Begin typing your search above and press return to search.

కార్లతోనే కోటీశ్వరురాలు వినేశ్.. నామినేషన్ లో పేర్కొన్న ఆస్తులివే

రెజ్లింగ్ రింగ్ నుంచి ఎన్నికల రణంలోకి దూకిన వినేశ్ ఫొగాట్ కు జులానా టికెట్ ను కేటాయిచింది కాంగ్రెస్.

By:  Tupaki Desk   |   12 Sep 2024 7:30 AM GMT
కార్లతోనే కోటీశ్వరురాలు వినేశ్.. నామినేషన్ లో పేర్కొన్న ఆస్తులివే
X

ఏడాదిన్నర కిందటే ఆమె ఉద్యమించిన సమయంలో సంచలనం.. సరిగ్గా నెల కిందట పారిస్ ఒలింపిక్స్ లో ఆమె పతకాన్ని అనూహ్యంగా కోల్పోయిన వేళ పెద్ద వివాదం.. రెండు వారాల కిందట రైతులకు మద్దతుగా వీధుల్లోకి వచ్చిన సందర్భంలో ఆసక్తికరం.. ఇప్పుడు ఆమె రాజకీయాల్లోకి వచ్చి మరింత చర్చ లేపారు. ఆమె హరియాణాకు చెందిన ఒలింపియన్ వినేశ్ ఫొగాట్. ఇటీవల కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ సమక్షంలో ఆ పార్టీలో చేరిన వినేశ్ నేరుగా ఎన్నికల రణక్షేత్రంలోకి దూకారు.

రింగ్ నుంచి ఎన్నికల రణంలోకి

రెజ్లింగ్ రింగ్ నుంచి ఎన్నికల రణంలోకి దూకిన వినేశ్ ఫొగాట్ కు జులానా టికెట్ ను కేటాయిచింది కాంగ్రెస్. ఇక్కడ ఆమె బీజేపీ అభ్యర్థితో, జన నాయక్ జనతా పార్టీ అభ్యర్థితో తలపడాల్సి ఉంటుంది. కాగా, జులానాలో వినేశ్ గురువారం నామినేషన్ వేశారు. ఈ సందర్భంగా అఫిడవిట్ లో ఆస్తుల వివరాలను వెల్లడించారు.

ఆస్తులు 4 కోట్లు.. కార్లు అరకోటిపైనే..

జులానా వినేశ్ సొంత నియోజకవర్గం. దీంతోపాటు జాట్లు అధికంగా ఉండే నియోజకవర్గం. ఇక్కడ బీజేపీ తరఫున యోగేశ్‌ బైరాగి పోటీ చేస్తున్నారు. అయితే, హరియాణా ఎన్నికల్లో కాంగ్రెస్ తో పొత్తు కుదరని ఆమ్‌ ఆద్మీ పార్టీ కూడా డబ్ల్యూడబ్ల్యూఈ మహిళా రెజ్లర్‌ కవితా దలాల్‌ ను నిలబెట్టింది. నామినేషన్ సందర్భంగా రూ.4 కోట్లకు పైగా విలువైన స్థిర, చరాస్తులు ఉన్నట్లు వినేశ్‌ అఫిడవిట్‌ లో చూపారు. ఇందులో సోనిపత్‌ లో రూ.2 కోట్లు విలువ చేసే స్థిరాస్తి ఉన్నట్లు తెలిపారు. రూ.35 లక్షల వోల్వో ఎక్స్‌ సీ 60, రూ.12 లక్షల హ్యుందాయ్‌ క్రెటా, రూ.17 లక్షల విలువైన టొయోటా ఇన్నోవా కార్లు ఉన్నట్లు పేర్కొన్నారు. ఇన్నోవాపై రూ.13 లక్షలు రుణం ఉందని చూపారు. వినేశ్ భర్త సోమ్‌ వీర్‌ రాఠీ పేరిట రూ.19 లక్షల మహీంద్రా స్కార్పియో కారు ఉన్నట్లు అఫిడవిట్‌ లో పేర్కొన్నారు. వినేశ్ వద్ద రూ.1.95 లక్షల నగదు ఉంది. 3 బ్యాంకుల్లో రూ.39 లక్షల డిపాజిట్లు, సోమ్ వీర్ కు రూ.30 లక్షల వరకు బ్యాంకు డిపాజిట్లు ఉన్నాయి. వినేశ్ కు ఉన్న 35 గ్రాముల బంగారం, 50 గ్రాముల వెండి ఆభరణాల విలువ రూ.2.74 లక్షలు. సోమ్ వీర్ వద్ద 28 గ్రాముల బంగారం.. 100 గ్రాముల వెండి ఉంది.

హరియాణాలో పుట్టి.. మద్రాస్ లో డిగ్రీ

30 ఏళ్ల వినేశ్ సొంత రాష్ట్రం హరియాణ. ఇక్కడినుంచే పోటీలకు ప్రాతినిధ్యం వహించింది. అలాంటి వినేశ్ ఆశ్చర్యంగా మద్రాస్ లో డిగ్రీ చదివిందట. ఈ వివరాలను ఆమె అఫిడవిట్ లో చూపారు.