఉన్నాయి. వీటిలో ప్రస్తుతం లక్షా 26 వేల మంది సిబ్బంది పనిచేస్తున్నారు. సగటున 8 మంది పనిచేయాల్సిన చోట సుమారు 10 నుంచి 14 మంది పనిచేస్తున్నట్లు ప్రభుత్వానికి అధికారులు నివేదించారు. ప్రస్తుతం మూడు కేటగిరీలుగా సచివాలయాలను విభజించి సిబ్బందిని సర్దుబాటు చేయాలని, మిగిలిన వారిని ఆయా డిపార్ట్మెంట్లకు కేటాయించాలని ప్రభుత్వానికి ప్రతిపాదనలు అందాయి. ముఖ్యంగా ఇరిగేషన్ శాఖలో ఏఈల కొరత తీవ్రంగా ఉంది. కానీ, సచివాలయాల్లో ఇంజనీరింగ్ అసిస్టెంట్ల పేరిట వందల మంది సిబ్బంది పనిచేస్తున్నారు. వీరిని ఇరిగేషన్ డిపార్ట్మెంట్కు సర్దుబాటు చేయాలని భావిస్తున్నారు. ఇదేవిధంగా మిగిలిన శాఖలకు సిబ్బందిని సర్దుబాటు చేసే అంశాన్ని ప్రభుత్వం పరిశీలిస్తోంది. ప్రస్తుతానికి సచివాలయాలకు సర్దుబాటు చేసి, ఆ తర్వాత మిగులు సిబ్బందిపై నిర్ణయం తీసుకోవాలని మంత్రివర్గం సమావేశంలో తీర్మానించారు.