ఏం కావాలో కోరుకో.. వినేశ్ ఫొగట్‌కు హర్యానా ప్రభుత్వం బంపర్ ఆఫర్!
గత ఏడాది జరిగిన పారిస్ ఒలింపిక్స్‌లో మహిళల 50 కిలోల కుస్తీ విభాగంలో వినేశ్ ఫొగట్ అద్భుతమైన ప్రదర్శన కనబరిచారు.
By: Tupaki Desk | 27 March 2025 7:30 PMప్యారిస్ ఒలింపిక్స్-2024లో తన అద్భుతమైన పోరాట పటిమతో యావత్ భారతావనిని గర్వపడేలా చేసిన భారత రెజ్లర్, ప్రస్తుత కాంగ్రెస్ ఎమ్మెల్యే వినేశ్ ఫొగట్‌కు హర్యానా ప్రభుత్వం ప్రత్యేక ఆఫర్ ఇచ్చింది. ఒలింపిక్స్‌లో రజత పతకం సాధించిన క్రీడాకారులకు అందించే నజరానాకు బదులుగా.. రూ. 4 కోట్ల నగదు, ప్రభుత్వ ఉద్యోగం లేదా స్థలం.. ఈ మూడింటిలో ఏదో ఒకదాన్ని ఎంచుకోవాలని ప్రభుత్వం ఆమెను కోరింది.
గత ఏడాది జరిగిన పారిస్ ఒలింపిక్స్‌లో మహిళల 50 కిలోల కుస్తీ విభాగంలో వినేశ్ ఫొగట్ అద్భుతమైన ప్రదర్శన కనబరిచారు. ఫైనల్స్‌కు చేరుకున్న తొలి భారత మహిళా రెజ్లర్‌గా చరిత్ర సృష్టించినప్పటికీ.. దురదృష్టవశాత్తు ఆమె పోటీకి ముందు అనర్హురాలిగా ప్రకటించబడ్డారు. నిర్ణీత బరువు కంటే కేవలం 100 గ్రాములు ఎక్కువగా ఉండటంతో ఆమె పతకం కోసం పోటీ పడే అవకాశాన్ని కోల్పోయారు. కనీసం రజత పతకాన్ని అయినా ఇవ్వాలని ఆమె చేసిన అప్పీల్‌ను స్పోర్ట్స్ కోర్టు తిరస్కరించడంతో ఆమెకు తీవ్ర నిరాశ ఎదురైంది.
అయితే, ఫైనల్ వరకు ఆమె చేసిన పోరాటానికి దేశవ్యాప్తంగా ప్రశంసలు వెల్లువెత్తాయి. ఓడినా అందరి మనసులు గెలుచుకున్న వీరవనితగా ఆమెను కొనియాడారు. అప్పట్లో హర్యానా ముఖ్యమంత్రిగా ఉన్న నయాబ్ సింగ్ సైనీ సైతం ఆమెను అభినందిస్తూ హర్యానాకు ఆమె గర్వకారణమని ట్వీట్ చేశారు. అంతేకాకుండా రాష్ట్ర క్రీడా విధానం ప్రకారం ఒలింపిక్స్‌లో రజతం గెలిచిన వారికిచ్చే నజరానాను వినేశ్ ఫొగట్‌కు అందిస్తామని హామీ ఇచ్చారు.
కాలక్రమంలో అనూహ్య పరిణామాలు చోటుచేసుకున్నాయి. ఒలింపిక్ పతకం తృటిలో చేజారిన బాధను దిగమింగుకోలేక వినేశ్ ఫొగట్ కుస్తీకి వీడ్కోలు పలికారు. అనంతరం ఆమె రాజకీయ రంగ ప్రవేశం చేశారు. కాంగ్రెస్ పార్టీ తరపున ఝులానా నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు.
ఇటీవల జరిగిన విధాన సభ సమావేశాల్లో వినేశ్ ఫొగట్ క్రీడాకారుల కోటాలో తనకు రావాల్సిన నజరానా గురించి ప్రస్తావించారు. ముఖ్యమంత్రి ఇచ్చిన హామీని గుర్తు చేస్తూ.. ఇది కేవలం డబ్బుకు సంబంధించిన విషయం కాదని, తన గౌరవానికి సంబంధించిన అంశమని ఆమె అన్నారు.
ఈ నేపథ్యంలో మంగళవారం జరిగిన కేబినెట్ సమావేశంలో ముఖ్యమంత్రి నయాబ్ సింగ్ సైనీ ఈ విషయంపై ప్రత్యేకంగా చర్చించారు. రాష్ట్ర క్రీడా విధానం ప్రకారం వినేశ్ ఫొగట్‌కు లబ్ధి చేకూర్చాలని నిర్ణయించారు. నిబంధనల ప్రకారం ఆమెకు రూ. 4 కోట్ల నగదు బహుమతి, ప్రభుత్వ ఉద్యోగం లేదా హర్యానా షహరీ వికాస్ ప్రాధికరణ్ పథకం కింద ఒక ప్లాట్‌ను అందిస్తామని ప్రకటించారు. ఈ మూడింటిలో ఆమె దేన్ని ఎంచుకుంటారనేది వేచి చూడాలి.
కాగా, వినేశ్ ఫొగట్ ఇంకా ఈ ఆఫర్‌పై స్పందించలేదు. ఇదిలా ఉండగా, ఆమె త్వరలో తల్లి కాబోతున్నట్లు తన భర్త, రెజ్లర్ సోమ్‌వీర్ రాఠీతో కలిసి ఇటీవల శుభవార్తను పంచుకున్నారు. ఒలింపిక్స్‌లో అద్భుత ప్రదర్శనతో మెప్పించిన వినేశ్ ఫొగట్.. ఇప్పుడు ప్రభుత్వం అందించే ఈ ప్రత్యేక ఆఫర్‌పై ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి.