Begin typing your search above and press return to search.

దేశంలో ఇప్పటివరకు జాతీయ జెండా ఎగరని గ్రామాలివే!

ఇలాంటి గ్రామాలు ఒకటి కాదు రెండు కాదు.. ఏకంగా 13 గ్రామాలు ఉండటం నిజంగా ఆశ్చర్యకరం.

By:  Tupaki Desk   |   15 Aug 2024 6:26 AM GMT
దేశంలో ఇప్పటివరకు జాతీయ జెండా ఎగరని గ్రామాలివే!
X

మనదేశానికి స్వాతంత్య్రం వచ్చి 78 ఏళ్లు అవుతోంది. అయితే ఇప్పటివరకు దేశంలో జాతీయ జెండా ఎగరని గ్రామాలు ఉన్నాయంటే నమ్ముతారా? అవును.. నిజంగా నిజం.. జాతీయ జెండా ఎగరంది.. పాకిస్థాన్‌ బోర్డర్‌ ఉన్న ఏ కాశ్మీర్‌ లోనో, చైనా బోర్డర్‌ ఉన్న అరుణాచల్‌ ప్రదేశ్‌ లోనో కాదు. మనదేశం మధ్య భాగంలోనే ఇప్పటివరకు జాతీయ జెండా ఎగరలేదు. ఇలాంటి గ్రామాలు ఒకటి కాదు రెండు కాదు.. ఏకంగా 13 గ్రామాలు ఉండటం నిజంగా ఆశ్చర్యకరం.

వివరాల్లోకి వెళ్తే.. ఛత్తీస్‌ గఢ్‌ రాష్ట్రంలోని దండకారణ్యం మావోయిస్టులకు రాజధానిలాంటి ప్రాంతం. దండ కారణ్యంలో భాగంగానే ఉన్న బస్తర్‌ మావోయిస్టులకు అడ్డాగా ఉంది. ఈ బస్తర్‌ ప్రాంతంలోని 13 గ్రామాల్లో ఈ 78 ఏళ్లలో ఒక్కసారి కూడా జాతీయ జెండాను ఎగరవేయకపోవడం గమనార్హం. అలాంటిది ఈసారి తొలిసారిగా ఈ గ్రామాల్లో మువ్వెన్నెల జెండా రెపరెపలాడనుంది.

ఈ 13 గ్రామాల్లో.. నెర్‌ ఘాట్‌ (దంతెవాడ జిల్లా), పానిదోబిర్‌ (కంకేర్‌), గుండం, పుట్‌ కేల్, చుత్వాహి (బీజాపూర్‌), కస్తూర్‌ మెట్ట, మస్పూర్, ఇరాక్‌ భట్టి, మొహంది (నారాయణపూర్‌), టేకలగూడెం, పువర్తి, లఖపాల్, పూలన్‌ పాడ్‌ (సుక్మా) ఉన్నాయి. ఈ గ్రామాల్లో తొలిసారి జాతీయ జెండా ఎగరనుంది.

మావోయిస్టులకు అడ్డాగా నిలిచిన బస్తర్‌ ప్రాంతంలోని ఈ 13 గ్రామాల్లో కేంద్రం పెద్ద ఎత్తున మౌలిక వసతులను చేపట్టింది. గత కొన్నేళ్లలో పెద్ద ఎత్తున మావోయిస్టులను మట్టుబెట్టింది. పెద్ద ఎత్తున భద్రతా బలగాలను మోహరించింది. ఈ నేపథ్యంలో ఇప్పటివరకు జాతీయ జెండా ఎగరని 13 గ్రామాల్లో తొలిసారి జాతీయ జెండాను ఎగరవేస్తున్నట్టు బస్తర్‌ రీజియన్‌ ఇన్‌స్పెక్టర్‌ జనరల్‌ ఆఫ్‌ పోలీస్‌ సుందర్‌ రాజ్‌ తెలిపారు.

ఈ నేపథ్యంలో 78వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను పురస్కరించుకుని ప్రభుత్వం భారీ ఎత్తున భద్రతా ఏర్పాట్లను చేపట్టింది. ఛత్తీస్‌ గఢ్‌ రాజధాని రాయపూర్‌ సహా రాష్ట్రవ్యాప్తంగా భద్రతను కట్టుదిట్టం చేశారు. ముఖ్యంగా మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో భద్రతను పెంచారు. రాజధాని రాయపూర్‌ లో ముఖ్యమంత్రి విష్ణుదేవ్‌ సాయి జాతీయ జెండాను ఎగరవేస్తారు.