గణపతి తెస్తున్న రూ.25వేల కోట్ల లెక్క తెలుసా?
గణేశ్ చతుర్థి కారణంగా ఏటా వేలాది కోట్ల రూపాయిల వ్యాపారాన్ని అందిస్తుందన్న లెక్క వేస్తున్నారు.
By: Tupaki Desk | 7 Sep 2024 4:40 AM GMTహిందువులకు పండుగలకు కొదవ లేదు. అయితే.. కొన్నింటికి మాత్రం దేశ వ్యాప్తంగా ఉన్న ప్రజలంతా ఇట్టే కనెక్టు అయిపోతుంటారు. ఆ కోవలోకే వస్తుంది వినాయక చవితి. కాలం గడిచే కొద్దీ.. అంతకంతకూ పెరిగిపోతున్న వినాయక చవితి సంబరాలు.. దేశ ఆర్థిక వ్యవస్థకు కొత్త ఊపును ఇచ్చేలా చేస్తున్న పరిస్థితి. గణేశ్ చతుర్థి కారణంగా ఏటా వేలాది కోట్ల రూపాయిల వ్యాపారాన్ని అందిస్తుందన్న లెక్క వేస్తున్నారు.
చిన్నా.. పెద్దా అన్న తేడా లేకుండా అందరూ సంబరంగా చేసుకునే ఈ పండుగ కారణంగా ఈసారి రూ.25 వేల కోట్ల వ్యాపారం జరుగుతుందని కాన్ఫెడరేషన్ ఆఫ్ ఆలిండియా ట్రేడర్స్ అంచనా వేస్తోంది. చైనీస్ వస్తువుల్ని పూర్తిగా పక్కన పెట్టేసి.. దేశీయ వస్తువులను వ్యాపారులు ప్రోత్సహిస్తున్న విషయాన్ని వ్యాపార సంఘాలు గుర్తు చేస్తున్నాయి. దేశ వ్యాప్తంగా గణేశ్ చతుర్ధి సంబరాలు భారీగా సాగుతున్నా.. మహారాష్ట్ర.. కర్ణాటక.. గుజరాత్.. రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు మధ్యప్రదేశ్.. తమిళనాడు.. గోవా లాంటి రాష్ట్రాల్లో వినాయకచవితి వేడుకలు అత్యంత ఘనంగా సాగుతాయి.
ఒక అంచనా ప్రకారం దేశ వ్యాప్తంగా దాదాపు 20 లక్షల గణేష్ మండపాల్ని ఏర్పాటు చేస్తారని సీఏఐటీ జాతీయ అధ్యక్షుడు బార్టియా అంచనా వేశారు. ఒక్క మహారాష్ట్రలోనే 7 లక్షలకు పైగా మండపాలు ఏర్పాటు చేస్తారని.. రెండో స్థానంలో కర్ణాటక (5లక్షల మండపాలు) ఉండగా.. రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు మధ్యప్రదేశ్ లో ఒక్కో రాష్ట్రంలో రెండేసి లక్షల చొప్పున మండపాలు ఏర్పాటు చేస్తున్నట్లుగా పేర్కొన్నారు.
ఒక్కో మండపానికి కనిష్ఠంగా లెక్క వేసుకున్న రూ.50వేలు అవుతుందిన.. దీంతో.. మొత్తం ఖర్చు రూ.10వేల కోట్లు అవుతుందని.. గణేశ్ విగ్రహాల వ్యాపారమే రూ.500 కోట్లకు పైగా ఉంటుందని లెక్క వేస్తున్నారు. వాస్తవ లెక్కల్లో అంతకు మించే ఉంటుందని చెప్పాలి. ఇక.. పూలు.. దండలు.. కొబ్బరికాయలతో పాటు ఇతర నిత్యవసర వస్తువులు ఆర్థిక వ్యవస్థకు మరో రూ.500 కోట్లు జోడిస్తాయన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.
వినాయక చవితి సందర్భంగా లడ్డూ ప్రసాదం ఇతర స్వీట్లకు సంబంధించిన అమ్మకాలు రూ.2వేల కోట్ల వరకు ఉంటాయని.. క్యాటరింగ్ సర్వీసులకు రూ.3వేల కోట్ల వరకు ఖర్చు చేస్తారని చెబుతున్నారు. ఇక.. పండుగ సందర్భంగా చేసే ప్రయాణాలు.. బట్టలు.. కొత్త వస్తువుల కొనుగోలు.. పెద్ద ఎత్తున నిర్వహించే ఈవెంట్లు మొత్తంగా రూ.5వేల కోట్ల వరకు ఆర్జిస్థాయని చెబుతున్నారు. మొత్తంగా వినాయక చవితి లక్షలాది మందికి ఉపాధిని ఇవ్వటమే కాదు.. భారీ ఎత్తున డబ్బుల్ని రొటేట్ చేయటంలో కీ రోల్ ప్లే చేస్తుందని చెప్పక తప్పదు.