Begin typing your search above and press return to search.

కాంగ్రెస్ లోకే రెజ్లర్ వినేశ్.. పోటీ అక్కడినుంచే.. బజరంగ్ కూడా

శత్రువుకు శత్రువు మిత్రుడు అంటారు.. రాజకీయాల్లోనూ ఇది వర్తిస్తుంది.

By:  Tupaki Desk   |   4 Sep 2024 3:30 PM GMT
కాంగ్రెస్ లోకే రెజ్లర్ వినేశ్.. పోటీ అక్కడినుంచే.. బజరంగ్ కూడా
X

శత్రువుకు శత్రువు మిత్రుడు అంటారు.. రాజకీయాల్లోనూ ఇది వర్తిస్తుంది. తమను వేధిస్తున్నవారిపై చర్యలు తీసుకోని ప్రభుత్వానికి నిరసనగా ఉద్యమించిన వారు చివరకు ఆ ప్రభుత్వానికి వ్యతిరేక పార్టీలో చేరి ప్రతీకారం తీర్చుకోనున్నారు. సగటు భారతీయ సినిమాను తలపించేలా ఉన్న ఈ సంఘటన రాజకీయాల్లో జరుగుతోంది. మేటి రెజ్లర్, ఇటీవలి ఒలింపిక్స్ లో పతకం చేజారిన వినేశ్ ఫొగట్ రాజకీయాల్లోకి అడుగుపెడుతున్నారు. అది కూడా ఓ కీలక పార్టీ నుంచి కావడం గమనార్హం.

జై బజరంగభళీ..

హరియాణా అంటేనే రెజ్లర్ల అడ్డా. వినేశ్ ఫొగట్, బబిత ఫొగట్, బజరంగ్ పూనియా వీరంతా ప్రపంచ స్థాయి రెజ్లర్లు. వీరిలో వినేశ్ గత ఏడాది భారత రెజ్లింగ్ సమాఖ్య మాజీ అధ్యక్షుడు బజరంగ్ పూనియాకు వ్యతిరేకంగా మరికొందరితో కలిసి ఆందోళనకు దిగిన సంగతి తెలిసిందే. అది అప్పట్లో దేశవ్యాప్తంగా సంచలనమైంది. ఇక ఇటీవల వినేశ్ ఒలింపిక్ పతకానికి దగ్గరైన వేళ, చేజార్చుకున్న సందర్భంలో ఆమెపై దేశమంతా అభిమానం చూపింది. అలాంటి వినేశ్ ఇక తన సొంత రాష్ట్రం హరియాణా నుంచి ఎన్నికల రంగంలోకి అడుగుపెడుతున్నారు. త్వరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు సిద్ధమయ్యారు.

పోటీ అక్కడి నుంచే.. పార్టీ అదే

వినేశ్, మరో మేటి రెజ్లర్ బజరంగ్ పూనియా ఇద్దరూ కాంగ్రెస్ లో చేరుతున్నారు. వీరు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీని కలిశారు. హరియాణాలోని జులానా నుంచి బరిలో దిగనున్నట్లు చెబుతున్నారు. ఇక్కడ జననాయక్ జనతాపార్టీ నేత అమర్జీత్ ధండా ఎమ్మెల్యేగా ఉన్నారు. పూనియా బద్లీ నుంచి పోటీకి చేస్తారని సమాచారం. హరియాణాలో ఆప్ తో పొత్తు కుదుర్చుకున్న కాంగ్రెస్ కు ఇప్పుడు రెజ్లర్ల చేరిక బలాన్నిచ్చేదే.

రైతులకు మద్దతుతోనే..

గత వారం వినేశ్ ఫొగట్ శంభూ సరిహద్దులో రైతుల ఆందోళన 200వ రోజుకు చేరిన సందర్భంగా వారికి మద్దతు తెలిపారు. అప్పుడు ఏమీ చెప్పకున్నా.. ఆమె రాజకీయాల్లోకి వస్తారని స్పష్టమైంది. కేంద్ర ప్రభుత్వాన్ని విమర్శించడం కూడా దీనికి నిదర్శంగా కనిపించింది. తాను రైతు బిడ్డనని.. వారికి అండగా ఉంటానని కూడా భరోసా కల్పించారు. ఇప్పుడు కాంగ్రెస్ లో చేరుతూ బీజేపీని సవాల్ చేస్తున్నారు.

ఈసారి మల్లయుద్ధమే

హరియాణాలో రెండు దఫాలుగా బీజేపీ ప్రభుత్వమే ఉంది. గెలిచిన రెండుసార్లూ ఖత్రీ వర్గానికి చెందిన ఖట్టర్ ను సీఎంగా చేసిన బీజేపీ ఫిబ్రవరిలో ఆయనను తప్పించి నాయబ్ సైనీకి అవకాశం ఇచ్చింది. ఖట్టర్ ను లోక్ సభ బరిలో నిలిపింది. అయితే, ఇప్పటికే ప్రజల్లో వ్యతిరేకతను ఎదుర్కొంటున్న కమలానికి 10 ఎంపీ సీట్లకు గాను 5 మాత్రమే దక్కాయి. పాలనా వైఫల్యాలు, ధరలు, నిరుద్యోగంతో ప్రజలు విసిగిపోయారు. అన్నిటికి మించి వ్యవసాయ రాష్ట్రమైన హరియాణాలో రైతులు మద్దతు ధరకు చట్టబద్ధత కోసం 200 రోజులుగా ఆందోళనలు సాగిస్తున్నారు. నిరుటి రెజ్లర్ల నిరసన హరియాణా వాసులపై తీవ్ర ప్రభావం చూపింది. ఈ నేపథ్యంలో బీజేపీకి కఠిన సవాల్ తప్పదనే అభిప్రాయం వినిపిస్తోంది. ఈ రాష్ట్రంలో 90 అసెంబ్లీ సీట్లుండగా 10 స్థానాలను ఆప్ కోరుతోంది. కాంగ్రెస్ 7 మాత్రమే ఇస్తామని చెబుతోంది. ఒక స్థానాన్ని సమాజ్ వాదీ పార్టీకి కేటాయించనుంది.